ఆర్‌అండ్‌బీ రోడ్లను అభివృద్ధి చేస్తాం - మంత్రి శిద్దా
ఒంగోలు సెంట్రల్ : రాష్ట్రంలోని అన్ని ఆర్‌అండ్‌బీ రోడ్లను అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దారాఘవరావు అన్నారు. ఒంగోలు లాయర్ పేటలోని మంత్రి నివాసంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డబుల్ లైన్ల రహదారులను, నాలుగు లైన్ల రహదారులుగా, నాలుగు లైన్ల రహదారులను 6, 8 లైన్ల రహదారులుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీకి నూతనంగా 1200 బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
నెలకు 400 బస్సులను రోడ్ల మీదకు తెస్తామన్నారు. మొత్తం మార్చిలోపు పాత బస్సుల స్థానం లో నూతన బస్సులను ప్రవేశపెడతామన్నారు. ప్రయివేట్ బస్ ఆపరేటర్లతో తిరుపతిలో సమావేశం నిర్వహిం చి బస్సు టికెట్ రేట్ల విషయంలో హెచ్చరించినట్లు తెలిపారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాల బస్సు స్టాండ్‌లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి బస్సు స్టాప్‌లో సెంట్రల్ ఏసీని, అండర్ గ్రౌండ్ ప్లాట్‌ఫారాలను రూ.350 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. దొనకొండలో ఇండస్ట్రియల్‌కారిడార్‌ను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో వెటర్నరీ యూనివర్శిటీ, మినరల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.