మురుగు తోడేదెప్పుడు! | Churning of the oceanic flood | Sakshi
Sakshi News home page

మురుగు తోడేదెప్పుడు!

Published Tue, May 6 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

Churning of the oceanic flood

  • గాడి తప్పిన సాగర మథనం
  •  ఎక్కడి పూడిక అక్కడే  
  •  ఫీల్ గుడ్ భ్రమల్లో హెచ్‌ఎండీఏ  
  •  సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్ సాగర్ ప్రక్షాలన పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. సాగర మథనం మాటున వాటాల పరంపర కొనసాగుతూనేవుంది. నిబంధనల మేరకు పూడికతీత పనులు జరగకపోయినా... సదరు కాంట్రాక్టు సంస్థకు బిల్లుల చెల్లింపు మాత్రం టంఛన్‌గా జరిగిపోతోంది. ఇప్పటివరకూ చేసిన డ్రెజ్జింగ్ పనులకు, రికార్డుల్లో చూపిస్తున్న లెక్కలకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం అంతర్గత పరిశీలనలో వెల్లడైనట్లు వినికిడి. అయితే... విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్లు సమాచారం.
     
    రూ.43 కోట్ల వ్యయంతో డ్రెజ్జింగ్ పనులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలుత పికెట్ నాలా ముఖద్వారం వద్ద పూడికతీత పనులు ప్రారంభించి మమ అనిపించిన అధికారులు, ఇప్పటికే సుమారు రూ.12 కోట్లకు పైగా బిల్లులు చెల్లించేశారు. అక్కడ పనులు పూర్తిస్థాయిలో జరిగాయా? లేదా? అన్నది నిర్ధరించుకోకుండానే డ్రెజ్జింగ్ యంత్రాలను బంజారా, బల్కాపూర్ నాలాల ముఖద్వారాల వైపు మళ్లించారు. నిజానికి పికెట్ నాలా వద్ద పూర్తిస్థాయిలో పనులు జరగలేదన్నది హెచ్‌ఎండీఏ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.

    ఈ నాలా ముఖద్వారానికి 500 మీటర్ల పరిధిలో పూడిక తీత పనులు జరపాలన్నది కాంట్రాక్టర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం. అయితే... ఈ నాలా సాగర్‌లో కలిసే చోట కూకట్‌పల్లి ఐ అండ్ డీ పైపులైన్ ఉండటంతో అక్కడ పూడిక తొలగించలేని పరిస్థితి. దీనికితోడు ఆ ప్రాంతంలో  పెద్దపెద్ద రాళ్లున్నాయి. వీటి పైన మేట వేసిన పూడిక అంతా అలాగే ఉంది.

    దీన్ని తొలగించేందుకు డ్రెజ్జర్‌తో సాధ్యం కాకపోవడంతో డీయూసీ మెషీన్‌ను ఉపయోగించి ఆ పూడికను వెలికి తీసినట్లు భ్రమ కల్పించారు. కానీ పూడిక అలాగే ఉంది. ప్రస్తుతం ఎండల తీవ్రతకు సాగర్‌లో నీరు తగ్గిపోవడంతో ఈ దిబ్బలు బయటపడ్డాయి. ఎన్నికల తరుణంలో పట్టించుకొనే వారు లేకపోవడంతో డ్రెజ్జింగ్ పనుల్లో అవకతవకలు గుట్టుగా సాగిపోతున్నాయి.
     
    లెక్కా పత్రం ఏదీ?
     
    సాగర్ నుంచి తొలగించిన వ్యర్థాలు చిక్కబడ్డాక నగరం వెలుపలికి తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఎంత పరిమాణంలో వ్యర్థాలను వెలికి తీశారు? దాన్ని ఎన్ని లారీల్లో తరలించారన్న విషయంలో రికార్డులకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. సాగర్ నుంచి వెలికితీసిన వ్యర్థాలకు రికార్డుల్లో లెక్కలు పక్కాగా చూపిస్తున్నా... ఆ మేరకు డంపింగ్ సైట్లో వ్యర్థాలు కనిపించక పోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

    హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో భాగంగా బంజారా, బల్కాపూర్, పికెట్ నాలాల ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన సుమారు 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాలన్నది లక్ష్యం. అయితే... ఇప్పటివరకు అందులో సగం కూడా వెలికి తీయలేదు.
     
    కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మెరైన్ పోర్టు విభాగం సిబ్బంది సాగర్‌లో సర్వే నిర్వహించి ఒక్కో నాలా వద్ద సుమారు 500 మీటర్ల దూరం వరకు 5-6 మీటర్ల మందంలో పూడిక పేరుకుపోయినట్లు తేల్చార ని అధికారులు చెబుతున్నారు. ఆ లెక్కల ప్రకారమే పనులు చేపట్టామంటున్నారు. అయితే... ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో కాంట్రాక్టర్ యథేచ్ఛగా అవకతవకలకు పాల్పడుతున్నారని హెచ్‌ఎండీఏ సిబ్బందే వ్యాఖ్యానిస్తున్నారు.
     
    తీవ్ర జాప్యం

    వాస్తవానికి సాగర్ డ్రెజ్జింగ్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే... ఇప్పటికే 17 నెలలు గడిచిపోయాయి. నిర్దేశించిన లక్ష్యంలో సగం పూడిక కూడా వెలికి తీయకపోవడం ప్రక్షాళన ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి అద్దం పడుతోంది. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞాణంతో కూడిన ‘కట్టర్ సక్షన్ డ్రెడ్జింగ్’ విధానంలో ఈ పూడికతీత పనులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా... ఆ ప్రమాణాలు కనిపించట్లేదు.

    ప్రస్తుతం డ్రెడ్జింగ్ యంత్రం పట్టుమని 10 నిముషాలు పనిచేస్తే... దానిపైపుల్లో ప్లాస్టిక్ కవర్లు, దిండ్లు, ఇతర వ్యర్థాలు అడ్డుపడి మెషీన్ ఆగిపోతుండటంతో సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఈ యంత్రాలకు రోజుకు 1200 నుంచి 1500 క్యూ.మీ. మించి పూడిక తోడే సామర్థ్యం లేదు. మరి ఎప్పటికి పూర్తి చేస్తారన్నది అర్థంగాని విషయం. గతంలో పాలిమరైజేషన్ పేరుతో అక్రమాలకు తెరలేపిన అధికారులు ఇప్పుడు కాంట్రాక్టు గడువు పెంచి ఆ మేరకు ప్రయోజనం పొందేందుకు బీజం వేశారని వినవస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement