- ఆర్ అండ్ బీ రోడ్లకు రూ.46 కోట్లు
- యూజీడీ తవ్వకాలకు రూ.39 కోట్లు
- రెండింటికీ సర్కారు పచ్చ జెండా
- తవ్వితే.. ఏడాది దాకా ఆగాల్సిందే
- అప్పటిదాకా కొత్త రోడ్లు ఎండమావులే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికలకు ముందే.. యూజీడీ తవ్వకాలతో నాలుగేళ్ల పాటు నగరంలోని రోడ్లు ఛిద్రమయ్యాయి. మూడుసార్లు వాయిదాల పద్ధతిన గడువు మీరినా పనులు పూర్తి కాకపోవటంతో ప్రజల్లో నిరసన పెల్లుబికింది. ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో కాంట్రాక్టర్ కూడా చేతులెత్తేయటంతో పనులు ఆగిపోయాయి. దీంతో ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ నిధుల్లో రూ.15 కోట్లు వెచ్చించి రోడ్ల నిర్మాణం చేపట్టారు. రోడ్ల పనులు ప్రారంభం కావడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
గత నెల సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనతో మళ్లీ యూజీడీ అంశం తెరపైకి వచ్చింది. ఒకవైపు ఆర్‌అండ్ బీ రోడ్లకు నిధుల మంజూరుతోపాటు... యూజీడీ పనులు పూర్తిచేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అదనంగా రూ.39 కోట్లు కావాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులు కోరటంతోపాటు.. 9 నెలల గడువులో పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు కంపెనీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అదనపు నిధులతోపాటు మరో రూ.11 కోట్లు ఇన్‌స్పెక్షన్ చాంబర్ల నిర్మాణానికి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు నగరంలో ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధి, అత్యాధునిక విద్యుత్‌దీపాలు, సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సీఎం వెంటబడి నిధులు రాబట్టారు. ఇటీవలే నగరంలోని నాలుగు ప్రధాన రహదారులకు రూ.46 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒకవైపు రోడ్ల నిధులతోపాటు భూగర్భ డ్రెయినేజీని పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించడం గందరగోళానికి తెర లేపింది, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తలలు పట్టుకునేలా చేసింది. యూజీడీ పనులు పూర్తి కాకుండా నగరంలో రోడ్ల నిర్మాణం చేపట్టడం కుదిరేది కాదు. పైపులు వేసిన తర్వాత తవ్వకాలను పూడ్చేసే పని కాంట్రాక్టర్‌దే. కానీ.. ఒక ఏడాది వరకు వేచి చూసి.. ఒక వర్షాకాలం వ్యవధిలో ఎంత లోతుకు కుంగుతుందో చూసిన తర్వాతే దానిపై రోడ్డు నిర్మాణం చేపట్టాలి.
ఈలోపు రోడ్డు నిర్మిస్తే యూజీడీ తవ్విన చోట గుంతలు పడి.. రోడ్డు కుంగిపోవడం ఖాయం. గతంలో నిబంధనలను అతిక్రమించి ఆరు నెలల వ్యవధిలోనే ఏమవుతుందిలే అనుకొని... రోడ్డు నిర్మించినందుకే నగరంలోని స్వశక్తి కాలేజీ ఎదుట రోడ్డు కుంగి పోయింది. కమాన్ నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ వైపు వెళ్లే రోడ్డు సైతం ఈ హడావుడి కారణంగానే పాడైపోయింది. ఈ లెక్కన యూజీడీ పనులు పూర్తయ్యేదాకా.. కొత్త రోడ్ల అభివృద్ధికి ఎండమావిలా ఎదురుచూడాల్సిందే. ఇదేమీ పట్టనట్లుగా రోడ్ల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఆర్‌అండ్‌బీ రోడ్ల సుందరీకరణ పనుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 13న స్మితాసబర్వాల్ అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. యూజీడీ పనులు ఓ వైపు జరుగుతుండగానే, మరోవైపు ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టడం ప్రజాప్రతినిధులకే మింగుడు పడని సమస్యగా మారింది. యూజీడీ కోసం తవ్వితే యేడాది వరకు రోడ్ల పనులు చేపట్టకూడదని తెలిసినప్పటికీ సమన్వయ సమావేశాలు పెట్టి పనులు ఎలా పూర్తిచేస్తారో అర్థం కాని ప్రశ్నగా మారింది.
మరో ఏడాది నగరం నరకమే
Published Mon, Sep 1 2014 2:39 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
Advertisement
Advertisement