![షారూక్‌కు మళ్లీ చేదు అనుభవం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51471039701_625x300.jpg.webp?itok=DSBKevZ9)
షారూక్‌కు మళ్లీ చేదు అనుభవం
లాస్ ఏంజెలిస్/న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్‌కు అమెరికాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడేళ్లలో షారూక్‌ను ఇలా అదుపులోకి తీసుకోవడం ఇది మూడోసారి. దీనిపై షారూక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. భద్రతా చర్యలను అమలు చేయడం బాగానే ఉన్నా, ఇలా పదేపదే తనను అదుపులోకి తీసుకోవడం ఇబ్బందికరంగా ఉందని ట్వీట్ చేశారు. విమాన ప్రయాణాలపై అమెరికా నిషేధం విధించిన 80 వేల మంది జాబితాలో షారుఖ్ ఖాన్ అనే మరో వ్యక్తి పేరు ఉండడంతో బాలీవుడ్ బాద్షాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కాగా, షారూక్‌కు కలిగిన ఇబ్బందిపై అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా విభాగం సహాయ మంత్రి నిషా దేశాయ్ బిస్వాల్ ట్విటర్‌లో క్షమాపణ చెప్పారు. భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ. షారూక్‌కు కలిగిన ఇబ్బందిపై శుక్రవారం ఢిల్లీలో క్షమాపణ చెప్పారు. మళ్లీ ఇలాంటి సంఘటన జరక్కుండా చూస్తామన్నారు. షారూక్ స్పందిస్తూ, తన ఇబ్బందిని అర్థం చేసుకున్నందుకు వర్మకు ధన్యవాదాలు తెలిపారు.