తనిఖీల పేరుతో వేధింపులు..! | Inspections under the Harassment | Sakshi
Sakshi News home page

తనిఖీల పేరుతో వేధింపులు..!

Published Sun, Jan 3 2016 3:40 AM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

తనిఖీల పేరుతో వేధింపులు..!

తనిఖీల పేరుతో వేధింపులు..!

అమెరికా నుంచి తిరిగొచ్చిన మరో 15 మంది విద్యార్థులు
వీసాలను కొంటున్నారా..? అని అక్కడి అధికారులు ప్రశ్నించారని ఆవేదన  

 
 శంషాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో 15 మంది విద్యార్థులకు కూడా అక్కడ చేదు అనుభవమే ఎదురైంది. తనిఖీల పేరిట అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వేధింపులకు గురిచేశారని అమెరికా నుంచి తిరిగొచ్చిన తెలుగు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 28న ఇక్కడి నుంచి బయలుదేరి న్యూయార్క్ చేరుకున్న 15 మంది విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పి పంపారు. దీంతో వారు శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మీడియాతో తమ ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా కూడా.. తాము చేరబోయే ఆ యూనివర్సిటీలను నిషేధించారంటూ వెనక్కి పంపారని తిరిగొచ్చిన విద్యార్థులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పినా లెక్కచేయడం లేదన్నారు. భారతదేశం నుంచి వచ్చిన తెలుగు విద్యార్థుల పట్ల అక్కడి అధికారులు చులకన భావంతో ఉన్నారన్నారు. కొందరు విద్యార్థులకు న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో బేడీలు కూడా వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫామ్-20, వీసాలు సరిగ్గా ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులుండవని తెలపడంతోనే తాము అక్కడికి వెళ్లినట్లు వారు చెప్పారు. ఇండియాలో మీరు వీసాలు కొంటున్నారా..? అంటూ కొందరు ఇమ్మిగ్రేషన్ అధికారులు తమని ప్రశ్నించారని ఓ విద్యార్థి తెలిపాడు.
 
 ప్రభుత్వం చొరవ తీసుకోవాలి..
 అన్నింటికీ సరైన సమాధానం చెప్పినా అమెరికాలోని అధికారులు తిప్పి పంపుతున్నారు. వర్సిటీలను నిషేధించినట్లు చెబుతున్నా అసలు కారణాలు అర్థం కావడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. ఇండియా నుంచి వెళ్లిన విద్యార్థులతో అమెరికా అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి, తగు చర్యలు తీసుకోవాలి.               -సందీప్, విద్యార్థి
 
 చులకనగా చూస్తున్నారు..
 అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు భారత్ నుంచి ఉన్నత చదువుల కోసం వెళ్తున్న విద్యార్థులను చులకనగా చూస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా నిరాకరిస్తున్నారు. ఇండియాలో మీరు వీసాలు కొంటున్నారా..? అంటూ కొందరు అధికారులు ప్రశ్నించారు. అమెరికా కాన్సులేట్ అధికారులు వీసాలు అమ్ముతున్నారా..? అన్నది వారు పరిశీలించుకోవచ్చు కదా.  
- కరుణాకర్, విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement