ఐలా... హైలెస్సా!
ఐలా బాధ్యతలూ జీహెచ్‌ఎంసీకే...
ప్రభుత్వ యోచన ముమ్మర కసరత్తు
జీహెచ్‌ఎంసీ బాధ్యతలు ... నిర్వహణ పరిధి విస్తృతమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల సేవలను తాను అందించడమేకాక... వాటి ఆదాయాన్ని పొందే అధికారాలు జీెహ చ్‌ఎంసీకి దఖలు పడుతున్నాయి. వీటి ద్వారా సేవలు మెరుగు పడతాయనేది ప్రభుత్వ యోచన. రహదారుల నుంచి నీటి సరఫరా వరకూ విభిన్న విభాగాల పనులు ఇకపై జీహెచ్‌ఎంసీకి అప్పగించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది.
సిటీబ్యూరో: గ్రేటర్‌లోని వివిధ విభాగాలు, వాటి నిర్వహణ బాధ్యతలు ఒక్కటొక్కటిగా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తున్నాయి. మరికొన్ని క్యూలో ఉన్నాయి. ఇప్పటికే ఆర్ అండ్ బీ రహదారులు, హెచ్‌ఎండీఏ అధీనంలోని కొన్ని పార్కులు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వెళ్లాయి. తాజాగా తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బాధ్యతలూ ఆ సంస్థకేఅప్పగించే ఆలోచన లో ప్రభుత్వం ఉంది. మంత్రిమండలి ఉపసంఘం సైతం దీనికేమొగ్గు చూపింది. పనిలో పనిగా ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ)ల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తిపన్ను వసూలు బాధ్యతలూ జీహెచ్‌ఎంసీకే అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది. తమ పరిధిలోని నివాస ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతులతో పాటు ఆస్తిపన్ను వసూళ్లను ప్రస్తుతం ఐలాలే చేస్తున్నాయి. పారిశుద్ధ్య కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు చేపడుతున్నందుకు కొన్ని ప్రాంతాల్లో ఆస్తి పన్నులో 35 శాతం, మరికొన్ని ప్రాంతాల్లో 50 శాతం జీహెచ్‌ఎంసీకి చెల్లిస్తున్నాయి.
సదుపాయాల కల్పనకు...
సిబ్బంది కొరత వంటి కారణాలతో వాస్తవంగా రావాల్సిన ఆస్తిపన్నును ఐలాలు వసూలు చేయలేకపోతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. నిధుల లేమితో ఐలాల పరిధిలోని కాలనీల్లో రహదారుల నిర్వహణ, పార్కుల వంటి సదుపాయాలు లేవు. దీంతో వీటిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశాల్లోనూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించి మూడేళ్లు దాటింది. మరోవైపు ఐలాలకు భవన నిర్మాణ అనుమతులివ్వడం, ఆస్తిపన్ను వసూలు వంటి అధికారాలు లేవని, చట్ట ప్రకారం అవి చెల్లవనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు జీహెచ్‌ఎంసీయే సదుపాయాలు కల్పిస్తే మేలని ప్రభుత్వ భావన. ఇప్పటికే ఆర్ అండ్ బీ రహదారులను జీహెచ్‌ఎంసీ పరం చేయగా... జలమండలి నుంచి నీరు కొనుగోలు చేసి... జీహెచ్‌ఎంసీ సరఫరా చేయాలనేది ఆలోచన.
దాంతో పాటు ఐలాల పరిధిలోనూ జీహెచ్‌ఎంసీయే మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలు ఉన్నాయి. వీటికి విధి విధానాలు రూపొందించేందుకు.. ఎవరు ఏం చేస్తే బాగుంటుందో నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మౌలిక సదుపాయాలు, ఆస్తిపన్ను వసూళ్లు, రహదారుల నిర్వహణపై నివేదిక రూపొందించి, తరువాతి సమావేశంలో అందించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి సూచించినట్లు సమాచారం. ఆ సమావేశంలో ఐలాలపై నిర్ణయం తీసుకోనున్నారు. జీహెచ్‌ఎంసీలో 14 ఐలాలు ఉండగా, వాటి పరిధిలో మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, నాచారం, మల్లాపూర్, పటాన్‌చెరు, సనత్‌నగర్, జీడిమెట్ల తదతర ప్రాంతాల్లోని నివాస కాలనీలు ఉన్నాయి.