దారిద్య్రం
నగరంలో రోడ్ల విస్తీర్ణం 762.015 కి.మీ
దెబ్బతిన్న రహదారులు 120.34 కి.మీ
అడ్డగోలు తవ్వకాలతో ధ్వంసం
పట్టించుకోని అధికారగణం
ప్యాచ్ వర్కులతో సరి
వర్షం పడితే మళ్లీ యథాతథ స్థితి
ఊరు గతి ఇంతే.. రోడ్డు గతుకింతే..
రోడ్డున్న ఊరికీ సుఖము లేదంతే..
..అని పాడుకోవాల్సి వస్తోంది నగర రోడ్ల దుస్థితిని చూసి. ఆర్ అండ్ బీ రహదారుల నుంచి డివిజన్‌లోని గల్లీ వరకూ మరమ్మతులకు నోచుకోని ఏ రోడ్డులో ప్రయాణించినా ఒళ్లు హూనం కావాల్సిందే. నిత్యం గుంతల రోడ్ల మీదుగా వెళ్లే అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారా.. అనే అనుమానం సామాన్యుడికి కలగక మానదు. ముఖ్యమంత్రో, మంత్రులో వచ్చినప్పుడు మాత్రం మసిపూసి మారేడుకాయ చేసిన చందాన అప్పటికప్పుడు ప్యాచ్‌వర్క్‌లు పూర్తిచేసి కవరింగ్ ఇస్తారు. గట్టిగా వర్షం పడినా, లోడు లారీ ఆ రోడ్డుపై వెళ్లినా కథ మళ్లీ మొదటికొస్తోంది. ఈ అతుకుల గతుకుల రోడ్లపై నరకప్రాయమైన ప్రయాణం సంగతి అటుంచితే..
నడవడం కూడా కష్టమేనని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది.
విజయవాడ సెంట్రల్ : నగరంలోని ప్రధాన రహదారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా భాసిల్లుతున్న విజయవాడలో రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. నిధులలేమి నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారులు ప్యాచ్ వర్కులతో సరిపెడుతున్నారు. అవి కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. ఫలితంగా గతుకుల రోడ్లపైనే ప్రజలు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. నగరంలో 762.015 కిలోమీటర్ల మేర కార్పొరేషన్ రోడ్లు విస్తరించి ఉన్నాయి. శాఖల మధ్య సమన్వయలోపం, ముందస్తు ప్రణాళికలు కొరవడటంతో నిర్మించిన కొద్దిరోజులకే రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నగరంలో 120.34 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయన్నది అం చనా. ఒకటి, రెండు సర్కిళ్ల పరిధిలో రోడ్లు ఎక్కువగా ఛిద్రమయ్యాయి.
అంతంతమాత్రమే..
రోడ్ల నిర్మాణంలో నగరపాలక సంస్థ నాణ్యతా ప్రమాణాలను సక్రమంగా పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. నాసిరకం మెటీరియల్‌తో హడావుడిగా వర్కులు పూర్తిచేయడం వల్లే రోడ్లు దెబ్బతింటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, నీటిపైపులు, టెలిఫోన్, విద్యుత్ లైన్ల ఏర్పాటు.. ఇలా ఏదో ఒక కారణంతో రోడ్లను పగలకొడుతున్నారు. సంబంధిత శాఖల నుంచి లేదా ప్రయివేటు సంస్థల నుంచి డబ్బులు వసూలు చేసినప్పటికీ పనులు పూర్తయ్యాక రోడ్లను పూడ్చడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మ్యాన్‌హోల్స్ రోడ్డు కంటే ఎక్కువ లోతులో ఉండటం వల్ల గోతులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి వాహనచోదకులు జారి పడిపోతున్నారు. ఇక వర్షం వచ్చినప్పుడైతే ప్రయాణం నరకమే.
దెబ్బతీస్తున్న డ్రెయిన్లు
నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రహదారులు తరచూ కోతకు గురవుతున్నాయి. స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల వరదలు వచ్చినప్పుడు ఆ ప్రభావం రహదారులపై పడుతోంది. హౌసింగ్ బోర్డులు, ఉడాలు నగరంలో కాలనీలు నిర్మించాయి. కొత్తగా కాలనీలు ఏర్పాటుచేసే సందర్భంలో మురుగు, వర్షపునీరు సక్రమంగా పోయేందుకు డ్రెయిన్లు, రోడ్లను తగిన ఎత్తులో నిర్మించాల్సి ఉన్నప్పటికీ అలా జరక్కపోవడంతో వర్షం వస్తే రోడ్లు నీట మునిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
మాకు ఇచ్చేయండి : కార్పొరేషన్
ఏలూరు, బందరు కెనాల్, సీకే రెడ్డి, కేటీ రోడ్లను ఆర్‌అండ్‌బీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 70.12 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రహదారుల్ని తమకు అప్పగించాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులు, ఆర్‌అండ్‌బీకి ఇటీవలే లేఖ రాశారు. విజయవాడ రాజధాని నగరంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు తరచూ వచ్చి పోతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లు మరమ్మతులకు గురైతే పనులు ఎవరు చేయాలనే దానిపై స్పష్టత కొరవడుతోంది. ఈ క్రమంలో ప్రధానమైన రహదారుల్ని తమకు అప్పగించాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులు కోరుతు
న్నారు.
రూ.30 కోట్లతో పనులు
స్పెషల్ గ్రాంట్, 13వ ఫైనాన్స్ నిధులు రూ.30 కోట్లతో నగరంలో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టాం. ఇందులో 200 రోడ్డు పనులు ఉన్నాయి. మరో నెలన్నరలో పూర్తవుతాయి. అప్పుడు రహదారి కష్టాలు తీరతాయి. స్వల్పంగా దెబ్బతిన్న రోడ్లకు నాలుగు నెలల క్రితమే ప్యాచ్ వర్కులు పూర్తిచేశాం. నైజాంగేటు వద్ద కల్వర్టు, డ్రెయిన్ల నిర్మాణానికి గానూ ఇటీవలే రైల్వేశాఖకు రూ.7.20 కోట్లు చెల్లించాం. పనులు జరుగుతున్నాయి.
- ఎంఏ షుకూర్,
చీఫ్ ఇంజినీర్, నగరపాలక సంస్థ