- రూ.75 లక్షలతో తాగునీటి సౌకర్యం
- కలెక్టర్ ఆరోఖ్యరాజ్
పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలో ఆరో గ్య ఉపకేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పనకు రూ.75 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. గురువారం ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఏజెన్సీలో పథకాల ప్రగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తాగునీటి సౌకర్యం కోసం మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లాపరిషత్ సీఈఓను ఆదేశించారు. ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, జామిగుడ, రూడకోట గ్రామా ల్లో పర్యటించి తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈని ఆదేశించారు. రూ.2.15 కోట్లతో ఏజెన్సీలో తాగునీటి సదుపాయాల కల్పనకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
పనులు చేయని కాంట్రాక్టర్ల తొలగింపు
టెండర్లు పూర్తయి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్దేశిత సమాయానికి పనులు చేపట్టకపోతే వారిని తొలగించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలకు మంజూరైన వంట గదుల నిర్మాణం జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన పనులకు బిల్లులు సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు.
ఈ నెల 12లోగా ఉపాధి కూలీలు, పింఛనుదారుల ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేయాలని ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీ చెల్లింపులు, పింఛన్ల చెల్లింపులు వేగవంతం చేయాలన్నారు. ఈసమావేశంలో ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్, ఆర్డీఓ జి.రాజుకుమారి, ఏపీఓ పీవీఎస్ నాయుడు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డ్వామా పీడి శ్రీరాములు నాయుడు, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈఈ కాంతినాథ్ పాల్గొన్నారు.