జిల్లా ఓటర్లు 29,55,432
అనంతపురం అర్బన్ : జిల్లాలో మొత్తం 29,55,432 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుçషులు 14,93,260, మహిళలు 14,61,951, ఇతరులు 221 మంది ఉన్నారు. ఓటర్ల తుది జాబితాను జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సి.మల్లీశ్వరిదేవి సోమవారం తన చాంబర్‌లో విడుదల చేశారు. గత ఏడాది నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు ప్రత్యేక ఓటరు నమోదు చేపట్టామన్నారు. ఇందులో కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6 ద్వారా 36,224 దరఖాస్తులు రాగా.. ఇందులో 33,886 ఆమోదించామని ఆమె తెలిపారు. 2,338 తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఫారం–7 ద్వారా అభ్యంతరాలు స్వీకరించగా 12,955 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 12,098 ఆమోదించామన్నారు. 817 తిరస్కరణకు గురయ్యాయన్నారు. జిల్లాలో 1,902 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. లింగ నిష్పత్తి ప్రకారం ప్రతివెయ్యి మంది పురుష ఓటర్లకు 979 మంది మహిళా ఓటర్లు, జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి వెయ్యిమంది జనాభాకు 680 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 5,805 మంది చనిపోయిన, 1,508 మంది శాశ్వతంగా గ్రామం వదిలివెళ్లిన, 6,303 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు.