ఇస్త్రీ చేసేయ్‌.. వీసా మార్చేయ్‌! | 250 passports and fake visas and rubber stamps was seized | Sakshi
Sakshi News home page

ఇస్త్రీ చేసేయ్‌.. వీసా మార్చేయ్‌!

Published Thu, Mar 21 2019 3:38 AM | Last Updated on Thu, Mar 21 2019 11:43 AM

250 passports and fake visas and rubber stamps was seized - Sakshi

బుధవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడిస్తున్న సీపీ వీసీ సజ్జనార్‌

ఉద్యోగ వీసాను కంప్యూటర్‌లో ఫొటోషాప్‌ ద్వారా సందర్శక వీసాగా మార్చి ఇమిగ్రేషన్‌ అధికారులను బోల్తా కొట్టించి కువైట్‌కు పలువురిని అక్రమంగా తరలిస్తున్న 15 మంది ఏజెంట్లు, వారికి సహకరించిన ఇద్దరు ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది, ఒక పోలీసు కానిస్టేబుల్‌ను సైబరాబాద్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏజెంట్లు ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయం ద్వారా లైసెన్స్‌ ఏజెంట్‌ స్టాంపింగ్‌ చేసిన పాస్‌పోర్టు తమను ఆశ్రయించిన వారి చేతికి అందిన వెంటనే .. వేడిచేసిన ఇస్త్రీపెట్టెను వినియోగించి పాస్‌పోర్టుకు అంటించి అది చిరగకుండా వీసా స్టిక్కర్‌ను తొలగించి ..ఇంక్‌ రిమూవర్‌తో మిగిలిన స్టాంప్‌ను తుడిచేసి ఈ అక్రమ రవాణా సాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఎంప్లాయిమెంట్‌ వీసా మీద వెళ్లాలంటే ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఇమిగ్రాంట్స్‌ నిబంధనల ప్రకారం కువైట్‌లో ఉద్యోగం ఇచ్చే యజమాని ప్రవాసీ భారతి బీమా యోజన కింద రూ.1,50,000 వరకు ఉద్యోగిపై ఇన్సూరెన్స్‌ కట్టినట్లు రుజువు చూపాలి.ఉద్యోగ ఒప్పంద పత్రం తనిఖీ చేస్తారు. వీటినుంచి తప్పించుకునేందుకు ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’మార్గాన్ని ఎంచుకున్నారని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీపీ వీసీ సజ్జనార్‌ బుధవారం మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి 250 పాస్‌పోర్టులు, నకిలీ వీసాలు, రబ్బర్‌ స్టాంప్‌లు, 160 పోలీసు వెరిఫికేషన్‌ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్‌లతో పాటు రూ.ఐదు లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక్క మార్చి నెలలోనే నకిలీ వీసాలపై ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో పది కేసులు నమోదైనట్లు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ గుర్తించినట్లు తెలిపారు. జనవరి నుంచి 14 కేసులు నమోదైతే 71 మందిని అరెస్టు చేశామన్నారు.     
– సాక్షి, హైదరాబాద్‌ 

మెడికల్‌ ఫిట్‌ ఉంటే హైదరాబాద్‌ నుంచే... 
హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ విజయనగర్‌ కాలనీలో ఉంటున్న నెల్లూరు జిల్లా కలువాయిమండలం వెంకటరెడ్డి పాలెం గ్రామానికి చెందిన తోట కంఠేశ్వర్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ముఠా కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని కువైట్‌లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు. వీరికి విదేశాలకు పంపించే అనుమతి లేకపోవటంతో ముంబై, బెంగళూరు, శ్రీలంకలోని లీగల్‌ ఏజెంట్లను కలసి ఎంప్లాయిమెంట్‌ వీసాలు తెప్పిస్తున్నారు. పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కోసం మీ సేవలో రూ.135లు ఫీజు చెల్లించి చేవెళ్ల చిరునామాలు ఇస్తుండటంతో అక్కడి పోలీసు కానిస్టేబుల్‌ జి.మధు రూ.2,500లు తీసుకొని క్లియరెన్స్‌ ఇచ్చేవాడు.ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఇమిగ్రాంట్స్‌ నిబంధనల ప్రకారం ఎస్‌ఎస్‌సీ చదువుకోని వారు ఇమిగ్రేషన్‌ చెక్‌ రిక్వైర్డ్‌ (ఈసీఆర్‌) క్లియరెన్స్‌ను తప్పించుకునేందుకు ఎంప్లాయిమెంట్‌ వీసా స్థానంలో నకిలీ విజిట్‌ వీసాను కంప్యూటర్‌లో ఫొటోషాప్‌ ద్వారా మారుస్తున్నారు.

ఆ తర్వాత ఢిల్లీ, ముంబై రాయబార కార్యాలయాల ద్వారా లైసెన్స్‌ ఏజెంట్‌ స్టాంపింగ్‌ చేసిన పాస్‌పోర్టు తీసుకొని ఏజెంట్లు ‘ఇస్త్రీపెట్టె’వినియోగించి నకిలీ విజిట్‌ వీసాను సిద్ధం చేసేవారు. నెలరోజుల విజిట్‌ వీసాతో పాటు నకిలీ తిరుగు ప్రయాణ టికెట్‌లను గల్ఫ్‌ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగి మహమ్మద్‌ ముజీబ్‌ ఖాన్, ఒమన్‌ ఎయిర్‌ ఉద్యోగి అనప్ప రెడ్డి రామలింగారెడ్డి సమకూర్చి సహకరిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు చెందిన పలువురిని కువైట్‌కు పంపించినట్టు తేలింది. ఈ ముఠా సభ్యులైన తోట కంఠేశ్వర్, సురేందర్, నర్సింహ, అనిల్‌ కుమార్, యుగంధర్, వినయ్‌ కుమార్, వెంకటసుబ్బారాయుడులను పోలీసులు అరెస్టు చేశారు.చేవెళ్ల పోలీసు కానిస్టేబుల్‌ మధును కూడా అరెస్టు చేశారు. ఇతర పోలీసుల పాత్రపైనా ఆరా తీస్తున్నామని సీపీ సజ్జనార్‌తెలిపారు.

మెడికల్‌ అన్‌ఫిట్‌ అయితే శ్రీలంక నుంచి... 
హైదరాబాద్‌లోని ఆరు ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు చేయించే ఈ ముఠా ఫిట్‌ ఉంటే శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆశ్రితులను కువైట్‌కు పంపించేవారు.ఎవరైనా అన్‌ఫిట్‌ అని తేలితే ట్రాన్సిట్‌ పాస్‌పోర్టుపై ఏడు రోజుల వీసాతో శ్రీలంకకు పంపించే బాధ్యతను 8 మంది సభ్యులతో కూడిన పుష్ప అనే ఆమె నేతృత్వంలోని మరో ముఠా చూసుకునేది. ఈ ముఠాలో ఉన్న ఏపీకి చెందిన గెడ్డం శశి, చింతల సాయిరామ్‌కుమార్, షేక్‌ అక్రమ్, పిల్లి శ్రీకర్, అకరం బాలకృష్ణ, షేక్‌ ఖాదర్‌ బాషా, పూసపాటి రామకృష్ణ, విజయభాస్కర్‌ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. 
పోలీసులకు పట్టుబడ్డ నిందితులు 

ఇలా చేస్తే మేలు... 
విదేశాల్లో పనిచేసేందుకు వెళ్లేందుకు రిజిస్టర్డ్‌ ఏజెంట్ల కోసం ఇమిగ్రేట్‌.జీవోవీ.ఇన్‌లో తెలుసుకోవాలి. నాంపల్లిలోని ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఇమిగ్రెంట్స్‌ ఆఫీసులో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో వివరాలు నమోదుచేసుకుంటే విదేశాలలో మెడికల్‌ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది.అక్కడ పనిచేసే ప్రాంతంలో వేధింపులకు గురికాకుండా అక్కడి భారత ప్రభుత్వ రాయబార కార్యాలయం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎవరైనా ఏజెంట్లు మాయమాటలు చెప్పి పాస్‌పోర్టులు, డబ్బులు తీసుకుంటే వాటిని వెనక్కి తీసుకోవాలని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement