అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
జగదేవ్‌పూర్: జిల్లా అభివృద్ధిపై దృష్టిసారించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి మండలంలోని ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్, ఆదివారం ఉదయం తన మనమడితో కలిసి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ రాహల్ బొజ్జా, జాయింట్ కలెక్టర్ శరత్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, గజ్వేల్ ఓఎస్‌డి హన్మంతరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చే సి జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ముఖ్యంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. గజ్వేల్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా జిల్లాలో వ్యవసాయాభివృద్ధి, పంటల పరిస్థితిపై ఆరా తీశారు. సంక్షేమ పథకాలన్నీ అర్హులకే అందేలా చూడాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. త్వరలోనే జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పథకాలు అమలు. చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిద్దామని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది.
ఫాంహౌస్ చుట్టూ భారీ బందోబస్తు
సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు రావడంతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ అధ్వర్యంలో ఫాంహౌస్ చుట్టూ భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం సీఎం హైదరాబాద్‌కు వెళ్లే వరకు పోలీస్ బందోబస్తు కొనసాగింది. ఆదివారం ఉదయం ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 150 మంది సిబ్బంది బందోబస్తును నిర్వహించారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షించారు. ఆదివారం 3:40 గంటలకు సీఎం కేసీఆర్ తమ కాన్వాయ్‌లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌ను టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డితో పాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు కలిశారు.