ఓటెత్తారు
- 7 గంటలకేబారులు తీరిన ఓటర్లు
- పోలింగ్‌పై కానరాని పండగ ప్రభావం
- కొన్నిచోట్ల పోలీసుల ఓవర్ యాక్షన్
- ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ
నర్సీపట్నం/యలమంచిలి, న్యూస్‌లైన్ : జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల అంచనాలకు మించి యలమంచిలిలో 82.99 శాతం, నర్సీపట్నంలో 76.14శాతం నమోదయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకే బారులు తీరారు. కొత్త అమావాస్య పం డగ ప్రభావంతో ఒకదశలో మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నానికి పుంజుకుంది.
మరోపక్క ఎండ తీవ్రత తగ్గడం కూడా పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడింది. అభ్యర్థులు, వారి అనుచరులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓటర్లను ఆటోలు, రిక్షాలు, ద్విచక్రవాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఒకేసారిగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో కొన్ని కేంద్రాల వద్ద గంటలతరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలవద్ద ప్రత్యేక ఏర్పాట్లు చే శారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ పూర్తయింది.
యలమంచిలి మున్సిపాలిటీలో 32,459 మంది ఓటర్లు ఉన్నారు. రెండో వార్డు ఏకగ్రీవం అయింది. 23 వార్డుల్లోని 31,168 మందికి 25,867 ఓట్లు పోలయ్యాయి. 82.99 శాతంగా నమోదయింది. 23 వార్డుల్లో 58మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఉదయం 9గంటలకు 19శాతం, 11గంటలకు 40.80శాతం, 1గంటకు 60.18శాతం, 3గంటలకు 74.86శాతం పోలింగ్ నమోదయింది.
8వ వార్డులో వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఆడారి లక్ష్మీదేవి, టీడీపీ అభ్యర్థి పిళ్లా రమాకుమారిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ కొక్కిరాపల్లి పోలింగ్‌స్టేషన్‌ను పరిశీలించి పోలింగ్ శాతం, భద్రతా ఏర్పాట్లపై ఆరాతీశారు. ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ పెదపల్లి, యలమంచిలి తులసీనగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సిబ్బందిని ఆరా తీశారు.
నర్సీపట్నంలోని 27 వార్డుల్లో మొత్తం 76.14 శాతం మంది ఓటు వేశారు. ఈ పట్టణంలోని మొత్తం 44,097 ఓటర్లకు 33,574 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్త అమావాస్య పండగ సందర్భంగా ఇక్కడి మహిళలంతా ఆలయాలకు వెళ్లడంతో ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి పుంజుకుంది. ఈ విధంగా ఉదయం 9 గంటలకు 16శాతం, 11 గంటలకు 35, ఒంటి గంటకు 57.8, 3 గంటలకు 66.33, పోలింగ్ ముగిసే సమయానికి 76.14 శాతం పోలింగు నమోదయింది.
ఇక్కడి పోలింగ్ సరళిని కలెక్టరు ఆరోఖ్యరాజ్, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు అనితా రామచంద్రన్‌తో పాటు ఆర్డీవో సూర్యారావు, మున్సిపల్ ఎన్నికల అధికారి సింహాచలం పరిశీలించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లోనే ఎన్నికలు జరుగుతుండడంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో కొందరు పోలీసులు, పోలీసు అధికారులు కేంద్రాలవద్ద ఓవర్‌యాక్షన్ చేశారు. బూత్‌లకు సమీపంలో ఉన్న అభ్యర్థులను సైతం జీపుల్లో ఎక్కించి, సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచారు. అలాగే ఏజెంట్లను సైతం బూత్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ కారణంగా కొన్నిచోట్ల వివాదాస్పదమైంది. చిన్న, చిన్న అవాంతరాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.