R & B roads
-
నాలుగు రోజులకే రోడ్లు ఛిద్రం
జిల్లాలో పలు ప్రాంతాల్లో అర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు వేసిన రోడ్లలో నాణ్యత లోపించింది. కమీషన్లకు అలవాటు పడ్డ అధికారులు నాణ్యత గురించి పట్టించు కోవడం లేదనే విమర్శలున్నాయి. రోడ్ల మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ఫలితంగా రోడ్లు వేసిన నాలుగు రోజులకే ఛిద్రమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పలు రోడ్లు అడుక్కొక గొయ్యి, గజానికో గుంటలుగా మారాయి. - కోట్ల రూపాయలు రోడ్డు పాలు - కమీషన్లుకు అలవాటు పడ్డ అధికారులు - జిల్లాలో 3,272 కి.మీ. ఆర్అండ్బీ రోడ్లు - 5,052 కి.మీ. పీఆర్ రోడ్లు నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో 3,272 కిలోమీటర్ల ఆర్అండ్బీ, 5,052 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఆర్‌కు సంబంధించి సుమారు రూ.120 కోట్లతో 84 పనులు చేపట్టారు. వాటిలో 60కు పైగా రోడ్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీకి సంబంధించి 46 పనులు మంజూరు చేశారు. రూ.91 కోట్లు కేటాయించారు. 46 రోడ్డు పనుల్లో 10కి పైగా టెండర్ల దశలో ఉన్నాయి. మిగిలిన పనులు జరుగుతున్నాయి. అధ్వానంగా ఉన్న రోడ్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న బీటీ రోడ్లపై రోడ్లు వేస్తున్నారు. ఈ ప్రక్రియ సంవత్సరం మొత్తం జరుగుతుంది. చిన్నపాటి వర్షానికే...: చిన్నపాటి వర్షానికే ఈ రోడ్లు దెబ్బతింటున్నాయి. గ్రామీణ ప్రాంతాల రోడ్లలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. గూడూరు, రాపూరు, కలువాయి, ఆత్మకూరు, వెంకటగిరి, మర్రిపాడు, జలదంకి, బోగోలు తదితర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సోమశిల జలాశయం నుంచి పరమానందయ్య ఆశ్రమం వరకు 20 సంవత్సరాల కిందట బీటీ రోడ్డు వేశారు. నేటికీ అది చెక్కుచెదరలేదు. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. రోడ్డ్డు కాంట్రాక్టర్లకు వరాలిచ్చే గనులుగా ఉన్నాయి. ప్రజలకు ఉపయోగం ఉండడంలేదు. అధికారులు కుడా కాంట్రాక్టర్లకు అనుకులంగా పనులు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రామల్లో నిర్మించిన గ్రావెల్ రోడ్లు తుతూ మంత్రంగా వేస్తున్నారు. సమీపంలోని ప్రాంతాల్లోని గులకను తీసుకువచ్చి రోడ్లు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బీటీ రోడ్డు వేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించాలి. అయితే వీరు నామ మాత్రంగా పరిశీలించి వారికి రావలసిన వాటాను పుచ్చుకుంటున్నారనే విమర్శలున్నాయి. నాణ్యత లోపిస్తే సహించేదిలేదు: ప్రతి నెలా రోడ్డు పనులు జరుగుతుంటాయి. అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతాం. అనుమతి వచ్చిన తరువాత టెండర్లు నిర్వహిస్తాం. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన తరువాత పనులు చేపడతాం. రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేదిలేదు. నాణ్యత లేకుండా రోడ్డు వేస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు చేపడతాం. -విజయకుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ -
దారిద్య్రం
నగరంలో రోడ్ల విస్తీర్ణం 762.015 కి.మీ దెబ్బతిన్న రహదారులు 120.34 కి.మీ అడ్డగోలు తవ్వకాలతో ధ్వంసం పట్టించుకోని అధికారగణం ప్యాచ్ వర్కులతో సరి వర్షం పడితే మళ్లీ యథాతథ స్థితి ఊరు గతి ఇంతే.. రోడ్డు గతుకింతే.. రోడ్డున్న ఊరికీ సుఖము లేదంతే.. ..అని పాడుకోవాల్సి వస్తోంది నగర రోడ్ల దుస్థితిని చూసి. ఆర్ అండ్ బీ రహదారుల నుంచి డివిజన్లోని గల్లీ వరకూ మరమ్మతులకు నోచుకోని ఏ రోడ్డులో ప్రయాణించినా ఒళ్లు హూనం కావాల్సిందే. నిత్యం గుంతల రోడ్ల మీదుగా వెళ్లే అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారా.. అనే అనుమానం సామాన్యుడికి కలగక మానదు. ముఖ్యమంత్రో, మంత్రులో వచ్చినప్పుడు మాత్రం మసిపూసి మారేడుకాయ చేసిన చందాన అప్పటికప్పుడు ప్యాచ్‌వర్క్‌లు పూర్తిచేసి కవరింగ్ ఇస్తారు. గట్టిగా వర్షం పడినా, లోడు లారీ ఆ రోడ్డుపై వెళ్లినా కథ మళ్లీ మొదటికొస్తోంది. ఈ అతుకుల గతుకుల రోడ్లపై నరకప్రాయమైన ప్రయాణం సంగతి అటుంచితే.. నడవడం కూడా కష్టమేనని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. విజయవాడ సెంట్రల్ : నగరంలోని ప్రధాన రహదారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా భాసిల్లుతున్న విజయవాడలో రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. నిధులలేమి నేపథ్యంలో ఇంజినీరింగ్ అధికారులు ప్యాచ్ వర్కులతో సరిపెడుతున్నారు. అవి కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. ఫలితంగా గతుకుల రోడ్లపైనే ప్రజలు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. నగరంలో 762.015 కిలోమీటర్ల మేర కార్పొరేషన్ రోడ్లు విస్తరించి ఉన్నాయి. శాఖల మధ్య సమన్వయలోపం, ముందస్తు ప్రణాళికలు కొరవడటంతో నిర్మించిన కొద్దిరోజులకే రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నగరంలో 120.34 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయన్నది అం చనా. ఒకటి, రెండు సర్కిళ్ల పరిధిలో రోడ్లు ఎక్కువగా ఛిద్రమయ్యాయి. అంతంతమాత్రమే.. రోడ్ల నిర్మాణంలో నగరపాలక సంస్థ నాణ్యతా ప్రమాణాలను సక్రమంగా పాటించలేదనే విమర్శలు ఉన్నాయి. నాసిరకం మెటీరియల్‌తో హడావుడిగా వర్కులు పూర్తిచేయడం వల్లే రోడ్లు దెబ్బతింటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, నీటిపైపులు, టెలిఫోన్, విద్యుత్ లైన్ల ఏర్పాటు.. ఇలా ఏదో ఒక కారణంతో రోడ్లను పగలకొడుతున్నారు. సంబంధిత శాఖల నుంచి లేదా ప్రయివేటు సంస్థల నుంచి డబ్బులు వసూలు చేసినప్పటికీ పనులు పూర్తయ్యాక రోడ్లను పూడ్చడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మ్యాన్‌హోల్స్ రోడ్డు కంటే ఎక్కువ లోతులో ఉండటం వల్ల గోతులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి వాహనచోదకులు జారి పడిపోతున్నారు. ఇక వర్షం వచ్చినప్పుడైతే ప్రయాణం నరకమే. దెబ్బతీస్తున్న డ్రెయిన్లు నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రహదారులు తరచూ కోతకు గురవుతున్నాయి. స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల వరదలు వచ్చినప్పుడు ఆ ప్రభావం రహదారులపై పడుతోంది. హౌసింగ్ బోర్డులు, ఉడాలు నగరంలో కాలనీలు నిర్మించాయి. కొత్తగా కాలనీలు ఏర్పాటుచేసే సందర్భంలో మురుగు, వర్షపునీరు సక్రమంగా పోయేందుకు డ్రెయిన్లు, రోడ్లను తగిన ఎత్తులో నిర్మించాల్సి ఉన్నప్పటికీ అలా జరక్కపోవడంతో వర్షం వస్తే రోడ్లు నీట మునిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మాకు ఇచ్చేయండి : కార్పొరేషన్ ఏలూరు, బందరు కెనాల్, సీకే రెడ్డి, కేటీ రోడ్లను ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 70.12 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రహదారుల్ని తమకు అప్పగించాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులు, ఆర్‌అండ్‌బీకి ఇటీవలే లేఖ రాశారు. విజయవాడ రాజధాని నగరంగా రూపాంతరం చెందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు తరచూ వచ్చి పోతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లు మరమ్మతులకు గురైతే పనులు ఎవరు చేయాలనే దానిపై స్పష్టత కొరవడుతోంది. ఈ క్రమంలో ప్రధానమైన రహదారుల్ని తమకు అప్పగించాల్సిందిగా నగరపాలక సంస్థ అధికారులు కోరుతు న్నారు. రూ.30 కోట్లతో పనులు స్పెషల్ గ్రాంట్, 13వ ఫైనాన్స్ నిధులు రూ.30 కోట్లతో నగరంలో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టాం. ఇందులో 200 రోడ్డు పనులు ఉన్నాయి. మరో నెలన్నరలో పూర్తవుతాయి. అప్పుడు రహదారి కష్టాలు తీరతాయి. స్వల్పంగా దెబ్బతిన్న రోడ్లకు నాలుగు నెలల క్రితమే ప్యాచ్ వర్కులు పూర్తిచేశాం. నైజాంగేటు వద్ద కల్వర్టు, డ్రెయిన్ల నిర్మాణానికి గానూ ఇటీవలే రైల్వేశాఖకు రూ.7.20 కోట్లు చెల్లించాం. పనులు జరుగుతున్నాయి. - ఎంఏ షుకూర్, చీఫ్ ఇంజినీర్, నగరపాలక సంస్థ -
ఎంపీడీఓలదే బాధ్యత
- అంగన్వాడీల పనితీరుపై నివేదికలివ్వాలి - ఆర్అండ్బీ రోడ్లకు రూ.10 వేల కోట్లు - ఆర్అండ్బీ, మహిళాశిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల - గజ్వేల్ నియోజకవర్గంలో విస్తృత పర్యటన గజ్వేల్: అంగన్వాడీల పనితీరును ఎంపీడీఓలు సైతం పర్యవేక్షించవచ్చని రోడ్లు, భవనాలు, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. అంతేగాక వారి పనితీరుపై ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలందించాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖకు ఈ ఏడాది రూ.1,600 కోట్లను కేటాయిం చినట్టు చెప్పారు. బాలింతలు, ఐదేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆదివారం ఆయన నియోజక వర్గంలోని ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాల్లో పర్యటించారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో రూ.20కోట్ల వ్యయంతో చేపట్టనున్న కొడకండ్ల-జగదేవ్‌పూర్ బీటీ డబుల్ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి అభివృద్ధికి బాటలు వేస్తున్నట్టు చెప్పారు. నాలుగేళ్లలో తెలంగాణ రూపురేఖలే మారబోతున్నాయని తెలిపారు. మెరుగైన రోడ్ల ద్వారానే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకే ఆర్అండ్బీ రోడ్లకు ఇటీవల రూ.10 వేల కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా మెదక్ జిల్లాకు రూ.1,100 కోట్లు, ఖమ్మం జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్టు స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ పథకంతో పల్లెల్లోనూ మంచి నీటి సమస్య తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా మారబోతున్నదన్నారు. ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్నమల్లయ్య, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షులు మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పండరి రవీందర్రావు, గ్రామ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐలా... హైలెస్సా!
ఐలా బాధ్యతలూ జీహెచ్ఎంసీకే... ప్రభుత్వ యోచన ముమ్మర కసరత్తు జీహెచ్ఎంసీ బాధ్యతలు ... నిర్వహణ పరిధి విస్తృతమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల సేవలను తాను అందించడమేకాక... వాటి ఆదాయాన్ని పొందే అధికారాలు జీెహ చ్‌ఎంసీకి దఖలు పడుతున్నాయి. వీటి ద్వారా సేవలు మెరుగు పడతాయనేది ప్రభుత్వ యోచన. రహదారుల నుంచి నీటి సరఫరా వరకూ విభిన్న విభాగాల పనులు ఇకపై జీహెచ్ఎంసీకి అప్పగించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. సిటీబ్యూరో: గ్రేటర్‌లోని వివిధ విభాగాలు, వాటి నిర్వహణ బాధ్యతలు ఒక్కటొక్కటిగా జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తున్నాయి. మరికొన్ని క్యూలో ఉన్నాయి. ఇప్పటికే ఆర్ అండ్ బీ రహదారులు, హెచ్ఎండీఏ అధీనంలోని కొన్ని పార్కులు జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లాయి. తాజాగా తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బాధ్యతలూ ఆ సంస్థకేఅప్పగించే ఆలోచన లో ప్రభుత్వం ఉంది. మంత్రిమండలి ఉపసంఘం సైతం దీనికేమొగ్గు చూపింది. పనిలో పనిగా ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ)ల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తిపన్ను వసూలు బాధ్యతలూ జీహెచ్ఎంసీకే అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది. తమ పరిధిలోని నివాస ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతులతో పాటు ఆస్తిపన్ను వసూళ్లను ప్రస్తుతం ఐలాలే చేస్తున్నాయి. పారిశుద్ధ్య కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు చేపడుతున్నందుకు కొన్ని ప్రాంతాల్లో ఆస్తి పన్నులో 35 శాతం, మరికొన్ని ప్రాంతాల్లో 50 శాతం జీహెచ్ఎంసీకి చెల్లిస్తున్నాయి. సదుపాయాల కల్పనకు... సిబ్బంది కొరత వంటి కారణాలతో వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్నును ఐలాలు వసూలు చేయలేకపోతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. నిధుల లేమితో ఐలాల పరిధిలోని కాలనీల్లో రహదారుల నిర్వహణ, పార్కుల వంటి సదుపాయాలు లేవు. దీంతో వీటిని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లోనూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించి మూడేళ్లు దాటింది. మరోవైపు ఐలాలకు భవన నిర్మాణ అనుమతులివ్వడం, ఆస్తిపన్ను వసూలు వంటి అధికారాలు లేవని, చట్ట ప్రకారం అవి చెల్లవనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు జీహెచ్ఎంసీయే సదుపాయాలు కల్పిస్తే మేలని ప్రభుత్వ భావన. ఇప్పటికే ఆర్ అండ్ బీ రహదారులను జీహెచ్ఎంసీ పరం చేయగా... జలమండలి నుంచి నీరు కొనుగోలు చేసి... జీహెచ్ఎంసీ సరఫరా చేయాలనేది ఆలోచన. దాంతో పాటు ఐలాల పరిధిలోనూ జీహెచ్ఎంసీయే మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలు ఉన్నాయి. వీటికి విధి విధానాలు రూపొందించేందుకు.. ఎవరు ఏం చేస్తే బాగుంటుందో నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మౌలిక సదుపాయాలు, ఆస్తిపన్ను వసూళ్లు, రహదారుల నిర్వహణపై నివేదిక రూపొందించి, తరువాతి సమావేశంలో అందించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి సూచించినట్లు సమాచారం. ఆ సమావేశంలో ఐలాలపై నిర్ణయం తీసుకోనున్నారు. జీహెచ్ఎంసీలో 14 ఐలాలు ఉండగా, వాటి పరిధిలో మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, నాచారం, మల్లాపూర్, పటాన్చెరు, సనత్‌నగర్, జీడిమెట్ల తదతర ప్రాంతాల్లోని నివాస కాలనీలు ఉన్నాయి. -
ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి చేస్తాం - మంత్రి శిద్దా
ఒంగోలు సెంట్రల్ : రాష్ట్రంలోని అన్ని ఆర్అండ్బీ రోడ్లను అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దారాఘవరావు అన్నారు. ఒంగోలు లాయర్ పేటలోని మంత్రి నివాసంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డబుల్ లైన్ల రహదారులను, నాలుగు లైన్ల రహదారులుగా, నాలుగు లైన్ల రహదారులను 6, 8 లైన్ల రహదారులుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీకి నూతనంగా 1200 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. నెలకు 400 బస్సులను రోడ్ల మీదకు తెస్తామన్నారు. మొత్తం మార్చిలోపు పాత బస్సుల స్థానం లో నూతన బస్సులను ప్రవేశపెడతామన్నారు. ప్రయివేట్ బస్ ఆపరేటర్లతో తిరుపతిలో సమావేశం నిర్వహిం చి బస్సు టికెట్ రేట్ల విషయంలో హెచ్చరించినట్లు తెలిపారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాల బస్సు స్టాండ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి బస్సు స్టాప్‌లో సెంట్రల్ ఏసీని, అండర్ గ్రౌండ్ ప్లాట్‌ఫారాలను రూ.350 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. దొనకొండలో ఇండస్ట్రియల్కారిడార్ను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో వెటర్నరీ యూనివర్శిటీ, మినరల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. -
గుండెలు గల్లంతే !
నాగరికతకు చిహ్నాలుగా నిలవాల్సిన రహదారులు నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. అడుగుకో అతుకు... గజానికో గుంతతో పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లపై ప్రయాణం అంటేనే ప్రజలు గుం డెలు పట్టుకుంటున్నారు. జిల్లాలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్టు ఆ శాఖ అధికారుల వద్ద ఉన్న లెక్కలు ప్రయాణికుల దురవస్థకు అద్దంపడుతున్నాయి. పొరుగునే కొత్త రాజధాని ఏర్పాటు కానున్న నేపథ్యంలో నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన రోడ్లు నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాల్సిన పాలకులు మీనమేషాలు లెక్కించడం విస్మయానికి గురిచేస్తోంది. సాక్షి, గుంటూరు జిల్లాలో ఆర్ అండ్ బీ పరిధిలోని రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారిక సమాచారం. తాత్కాలిక మరమ్మతులు కూడ చేపట్టకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. కొన్ని చోట్ల మోకాలి లోతు గుంతలు ఏర్పడ టంతో ప్రయాణం అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ముఖ్యంగా తెనాలి డివిజన్లో అధికంగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక్కడ నల్లరేగడి నేలలతోపాటు, కాలువలు నీటి సాకర్యం ఎక్కువగా ఉండటం వల్ల ఈ డివిజన్ల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రోడ్లకు ఇరువైపుల కంపచెట్లు పెరిగాయి, బర్మ్‌లు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం ఇంత వరకు నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం. {పభుత్వం కొత్త రోడ్లను మంజూరు చేయకపోగా పురోగతిలో ఉన్న పనులను సైతం నిలిపివేసింది. దీంతో రోడ్లు భవనాల శాఖ పరిధిలో పనులు ప్రస్తుతం ఆగిపోయాయి. ప్రతిపాదనలతోనే సరి... జిల్లాలో కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపడం మినహా ప్రభుత్వం నుంచి నిధులు మాత్రం మంజూరు కావడం లేదు. కర్నూలు-గుంటూరు దాదాపు 300 కిలో మీటర్ల మేర రహదారిని నేషనల్ హైవేకు అప్పజెపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు గుంటూరు-పర్చూరు, కొండమోడు-పేరేచర్ల, గుంటూరు-తెనాలి, గుంటూరు- బాపట్ల రోడ్లలను నాలుగు లేన్ల రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొత్త రాజధాని అని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొంది. జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేసే నిమిత్తం వాటిని పరిశీలించేందుకు ఇటీవలే క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీరు వెంకటరెడ్డి సైతం జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించారు. రూ. 21 కోట్లతో ప్రతిపాదనలు.. జిల్లాలో రోడ్ల నిర్వహణ కోసం రూ. 21కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే వెంటనే మరమ్మతు లు చేపడతాం. - రాధాకృష్ణ, ఆర్ అండ్ బీ ఎస్ఈ, గుంటూరు. -
ఏటా కోటి మొక్కలు
ఏలూరు : జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం కింద మొక్క లు నాటేందుకు డ్వామా, సామాజిక అటవీ విభాగాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ కార్యక్రమం కింద ఏటా కోటి మొక్కలు నాటాలని నిర్ణయించాయి. ప్రభుత్వ కార్యాలయూలు, ఇరిగేషన్ స్థలాలు, ప్రైవేటు స్థలాలతోపాటు ఆర్ అండ్ బీ రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే సామాజిక వన విభాగం ఏటా 50 లక్షల మొక్కలను పాఠశాలలు, ప్రభుత్వ కార్యాల యూలు, వివిధ సంస్థలకు పంపిణీ చేస్తోంది. ఇకపై ఏటా కోటి మొక్కలు నాటించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి. అయితే, మన జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే అడవులున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఏటా కోటి మొక్కల్ని నాటడం ద్వారా ఈ విస్తీర్ణాన్ని పెంచాలనే లక్ష్యంతో ఉన్నారు. ఐదేళ్ల ప్రణాళిక జిల్లాలో నీరు-చెట్టు పథకం కింద 2015 నుంచి ఐదేళ్లపాటు పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు నిర్ణయించామని సామాజిక వనవిభాగం అధికారి ఎం.శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో నీడనిచ్చే మొక్కలు, చిన్నపాటి కలపనిచ్చే మొక్కలు నాటిస్తామన్నారు. రైతులకు సంబంధించిన స్థలాల్లో యూకలిప్టస్, సముద్ర తీరం, డెల్టా ప్రాంతాల్లో సరుగుడు మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. మొక్కలు నాటేం దుకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం సేకరిస్తున్నామని వివరించారు. -
మరో ఏడాది నగరం నరకమే
- ఆర్ అండ్ బీ రోడ్లకు రూ.46 కోట్లు - యూజీడీ తవ్వకాలకు రూ.39 కోట్లు - రెండింటికీ సర్కారు పచ్చ జెండా - తవ్వితే.. ఏడాది దాకా ఆగాల్సిందే - అప్పటిదాకా కొత్త రోడ్లు ఎండమావులే సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికలకు ముందే.. యూజీడీ తవ్వకాలతో నాలుగేళ్ల పాటు నగరంలోని రోడ్లు ఛిద్రమయ్యాయి. మూడుసార్లు వాయిదాల పద్ధతిన గడువు మీరినా పనులు పూర్తి కాకపోవటంతో ప్రజల్లో నిరసన పెల్లుబికింది. ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో కాంట్రాక్టర్ కూడా చేతులెత్తేయటంతో పనులు ఆగిపోయాయి. దీంతో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ నిధుల్లో రూ.15 కోట్లు వెచ్చించి రోడ్ల నిర్మాణం చేపట్టారు. రోడ్ల పనులు ప్రారంభం కావడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనతో మళ్లీ యూజీడీ అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు ఆర్అండ్ బీ రోడ్లకు నిధుల మంజూరుతోపాటు... యూజీడీ పనులు పూర్తిచేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అదనంగా రూ.39 కోట్లు కావాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు కోరటంతోపాటు.. 9 నెలల గడువులో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు కంపెనీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అదనపు నిధులతోపాటు మరో రూ.11 కోట్లు ఇన్స్పెక్షన్ చాంబర్ల నిర్మాణానికి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు నగరంలో ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధి, అత్యాధునిక విద్యుత్‌దీపాలు, సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సీఎం వెంటబడి నిధులు రాబట్టారు. ఇటీవలే నగరంలోని నాలుగు ప్రధాన రహదారులకు రూ.46 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒకవైపు రోడ్ల నిధులతోపాటు భూగర్భ డ్రెయినేజీని పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించడం గందరగోళానికి తెర లేపింది, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తలలు పట్టుకునేలా చేసింది. యూజీడీ పనులు పూర్తి కాకుండా నగరంలో రోడ్ల నిర్మాణం చేపట్టడం కుదిరేది కాదు. పైపులు వేసిన తర్వాత తవ్వకాలను పూడ్చేసే పని కాంట్రాక్టర్‌దే. కానీ.. ఒక ఏడాది వరకు వేచి చూసి.. ఒక వర్షాకాలం వ్యవధిలో ఎంత లోతుకు కుంగుతుందో చూసిన తర్వాతే దానిపై రోడ్డు నిర్మాణం చేపట్టాలి. ఈలోపు రోడ్డు నిర్మిస్తే యూజీడీ తవ్విన చోట గుంతలు పడి.. రోడ్డు కుంగిపోవడం ఖాయం. గతంలో నిబంధనలను అతిక్రమించి ఆరు నెలల వ్యవధిలోనే ఏమవుతుందిలే అనుకొని... రోడ్డు నిర్మించినందుకే నగరంలోని స్వశక్తి కాలేజీ ఎదుట రోడ్డు కుంగి పోయింది. కమాన్ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వైపు వెళ్లే రోడ్డు సైతం ఈ హడావుడి కారణంగానే పాడైపోయింది. ఈ లెక్కన యూజీడీ పనులు పూర్తయ్యేదాకా.. కొత్త రోడ్ల అభివృద్ధికి ఎండమావిలా ఎదురుచూడాల్సిందే. ఇదేమీ పట్టనట్లుగా రోడ్ల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్అండ్బీ రోడ్ల సుందరీకరణ పనుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 13న స్మితాసబర్వాల్ అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. యూజీడీ పనులు ఓ వైపు జరుగుతుండగానే, మరోవైపు ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టడం ప్రజాప్రతినిధులకే మింగుడు పడని సమస్యగా మారింది. యూజీడీ కోసం తవ్వితే యేడాది వరకు రోడ్ల పనులు చేపట్టకూడదని తెలిసినప్పటికీ సమన్వయ సమావేశాలు పెట్టి పనులు ఎలా పూర్తిచేస్తారో అర్థం కాని ప్రశ్నగా మారింది.