రైతు సంక్షేమమే ప్రధానం
- రూ.744 కోట్ల వ్యవసాయ రుణాల పంపిణీ
- 26,899 క్వింటాళ్ల విత్తనాల సరఫరా
- రూ.28 కోట్ల పెట్టుబడి రాయితీ విడుదల
- గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ ఆరోఖ్యరాజ్
విశాఖపట్నం,న్యూస్‌లైన్: జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నా రు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు, ఎన్‌సీసీ, విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు పెద్ద ఎత్తున పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, ఆధునిక యంత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది 1,59,520 మంది రైతులకు రూ.744 కోట్ల పంట రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. 26,899 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశామన్నారు. రూ.68లక్షల విలువైన వివిధ రకాల వ్యవసాయ పనిముట్లను రాయితీపై 577 మంది రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. 2011 నవంబర్‌నాటి నీలం తుఫానులో నష్ట పోయిన 1.34 లక్షల మంది రైతులకు రూ.28కోట్లు పెట్టుబడిరాయితీ విడుదలైందన్నారు.
ఇందులో రూ.4.61 కోట్లు బ్యాంకు ఖాతాలు లేని 28 వేల మంది ఏజెన్సీ రైతులకు చెక్కులు రూపంలో పంపిణీ చేస్తామన్నారు. గతేడాది అక్టోబర్,నవంబర్ నెలల్లో భారీ వర్షాలకు 13,340.8హెక్టార్లలో పంటలు నష్టపోయిన 5626 మంది రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.12.25కోట్ల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. లబ్ధిదారులకు వివిధ పథకాలను పంపిణీ చేశారు.
జిల్లాలో ఒక భారీ, 6 మధ్య తరహా, 4,317 చిన్న తరహా నీటి పారుదల ప్రాజక్టుల ద్వారా 3,80,241 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నారు.
30వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు రూ.43.78లక్షలతో శారదా నదిపై నిర్మిస్తున్న 4 ఆనకట్టల పనులను వచ్చే జూన్ నాటికి పూర్తికి చర్యలు చేపట్టారు.
మాతా శిశు మరణాల నిరోధానికి ఇందిరమ్మ అమృత హస్తం పథకం ద్వారా14,199 మంది గర్భిణులు, 14,734 మంది బాలింతలకు సంపూర్ణ పోషకాహారం అందిస్తున్నారు. మరో లక్షా 821 మంది చిన్నారులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరుతోంది.
రాజీవ్ విద్యా మిషన్ పథకం క్రింద ఏడాది వివిధ పథకాలకు రూ.187కోట్లు విడుదల చేశారు. ఇందిరమ్మ పథకంలో చేపట్టిన 3,78,440 గృహాల్లో 2,66,113 నిర్మించారు.
నిర్మల్ భారత్ అభియాన్, ఉపాధి హామీ పథకాల ద్వారా జిల్లాలో రూ.23.82 కోట్లతో 23,828 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 10,027 పూర్తయ్యాయి. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో 30,527 మరుగుదొడ్లకు 7,020 పూర్తయ్యాయి.
రూ.2.72కోట్లతో 995 పథకాలను చేపట్టి రక్షిత నీటిని అందిస్తున్నారు. ఏజెన్సీలో రూ.92కోట్ల అంచనాతో 92 రోడ్ల నిర్మాణ పనుల చేపట్టారు.
ఏజెన్సీలో జాతీయ గ్రామీణ నీటి సరఫరా పథకం, ప్రపంచ బ్యాంకు నిధులు రూ.111 కోట్ల వ్యయంతో 486 గ్రామాలకు మంచినీటి సరఫరాకు చర్యలు
ఆకట్టుకున్న శకటాలు
కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఏర్పాటు చేసిన శకటాలు అధికారులను ఆకట్టుకున్నాయి.
వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకఠాలలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటానికి ప్రధమ బహుమతి లభించింది. నగర పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్‌అలైవ్ శకటానికి ద్వితీయ బహుమతి, గ్రామీణ నీటి సరఫరా విభాగం శకటానికి తృతీయ బహుమతి లభించింది.