నాలుగు రోజులకే రోడ్లు ఛిద్రం
జిల్లాలో పలు ప్రాంతాల్లో అర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలు వేసిన రోడ్లలో నాణ్యత లోపించింది. కమీషన్లకు అలవాటు పడ్డ అధికారులు నాణ్యత గురించి పట్టించు కోవడం లేదనే విమర్శలున్నాయి. రోడ్ల మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ఫలితంగా రోడ్లు వేసిన నాలుగు రోజులకే ఛిద్రమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పలు రోడ్లు అడుక్కొక గొయ్యి, గజానికో గుంటలుగా మారాయి.
- కోట్ల రూపాయలు రోడ్డు పాలు
- కమీషన్లుకు అలవాటు పడ్డ అధికారులు
- జిల్లాలో 3,272 కి.మీ. ఆర్‌అండ్‌బీ రోడ్లు
- 5,052 కి.మీ. పీఆర్ రోడ్లు
నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో 3,272 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ, 5,052 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఆర్‌కు సంబంధించి సుమారు రూ.120 కోట్లతో 84 పనులు చేపట్టారు. వాటిలో 60కు పైగా రోడ్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీకి సంబంధించి 46 పనులు మంజూరు చేశారు. రూ.91 కోట్లు కేటాయించారు. 46 రోడ్డు పనుల్లో 10కి పైగా టెండర్ల దశలో ఉన్నాయి. మిగిలిన పనులు జరుగుతున్నాయి. అధ్వానంగా ఉన్న రోడ్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న బీటీ రోడ్లపై రోడ్లు వేస్తున్నారు. ఈ ప్రక్రియ సంవత్సరం మొత్తం జరుగుతుంది.
చిన్నపాటి వర్షానికే...:
చిన్నపాటి వర్షానికే ఈ రోడ్లు దెబ్బతింటున్నాయి. గ్రామీణ ప్రాంతాల రోడ్లలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. గూడూరు, రాపూరు, కలువాయి, ఆత్మకూరు, వెంకటగిరి, మర్రిపాడు, జలదంకి, బోగోలు తదితర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సోమశిల జలాశయం నుంచి పరమానందయ్య ఆశ్రమం వరకు 20 సంవత్సరాల కిందట బీటీ రోడ్డు వేశారు. నేటికీ అది చెక్కుచెదరలేదు. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. రోడ్డ్డు కాంట్రాక్టర్లకు వరాలిచ్చే గనులుగా ఉన్నాయి. ప్రజలకు ఉపయోగం ఉండడంలేదు. అధికారులు కుడా కాంట్రాక్టర్లకు అనుకులంగా పనులు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రామల్లో నిర్మించిన గ్రావెల్ రోడ్లు తుతూ మంత్రంగా వేస్తున్నారు. సమీపంలోని ప్రాంతాల్లోని గులకను తీసుకువచ్చి రోడ్లు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బీటీ రోడ్డు వేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించాలి. అయితే వీరు నామ మాత్రంగా పరిశీలించి వారికి రావలసిన వాటాను పుచ్చుకుంటున్నారనే విమర్శలున్నాయి.
నాణ్యత లోపిస్తే సహించేదిలేదు:
ప్రతి నెలా రోడ్డు పనులు జరుగుతుంటాయి. అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతాం. అనుమతి వచ్చిన తరువాత టెండర్లు నిర్వహిస్తాం. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన తరువాత పనులు చేపడతాం. రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేదిలేదు. నాణ్యత లేకుండా రోడ్డు వేస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు చేపడతాం.
-విజయకుమార్,
ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ