మిస్సిస్సిపి : తల్లిదండ్రుల జాడకోసం ఓ పదకొండేళ్ల చిన్నారి పడుతున్న ఆవేదన మనసుల్ని కలచివేస్తోంది. సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా నివసిస్తున్నారనే కారణంతో మిస్సిస్సిపిలోని ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం దాడి చేశారు. అందులో పనిచేస్తున్న వందలాది మందిని అరెస్టు చేశారు. పాఠశాలకు వెళ్లిన తమ చిన్నారులు ఆందోళనకు గురవుతారని, వారిని కూడా తమతో తీసుకెళ్లండని మొరపెట్టుకున్నా వినలేదు. ఇక స్కూల్ నుంచి తిరిగొచ్చిన ఆయా కుటుంబాల చిన్నారులు తమవారి జాడలేక కన్నీరుమున్నీరయ్యారు. ఆ పిల్లలందరికీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ సమీపంలోని కమ్యూనిటీ జిమ్‌లో ఆశ్రయం కల్పించారు. అమ్మానాన్నల వద్దకు తీసుకెళ్లండని ఓ చిన్నారి అధికారుల్ని ప్రాధేయపడిన వీడియో వైరల్ అయింది.
‘నాపై కాస్త కనికరం చూపండి. మా తల్లిదండ్రుల్ని విడిచి పెట్టండి. లేదా నన్ను వారి వద్దకుచేర్చండి. మా నాన్న ఏ నేరం చేయలేదు. ఆయన నేరస్తుడేం కాదు’అని భోరుమంది. ఇక క్రిస్టియానా పెరాల్టా అనే మహిళ మాట్లాడుతూ.. ‘చిన్నారి తండ్రి అడవిలో నివసించే లాటినో జాతివారికి ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తాడు. అతన్ని ఎందుకు అరెస్టు చేశారో తెలియదు. వారంతా ఎప్పుడు కలుసుకుంటారో’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అరెస్టు చేసిన వారిలో 300 మందిని విడుదల చేయగా.. మరో 377 మంది విడుదల కావాల్సి ఉందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment