సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో అందించిన ట్యాబ్‌ల్లో 99 శాతం బాగున్నాయని అధికారులు గుర్తించారు. కేవలంఒక్క శాతం ట్యాబ్‌ల్లో మాత్రమే రిపేర్లున్నాయని చెబుతున్నారు.
పది రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న పాఠశాల విద్యాశాఖ ఐటీ విభాగం, జిల్లా నోడల్ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ట్యాబ్‌లను పరిశీలించి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసి ఇస్తున్నారు. స్క్రీన్లు పగిలిపోయినవి అత్యధికంగా ఉండగా, కొన్ని టాబ్స్‌లో ఎస్‌డీ కార్డులు తొలగించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. మొత్తం ట్యాబ్‌ల్లో ఇలాంటివి 4,800 వరకు ఉన్నట్టు తేలింది. స్క్రీన్లు పగిలిపోయిన వాటికి ప్రభుత్వమే కొత్తవి అమర్చి విద్యార్థులకు ఇవ్వనుంది.
తల్లిదండ్రులపై భారం పడకుండా..
ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు గత డిసెంబర్‌లో 5,18,740 ట్యాబ్స్‌ను బైజూస్ కంటెంట్‌తో ప్రభుత్వం పంపిణీ చేసింది. భౌతిక నష్టం (ఫిజికల్ డ్యామేజీ) మినహా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎలాంటి ఖర్చు లేకుండా సరిచేసి ఇచ్చేలా మూడేళ్ల వారంటీతో వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. స్క్రీన్లు పగిలిపోయిన 3వేల పైచిలుకు ట్యాబ్‌లకు కొత్తవి అమర్చాలంటే కనీసం రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. ఇంత భారం విద్యార్థుల తల్లిదండ్రులపై పడకూడదనే ఉద్దేశంతో ఆ ఖర్చును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది.
ఎస్‌డీ కార్డు మార్చినవి కొన్నే..
కొందరు విద్యార్థులు తెలిసీ తెలియక ట్యాబ్స్‌లోని ఎస్‌డీ కార్డును తొలగించడంతో అవి పనిచేయడం లేదు. ఇలాంటివి సుమారు 1,500 నుంచి 1,800 వరకు ఉన్నట్టు గుర్తించారు. ట్యాబ్స్ కొనుగోలు చేసినప్పుడే ప్రతి విద్యార్థికి ఎస్‌డీ కార్డు తొలగించవద్దని సూచించినా కొందరు దీన్ని పాటించకపోవడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాటిని సైతం సరిచేసి అందిస్తున్నారు.
ఇకపై విద్యార్థులు ఎస్‌డీ కార్డు తొలగిస్తే వెంటనే గుర్తించేలా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని ట్యాబ్స్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. ట్యాబ్‌లో ఇచ్చిన కంటెంట్ మినహా ఇంటర్నెట్ కంటెంట్ అప్‌లోడ్, డౌన్‌లోడ్ చేసేందుకు అవకాశం లేకుండా కొత్త సాఫ్ట్‌వేర్ రూపొందించారు. దీంతోపాటు గూగుల్ అథెంటికేటర్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసి ట్యాబ్స్‌కు పటిష్ట రక్షణ కల్పించారు.
ఇకపై ట్యాబ్‌ను ట్యాంపరింగ్ చేస్తే వెంటనే సంబంధిత జిల్లా నోడల్ అధికారులకు ఓటీపీ మెస్సేజ్ వెళ్లడంతో పాటు ఆయా ట్యాబ్ సేవలు నిలిచిపోతాయి. ట్యాంపర్ చేశారా..? లేక ఎస్‌డీ కార్డు మార్చారా? అనేది కూడా అధికారులకు తెలిసిపోతుంది. ఏ విద్యార్థి ట్యాబ్‌లో మార్పులు చేసేందుకు యత్నించారో జిల్లా నోడల్ అధికారుల నుంచి సంబంధిత స్కూలు హెచ్‌ఎంకు మెస్సేజ్ వెళుతుంది. అధికారులకు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే తిరిగి ట్యాబ్ పనిచేస్తుంది.
సక్రమంగా వినియోగించాలి..
విద్యార్థులు విజ్ఞానవంతులుగా ఎదగాలని, వారికి ఉత్తమ భవిష్యత్ అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ట్యాబ్స్‌ను అందించింది. వాటిని సక్రమంగా వాడుకోవాలి. ప్రస్తుతం స్క్రీన్ పాడైన వాటికి ఉచితంగానే కొత్తవి అమర్చాలని ఆదేశించాం. సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించే యంత్రాంగం కూడా ఉంది.
సాఫ్ట్‌వేర్ ఇబ్బందులుంటే స్థానిక సచివాలయం డిజిటల్ అసిస్టెంట్‌కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా వారికోసం మాన్యువల్‌గా రశీదు కూడా ఇస్తారు. ట్యాబ్స్ సర్విస్ కోసం రాష్ట్రంలో 145 శామ్‌సంగ్ సరీ్వస్ సెంటర్లున్నాయి. గరిష్టంగా 3 రోజుల్లో రిపేరు చేసి తిరిగి విద్యార్థికి అందిస్తారు. – కాటమనేని భాస్కర్, పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment