100 మీటర్ల లోపు ఏ ఫోనూ వాడొద్దు | Voters will not be allowed to carry mobile phones | Sakshi
Sakshi News home page

100 మీటర్ల లోపు ఏ ఫోనూ వాడొద్దు

Published Fri, Jul 12 2019 8:12 AM | Last Updated on Fri, Jul 12 2019 8:31 AM

Voters will not be allowed to carry mobile phones  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ బూత్‌లలో, పోలింగ్‌ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఏ వ్యక్తి కూడా సెల్‌ ఫోన్లు, కార్డ్‌లెస్‌ ఫోన్లు, వైర్‌లెస్‌ సెట్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) స్పష్టం చేసింది. కౌంటింగ్‌ కేంద్రాలు, చుట్టుపక్కల కూడా ఇలాంటి పరికరాలేవీ ఉపయోగించడానికి వీల్లేదని తెలిపింది. ఉల్లంఘించిన వారి నుంచి వాటిని జప్తు చేసి పోలింగ్‌ ముగిశాక, ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక మాత్రమే తిరిగి ఇస్తామని పేర్కొంది. ఈ ఆదేశాలు శాంతిభద్రతలు పర్యవేక్షించే అధికారి, పోలింగ్‌బూత్‌లు, కౌంటింగ్‌ సెంటర్ల వద్ద విధులు నిర్వహించే భద్రతా సిబ్బందికి వర్తించవని గురువారం విడుదల చేసిన ఉత్తర్వులో ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు. 

పోలింగ్‌ స్టేషన్‌ నుంచి 200 మీటర్ల లోపు అభ్యర్థుల ఎన్నికల బూత్‌లు పెట్టరాదని, అభ్యర్థులు ఇలాంటి ఒక్కో బూత్‌లో ఒక టార్పాలిన్‌లో గొడుగు కింద ఒక బల్ల, రెండు కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, దీనికి టెంట్‌ వేయరాదని స్పష్టం చేశారు. ఒక్కో బూత్‌లో అభ్యర్థికి సంబంధించిన ఒక్క బ్యానర్‌ను మాత్రమే ప్రదర్శించాలని తెలిపారు. ఇలాంటి బూత్‌లలో ప్రజలు గుమికూడరాదని, ఓటేశాక ఎవరూ ఈ బూత్‌ల వద్దకు రావొద్దని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘనలపై ఏ అధికారి అయినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలతో పాటు విధుల నిర్వహణలో వైఫల్యానికి చట్టప్రకారం చర్యలు చేపడతామని పేర్కొన్నారు.   

ఆగస్టు తొలివారంలో మున్సిపోల్స్‌ 
పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం తెస్తున్న కొత్త మునిసిపల్‌ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మునిసిపల్‌ బిల్లులకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపించామని వెల్లడించారు. కొత్త మునిసిపల్‌ చట్టాల ఆమోదంకోసం ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. 18న బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి వాటి ప్రతులను శాసన సభ్యులకు అందచేయనున్నారు. బిల్లులను చదివి అవగతం చేసుకోవడానికి సభ్యులకు అవసరమైన సమయం ఇచ్చేందుకు ఆ వెంటనే సభను మరుసటి రోజుకు వాయిదా వేయనున్నారు. 19న బిల్లులపై చర్చించి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను కేవలం మునిసిపల్‌ బిల్లులను ఆమోదించేందుకు మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తోంది. పశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ ఈ సందర్భంగా ఉండవని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

బైంసా మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టు స్టే 
నిర్మల్‌ జిల్లా బైంసా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేసిన కేసులో గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. చట్ట నిబంధనల మేరకు వార్డుల విభజన చేయాలని, అప్పటివరకూ బైంసా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించరాదని జస్టిస్‌ పి.నవీన్‌రావు ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమ అభ్యంతరాలను పరిష్కరించకుండానే ప్రభుత్వం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందంటూ కపిల్‌ షిండే దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సీహెచ్‌ నరేశ్‌రెడ్డి వినిపిస్తూ బైంసా మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జబీర్‌ అహ్మద్‌కు అనుకూలంగా మున్సిపల్‌ కమిషనర్‌ చర్యలు ఉన్నాయన్నారు. వాదనల విన్న న్యాయమూర్తి బైంసా ఎన్నికలు నిర్వహించరాదన్న మధ్యంతర ఆదేశాల తోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement