
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై ఫిర్యాదు చేసేందుకు భారత ప్రభుత్వం సాయం కోరుతూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (యూఎస్ ఎస్ఈసీ) సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న అదానీలకు తమ ఫిర్యాదును అందించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా ఎస్ఈసీ న్యూయార్క్ జిల్లా కోర్టుకు తెలిపింది. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు భారత న్యాయ మంత్రిత్వ శాఖ సాయాన్ని కోరినట్లు ఎస్ఈసీ పేర్కొంది. అయితే అందుకు మోదీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ తన ఎక్స్‌లో అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా స్పందిస్తూ అదానీతో ఉన్న ‘పర్సనల్ మామ్లా(వ్యక్తిగత సంబంధం)’కు మోదీ కట్టుబడి ఉంటారో.. లేదో.. తెలియాలని కామెంట్ చేశారు.
అసలేం జరిగిందంటే..
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL) సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు చెల్లించిందన్న ఆరోపణలున్నాయి. దాంతో అమెరికాలోని పెట్టుబడిదారులు కూడా ఏజీఈఎల్‌లో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి యూఎస్‌లోని ఎస్‌ఈసీ, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ ప్రాథమిక దర్యాప్తు జరిపి సివిల్, క్రిమినల్ కేసులు పెట్టింది. వాటిని ఎదుర్కొనేందుకు అదానీ గ్రూప్ గతంలో రెండు సంస్థలను కూడా నియమించింది.
కేసు నేపథ్యం
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఏజీఈఎల్‌కు అనైతికంగా సాయపడటానికి భారత అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర ఎగ్జిక్యూటివ్‌లపై 2024 నవంబర్ 21న అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ ఎస్ జైన్‌లపై యూఎస్ ఫారిన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఏఫ్‌సీపీఏ) ఉల్లంఘనలకు సంబంధించి అభియోగాలు మోపలేదని ఎజీఈఎల్ నొక్కి చెప్పింది.
ఇదీ చదవండి: ‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్
అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అవి ‘నిరాధారమైనవి’ అని కొట్టిపారేసింది. దాంతోపాటు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సాధ్యమైన అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని చెప్పింది. ఎస్ఈసీ అభ్యర్థనపై భారత ప్రభుత్వం ఇంకా ఏ విధంగానూ స్పందించలేదు. ప్రభుత్వం అదానీలకు ఫిర్యాదును అందించడానికి అంగీకరిస్తుందో.. లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment