ఇంత అధ్వానమా? | The resources of the arokhyaraj | Sakshi
Sakshi News home page

ఇంత అధ్వానమా?

Published Sat, Dec 21 2013 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

ఇంత అధ్వానమా?

ఇంత అధ్వానమా?

 =కలెక్టర్ ఆరోఖ్యరాజ్ కన్నెర్ర
 =డాక్టర్లు, సిబ్బందిపై మండిపాటు
 =కె.కోటపాడు 30 పడకల ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ

 
కె.కోటపాడు రూరల్, న్యూస్‌లైన్:  ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడి అస్తవ్యస్త పరిస్థితులపై, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. బాధ్యతలు పట్టించుకోకుండా విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అందుతున్న వసతులపై, ఆస్పత్రిలో పరిస్థితులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

‘ఆస్పత్రిలో పని చేసే వైద్యులు అటెండెన్స్ రిజిస్టర్‌లో సంత కం చేయనవసరం లేదా? ఆస్పత్రిలో ప్రసవం జరిగే బాలింతలకు జెఎస్‌వై నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రసవం జరి గిన రోజున చెల్లించాలని తెలియదా? రోగులకు పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా జరుగుతుందో లేదో చూసే తీరిక వైద్యులకు లేదా? మీ (వైద్యుల) ఇళ్లలోనూ బాత్‌రూమ్‌లు ఇలాగే ఉంటాయా?’ అని నిలదీశారు. కె.కోటపాడు మండలంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేపట్టిన కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్య రాజ్ 30 పడకల ఆస్పత్రిని, కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేశారు.

ఉదయం 11 గంటలకు 30 పడకల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వైద్యులు ఎక్కడ ఉంటారని అక్కడి సిబ్బందిని మామూలు వ్యక్తిలా అడిగి వారి గదికి వెళ్లారు. కలెక్టర్ వచ్చారని తెలిసిన ఇద్దరు డ్యూటీ డాక్టర్లు ఉరుకులు పరుగులతో ఆస్పత్రికి వచ్చారు. కలెక్టర్ డ్యూటీ డాక్టర్లు సి.డి.కిషోర్‌రాజా, సురేఖ మాత్రమే ఉండడం తో మిగిలిన ఇద్దరు ఎక్కడని నిలదీశా రు. సెలవు చీటీ కూడా లేకుండా విధులకు గైర్హాజరైన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హాజరు పట్టీలో ఆబ్సెంట్ వేశారు. ఆస్పత్రిలో వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.

బాత్‌రూమ్‌లు పరిశుభ్రంగా లేకపోవడంపై వైద్యులును ప్రశ్నించారు. ఆస్పత్రిలో ప్రసవాల గురించి ప్రశ్నించినప్పుడు ఈ ప్రాంతంలో ప్రజలు ఆసక్తి కనబర్చడం లేదని సిబ్బంది తెలపడంతో కలెక్టర్ మండిపడ్డారు. ఆహార సరఫరా తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఆస్పత్రి నిర్వహణ ఏమాత్రం బాగోలేదని, రోగులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేలా వైద్యం అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నెల తర్వాత మళ్లీ తనిఖీకి వస్తానని, ఈలోగా సమస్యలు పరిష్కరించాలని వైద్యసిబ్బందిని హెచ్చరించారు.
 
విద్యార్థులకు ప్రశ్నలు


తర్వాత కలెక్టర్ కింతాడ శివారు గొల్లలపాలెంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు పూర్తి నాణ్యతతో ఆహారాన్ని సరఫరా చేయాలని కోరారు.  వంటగదిలోకి వెళ్లి వంటకాలను తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యాబోధన గురించి ఆరా తీశారు. పూర్తయిన పాఠ్యాంశాలపై విద్యార్థులను ప్రశ్నలడిగారు. విద్యార్థుల సమాధానాలు విని సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో, వసతిగృహంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈయన వెంట తహశీల్దార్ కె.వి.ఎస్.రవి, పంచాయతీ కార్యదర్శి బి.వి.రవి ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement