ప్చ్..!ఒక్కటీ రాలేదు
- ఎఫ్‌ఓబీల నిర్మాణానికి చుక్కెదురు
- టెండర్లకు స్పందన కరవు
- తలలు పట్టుకుంటున్న అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: ‘ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వచ్చేస్తున్నాయ్... ఇక ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఎంచక్కా రోడ్లు దాటవచ్చు..’ అని ఆశించిన నగర వాసులకు నిరాశే మిగులుతోంది. పాదచారుల అవస్థలు తప్పించేందుకు తొలిదశలో 50ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల (ఎఫ్‌ఓబీలు) నిర్మాణానికి యత్నించిన జీహెచ్‌ఎంసీకి ఆదిలోనే చుక్కెదురైంది. వంద రోజుల్లో పది ఎఫ్‌ఓబీలను అందుబాటులోకి తేవాలని గత నవంబర్‌లోనే నిర్ణయించినా...ఇంతవరకూ ఒక్కటీ అందుబాటులోకి రాలేదు. అంతేకాదు.. తాజాగా ఐదు ఎఫ్‌ఓబీల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ఇటీవల టెండర్లు పిలిచింది. మంగళవారంతో దీనికి గడువు ముగిసింది.
అయినా ఒక్క టెండరూ దాఖలు కాకపోవడంతో అధికారులు బిత్తరపోయారు. అందుకు కారణాలేమిటో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. నగరంలో పాదచారులు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు రోడ్లు దాటడానికి పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ ఇబ్బందులను తొలగించేందుకు అవసరమైనన్ని ఎఫ్‌ఓబీలను నిర్మించాలని నిర్ణయించారు. గతంలోని ఎఫ్‌ఓబీలు కేవలం ప్రకటనల కోసం తప్ప ప్రజావసరాలకు ఉపయోగపడకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీయే వీటి నిర్మాణానికి సిద్ధమైంది.
అధునాతన పద్థతిలో లిఫ్ట్ సదుపాయంతో వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. అంతేకాదు.. వీటి నిర్వహణను సైతం వికలాంగులకు అప్పగించడం ద్వారా వారికి స్వయం ఉపాధి లభిస్తుందని యోచించారు. తొలి విడతగా ఐదు ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీల నిర్మాణానికి ఒక ప్యాకేజీగా దాదాపు రూ.4.50 కోట్ల అంచనా వ్య యంతో టెండర్లు ఆహ్వానించారు. గడువు ముగి సే సమయానికి ఒక్క టెండరు కూడా దాఖలు కాకపోవడంతో పునరాలోచనలో పడ్డారు.
టెండర్లు ఆహ్వానించిన ప్రాంతాలు
1. టిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్‌హౌస్
2. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం
3. మహావీర్ హాస్పిటల్, మాసాబ్‌ట్యాంక్
4. కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్
5. గ్రీన్‌ల్యాండ్స్ గెస్ట్‌హౌస్, గ్రీన్‌హౌస్.
వీటి టెండర్లు పూర్తయ్యాక మలిదశలో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు-12, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, లక్‌డికాపూల్‌లోని అయోధ్య హోటల్, గౌలిగూడ ఇమ్లిబన్ బస్టాండ్, అబిడ్స్ బిగ్‌బజార్, కోఠి మహిళా కళాశాల తూర్పు గేటు, అఫ్జల్‌గంజ్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలను నిర్మించే యోచనలో ఉన్నారు.