Arokhyaraj
-
రేపటి ఆర్థిక నగరాలపై సమగ్ర చర్చ
సాక్షి, విశాఖపట్నం: పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు అందుకవసరమైన నిధుల సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై జీ–20 దేశాల ప్రతినిధుల బృందం సమగ్రంగా చర్చించింది. జీ–20 దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన చర్చల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ మీడియాకు వెల్లడించారు. రేపటి ఆర్థిక నగరాలు మరింత వృద్ధి చెందేందుకు తీసుకోవలసిన చర్యలు, ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులను పెంచడం వంటి అంశాలపైనా ప్రతినిధులు విస్తృతంగా చర్చించారన్నారు. ఈ సదస్సుకు 14 జీ–20 సభ్యదేశాల నుంచి 57 మంది ప్రతినిధులు, ఎనిమిది మంది ఆహ్వానితులు, పది అంతర్జాతీయ సంస్థల నుంచి మరికొంతమంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు. మిగిలిన ఆరు సభ్య దేశాల ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారని ఆయన చెప్పారు. పట్టణాలు/నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక వనరుల కోసం వినూత్న మార్గాలను గుర్తించడం వంటి వాటిపై చర్చ జరిగిందని తెలిపారు. సమావేశాల్లో భాగంగా ఇప్పటివరకు ఏడు సెషన్లు, ఒక వర్క్‌షాపు నిర్వహించారన్నారు. అర్బన్ ప్రాంతాల్లో మౌలిక వసతులపై.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ (క్యూఐఐ) సూచికలను అన్వేషించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయంపై డేటాను క్రోడీకరించడం, ప్రైవేటు రంగానికి ఆ డేటా ఉపయోగపడేలా చేయడంపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారని, వీటిపై కొన్ని ప్రెజెంటేషన్లు ఇచ్చారని ఆరోఖ్యరాజ్ వివరించారు. అర్బన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సంస్థల రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగిందన్నారు. సుపరిపాలనకు ఏ రకమైన నైపుణ్యం అవసరమవుతుందో నిపుణులు సూచనలు చేశారని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో యూఎన్డీపీ, ఓఈసీడీ, ఐఎంఎఫ్, ఏడీబీ, ఈబీఆర్డీ వంటి కీలక అంతర్జాతీయ సంస్థలకు చెందిన 13 మంది నిపుణులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. గత జనవరిలో పూణేలో జరిగిన జీ–20 ఐడబ్ల్యూజీ సదస్సులో చర్చకు వచ్చిన అంశాలపై విశాఖలో బ్లూప్రింట్ ఇచ్చామన్నారు. బీచ్‌లో యోగా, ధ్యానం.. రెండో రోజు బుధవారం ఉదయం సదస్సు నిర్వహిస్తున్న రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో ఉన్న బీచ్‌లో జీ–20 దేశాల ప్రతినిధులకు యోగా, «ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై సంబంధిత నిపుణులతో నిర్వహించిన కార్యక్రమంలో సాత్విక ఆహారాన్ని పరిచయం చేశారు. రుషీకేష్‌లో మూడో సదస్సు.. జూన్ ఆఖరులో ఈ జీ–20 మూడో ఐడబ్ల్యూజీ సదస్సు రుషికేష్‌లో జరుగుతుందని ఆరోఖ్యరాజ్ వెల్లడించారు. విశాఖ సదస్సులో చర్చించిన అంశాలను పైలట్ స్టడీస్ కింద అక్కడ సమర్పిస్తారన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యం ఎంతో బాగుందని అతిథులు ప్రశంసించారని ఆరోఖ్యరాజ్ తెలిపారు. అంతేకాదు.. సదస్సు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారి మనసు దోచుకున్నాయన్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలోని తొట్లకొండ, కైలాసగిరి వ్యూపాయింట్, ఆర్కేబీచ్, సీహారియర్ మ్యూజియం, వీఎంఆర్డీఏ బీచ్‌లు అతిథులను కట్టిపడేశాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఏపీలో గృహనిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంగళవారం రాత్రి అతిథులకు ఇచ్చిన గాలా డిన్నర్లో వివరించారన్నారు. నేడు, రేపు ఇలా.. ఇక గురువారం జీ–20 దేశాల ప్రతినిధుల కోసం కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపు జరుగుతుందని ఆరోఖ్యరాజ్ చెప్పారు. కొరియా, సింగపూర్‌లకు చెందిన నిపుణులు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్‌లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపైన, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన జీవన విధానంపైన చర్చిస్తారన్నారు. విశాఖ నగరంపై కూడా ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఉంటుందని తెలిపారు. అలాగే, శుక్రవారం జరిగే సమావేశానికి దేశంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లు హాజరవుతారని చెప్పారు. -
ఉప కేంద్రాలకు నిధులు
రూ.75 లక్షలతో తాగునీటి సౌకర్యం కలెక్టర్ ఆరోఖ్యరాజ్ పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలో ఆరో గ్య ఉపకేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పనకు రూ.75 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. గురువారం ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఏజెన్సీలో పథకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తాగునీటి సౌకర్యం కోసం మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లాపరిషత్ సీఈఓను ఆదేశించారు. ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, జామిగుడ, రూడకోట గ్రామా ల్లో పర్యటించి తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఈని ఆదేశించారు. రూ.2.15 కోట్లతో ఏజెన్సీలో తాగునీటి సదుపాయాల కల్పనకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్ల తొలగింపు టెండర్లు పూర్తయి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్దేశిత సమాయానికి పనులు చేపట్టకపోతే వారిని తొలగించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలకు మంజూరైన వంట గదుల నిర్మాణం జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన పనులకు బిల్లులు సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ నెల 12లోగా ఉపాధి కూలీలు, పింఛనుదారుల ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలని ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీ చెల్లింపులు, పింఛన్ల చెల్లింపులు వేగవంతం చేయాలన్నారు. ఈసమావేశంలో ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్, ఆర్డీఓ జి.రాజుకుమారి, ఏపీఓ పీవీఎస్ నాయుడు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డ్వామా పీడి శ్రీరాములు నాయుడు, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈఈ కాంతినాథ్ పాల్గొన్నారు. -
నిజరూపం.. అపురూపం
అప్పన్న చందనోత్సవానికి పోటెత్తిన భక్తులు స్వామిని దర్శించి పులకించిన భక్తజనం పకడ్బందీగా ఏర్పాట్లు ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ తరపున డాలర్ శేషాద్రి పట్టు వస్త్రాల సమర్పణ సింహాచలం, న్యూస్‌లైన్ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఏడాదికి ఒక్క రోజు మా త్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు. వైశాఖ శుద్ద తదియని పురస్కరించుకుని అప్పన్న చందనోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి గురువారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. సుప్రభాతసేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేశారు. ఒంటి గంట సమయంలో స్వామిపై ఉన్న చందనాన్ని వెండి బొరుగులతో తొలగించి నిజ రూపభరితున్ని చేశారు. తెల్లవారుజామున 2.45 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు కుటుంబ సమేతంగా తొలిదర్శనాన్ని చేసుకుని, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 3.15 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి 8.30 నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీ వైష్ణవస్వాములు గంగధార నుం చి వెయ్యి కలశాలతో జలాలను తీసుకొచ్చి స్వామి నిజరూపాన్ని అభిషేకించారు. 108 వెండి కలశాలతో అర్చకులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు శీతలోపచారాలు చేశారు. అనంతరం స్వామికి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించి నిత్య రూపభరితున్ని చేశారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ రాష్ర్ట ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరావు, టీటీడీ తరపున డాలర్ శేషాద్రి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు కూడా స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. విశాఖ శారదా పీఠం స్వామిజీ స్వరూపనందేంద్ర సరస్వతి, రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తులు సూరి అప్పారావు, నూతి రామ్మోహనరావు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, కలెక్టర్ ఆరోఖ్యరాజ్, పోలీస్ కమిషనర్ శివధర్‌రెడ్డి, మాజీ మంత్రులు రెడ్డి సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, గాజువాక అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. విస్తృత ఏర్పాట్లు తెల్లవారుజామున 3.15 నుంచే సాధారణ భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని అధికారులు కల్పించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఫ్రీ పాస్‌లు జారీ చేయలేదు. ప్రొటోకాల్ వీఐపీలు, వీఐపీలకు వెయ్యి రూపాయల టికెట్లు అందజేశారు. లక్షా 25 వేల లడ్డూలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. అడవివరం ఆరోగ్య కేద్రం ప్రధాన వైద్యాధికారి జగదీష్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆర్టీసీ పలు ప్రత్యేక బస్సులను నడిపింది. దేవస్థానం 40 బస్సులను ఉచితంగా కొండపైకి నడిపింది. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు విశేషలం దించాయి. -
ఓటెత్తారు
7 గంటలకేబారులు తీరిన ఓటర్లు పోలింగ్‌పై కానరాని పండగ ప్రభావం కొన్నిచోట్ల పోలీసుల ఓవర్ యాక్షన్ ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ నర్సీపట్నం/యలమంచిలి, న్యూస్‌లైన్ : జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల అంచనాలకు మించి యలమంచిలిలో 82.99 శాతం, నర్సీపట్నంలో 76.14శాతం నమోదయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకే బారులు తీరారు. కొత్త అమావాస్య పం డగ ప్రభావంతో ఒకదశలో మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నానికి పుంజుకుంది. మరోపక్క ఎండ తీవ్రత తగ్గడం కూడా పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడింది. అభ్యర్థులు, వారి అనుచరులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓటర్లను ఆటోలు, రిక్షాలు, ద్విచక్రవాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఒకేసారిగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో కొన్ని కేంద్రాల వద్ద గంటలతరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలవద్ద ప్రత్యేక ఏర్పాట్లు చే శారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ పూర్తయింది. యలమంచిలి మున్సిపాలిటీలో 32,459 మంది ఓటర్లు ఉన్నారు. రెండో వార్డు ఏకగ్రీవం అయింది. 23 వార్డుల్లోని 31,168 మందికి 25,867 ఓట్లు పోలయ్యాయి. 82.99 శాతంగా నమోదయింది. 23 వార్డుల్లో 58మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఉదయం 9గంటలకు 19శాతం, 11గంటలకు 40.80శాతం, 1గంటకు 60.18శాతం, 3గంటలకు 74.86శాతం పోలింగ్ నమోదయింది. 8వ వార్డులో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఆడారి లక్ష్మీదేవి, టీడీపీ అభ్యర్థి పిళ్లా రమాకుమారిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ కొక్కిరాపల్లి పోలింగ్‌స్టేషన్‌ను పరిశీలించి పోలింగ్ శాతం, భద్రతా ఏర్పాట్లపై ఆరాతీశారు. ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ పెదపల్లి, యలమంచిలి తులసీనగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సిబ్బందిని ఆరా తీశారు. నర్సీపట్నంలోని 27 వార్డుల్లో మొత్తం 76.14 శాతం మంది ఓటు వేశారు. ఈ పట్టణంలోని మొత్తం 44,097 ఓటర్లకు 33,574 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్త అమావాస్య పండగ సందర్భంగా ఇక్కడి మహిళలంతా ఆలయాలకు వెళ్లడంతో ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి పుంజుకుంది. ఈ విధంగా ఉదయం 9 గంటలకు 16శాతం, 11 గంటలకు 35, ఒంటి గంటకు 57.8, 3 గంటలకు 66.33, పోలింగ్ ముగిసే సమయానికి 76.14 శాతం పోలింగు నమోదయింది. ఇక్కడి పోలింగ్ సరళిని కలెక్టరు ఆరోఖ్యరాజ్, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు అనితా రామచంద్రన్‌తో పాటు ఆర్డీవో సూర్యారావు, మున్సిపల్ ఎన్నికల అధికారి సింహాచలం పరిశీలించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లోనే ఎన్నికలు జరుగుతుండడంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో కొందరు పోలీసులు, పోలీసు అధికారులు కేంద్రాలవద్ద ఓవర్‌యాక్షన్ చేశారు. బూత్‌లకు సమీపంలో ఉన్న అభ్యర్థులను సైతం జీపుల్లో ఎక్కించి, సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచారు. అలాగే ఏజెంట్లను సైతం బూత్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ కారణంగా కొన్నిచోట్ల వివాదాస్పదమైంది. చిన్న, చిన్న అవాంతరాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
రైతు సంక్షేమమే ప్రధానం
రూ.744 కోట్ల వ్యవసాయ రుణాల పంపిణీ 26,899 క్వింటాళ్ల విత్తనాల సరఫరా రూ.28 కోట్ల పెట్టుబడి రాయితీ విడుదల గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ ఆరోఖ్యరాజ్ విశాఖపట్నం,న్యూస్‌లైన్: జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నా రు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు, ఎన్సీసీ, విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు పెద్ద ఎత్తున పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, ఆధునిక యంత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 1,59,520 మంది రైతులకు రూ.744 కోట్ల పంట రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. 26,899 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశామన్నారు. రూ.68లక్షల విలువైన వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను రాయితీపై 577 మంది రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. 2011 నవంబర్‌నాటి నీలం తుఫానులో నష్ట పోయిన 1.34 లక్షల మంది రైతులకు రూ.28కోట్లు పెట్టుబడిరాయితీ విడుదలైందన్నారు. ఇందులో రూ.4.61 కోట్లు బ్యాంకు ఖాతాలు లేని 28 వేల మంది ఏజెన్సీ రైతులకు చెక్కులు రూపంలో పంపిణీ చేస్తామన్నారు. గతేడాది అక్టోబర్,నవంబర్ నెలల్లో భారీ వర్షాలకు 13,340.8హెక్టార్లలో పంటలు నష్టపోయిన 5626 మంది రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.12.25కోట్ల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. లబ్ధిదారులకు వివిధ పథకాలను పంపిణీ చేశారు. జిల్లాలో ఒక భారీ, 6 మధ్య తరహా, 4,317 చిన్న తరహా నీటి పారుదల ప్రాజక్టుల ద్వారా 3,80,241 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నారు. 30వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రూ.43.78లక్షలతో శారదా నదిపై నిర్మిస్తున్న 4 ఆనకట్టల పనులను వచ్చే జూన్ నాటికి పూర్తికి చర్యలు చేపట్టారు. మాతా శిశు మరణాల నిరోధానికి ఇందిరమ్మ అమృత హస్తం పథకం ద్వారా14,199 మంది గర్భిణులు, 14,734 మంది బాలింతలకు సంపూర్ణ పోషకాహారం అందిస్తున్నారు. మరో లక్షా 821 మంది చిన్నారులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరుతోంది. రాజీవ్ విద్యా మిషన్ పథకం క్రింద ఏడాది వివిధ పథకాలకు రూ.187కోట్లు విడుదల చేశారు. ఇందిరమ్మ పథకంలో చేపట్టిన 3,78,440 గృహాల్లో 2,66,113 నిర్మించారు. నిర్మల్ భారత్ అభియాన్, ఉపాధి హామీ పథకాల ద్వారా జిల్లాలో రూ.23.82 కోట్లతో 23,828 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 10,027 పూర్తయ్యాయి. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో 30,527 మరుగుదొడ్లకు 7,020 పూర్తయ్యాయి. రూ.2.72కోట్లతో 995 పథకాలను చేపట్టి రక్షిత నీటిని అందిస్తున్నారు. ఏజెన్సీలో రూ.92కోట్ల అంచనాతో 92 రోడ్ల నిర్మాణ పనుల చేపట్టారు. ఏజెన్సీలో జాతీయ గ్రామీణ నీటి సరఫరా పథకం, ప్రపంచ బ్యాంకు నిధులు రూ.111 కోట్ల వ్యయంతో 486 గ్రామాలకు మంచినీటి సరఫరాకు చర్యలు ఆకట్టుకున్న శకటాలు కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాటు చేసిన శకటాలు అధికారులను ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకఠాలలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటానికి ప్రధమ బహుమతి లభించింది. నగర పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్‌అలైవ్ శకటానికి ద్వితీయ బహుమతి, గ్రామీణ నీటి సరఫరా విభాగం శకటానికి తృతీయ బహుమతి లభించింది. -
ఇంత అధ్వానమా?
=కలెక్టర్ ఆరోఖ్యరాజ్ కన్నెర్ర =డాక్టర్లు, సిబ్బందిపై మండిపాటు =కె.కోటపాడు 30 పడకల ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ కె.కోటపాడు రూరల్, న్యూస్‌లైన్: ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడి అస్తవ్యస్త పరిస్థితులపై, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. బాధ్యతలు పట్టించుకోకుండా విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అందుతున్న వసతులపై, ఆస్పత్రిలో పరిస్థితులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఆస్పత్రిలో పని చేసే వైద్యులు అటెండెన్స్ రిజిస్టర్లో సంత కం చేయనవసరం లేదా? ఆస్పత్రిలో ప్రసవం జరిగే బాలింతలకు జెఎస్వై నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రసవం జరి గిన రోజున చెల్లించాలని తెలియదా? రోగులకు పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా జరుగుతుందో లేదో చూసే తీరిక వైద్యులకు లేదా? మీ (వైద్యుల) ఇళ్లలోనూ బాత్రూమ్లు ఇలాగే ఉంటాయా?’ అని నిలదీశారు. కె.కోటపాడు మండలంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేపట్టిన కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్య రాజ్ 30 పడకల ఆస్పత్రిని, కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేశారు. ఉదయం 11 గంటలకు 30 పడకల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వైద్యులు ఎక్కడ ఉంటారని అక్కడి సిబ్బందిని మామూలు వ్యక్తిలా అడిగి వారి గదికి వెళ్లారు. కలెక్టర్ వచ్చారని తెలిసిన ఇద్దరు డ్యూటీ డాక్టర్లు ఉరుకులు పరుగులతో ఆస్పత్రికి వచ్చారు. కలెక్టర్ డ్యూటీ డాక్టర్లు సి.డి.కిషోర్రాజా, సురేఖ మాత్రమే ఉండడం తో మిగిలిన ఇద్దరు ఎక్కడని నిలదీశా రు. సెలవు చీటీ కూడా లేకుండా విధులకు గైర్హాజరైన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హాజరు పట్టీలో ఆబ్సెంట్ వేశారు. ఆస్పత్రిలో వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. బాత్రూమ్లు పరిశుభ్రంగా లేకపోవడంపై వైద్యులును ప్రశ్నించారు. ఆస్పత్రిలో ప్రసవాల గురించి ప్రశ్నించినప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలు ఆసక్తి కనబర్చడం లేదని సిబ్బంది తెలపడంతో కలెక్టర్ మండిపడ్డారు. ఆహార సరఫరా తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వహణ ఏమాత్రం బాగోలేదని, రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేలా వైద్యం అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నెల తర్వాత మళ్లీ తనిఖీకి వస్తానని, ఈలోగా సమస్యలు పరిష్కరించాలని వైద్యసిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థులకు ప్రశ్నలు తర్వాత కలెక్టర్ కింతాడ శివారు గొల్లలపాలెంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు పూర్తి నాణ్యతతో ఆహారాన్ని సరఫరా చేయాలని కోరారు. వంటగదిలోకి వెళ్లి వంటకాలను తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యాబోధన గురించి ఆరా తీశారు. పూర్తయిన పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నలడిగారు. విద్యార్థుల సమాధానాలు విని సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో, వసతిగృహంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈయన వెంట తహశీల్దార్ కె.వి.ఎస్.రవి, పంచాయతీ కార్యదర్శి బి.వి.రవి ఉన్నారు.