గుండెలు గల్లంతే !
నాగరికతకు చిహ్నాలుగా నిలవాల్సిన రహదారులు నరకానికి నకళ్లుగా తయారయ్యాయి. అడుగుకో అతుకు... గజానికో గుంతతో పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లపై ప్రయాణం అంటేనే ప్రజలు గుం డెలు పట్టుకుంటున్నారు. జిల్లాలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్టు ఆ శాఖ అధికారుల వద్ద ఉన్న లెక్కలు ప్రయాణికుల దురవస్థకు అద్దంపడుతున్నాయి. పొరుగునే కొత్త రాజధాని ఏర్పాటు కానున్న నేపథ్యంలో నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన రోడ్లు నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాల్సిన పాలకులు మీనమేషాలు లెక్కించడం విస్మయానికి గురిచేస్తోంది.
సాక్షి, గుంటూరు
జిల్లాలో ఆర్ అండ్ బీ పరిధిలోని రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారిక సమాచారం. తాత్కాలిక మరమ్మతులు కూడ చేపట్టకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. కొన్ని చోట్ల మోకాలి లోతు గుంతలు ఏర్పడ టంతో ప్రయాణం అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.
ముఖ్యంగా తెనాలి డివిజన్‌లో అధికంగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఇక్కడ నల్లరేగడి నేలలతోపాటు, కాలువలు నీటి సాకర్యం ఎక్కువగా ఉండటం వల్ల ఈ డివిజన్‌ల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి.
జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రోడ్లకు ఇరువైపుల కంపచెట్లు పెరిగాయి, బర్మ్‌లు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం ఇంత వరకు నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం.
{పభుత్వం కొత్త రోడ్లను మంజూరు చేయకపోగా పురోగతిలో ఉన్న పనులను సైతం నిలిపివేసింది. దీంతో రోడ్లు భవనాల శాఖ పరిధిలో పనులు ప్రస్తుతం ఆగిపోయాయి.
ప్రతిపాదనలతోనే సరి...
జిల్లాలో కొత్త రోడ్లకు ప్రతిపాదనలు పంపడం మినహా ప్రభుత్వం నుంచి నిధులు మాత్రం మంజూరు కావడం లేదు.
కర్నూలు-గుంటూరు దాదాపు 300 కిలో మీటర్ల మేర రహదారిని నేషనల్ హైవేకు అప్పజెపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో పాటు గుంటూరు-పర్చూరు, కొండమోడు-పేరేచర్ల, గుంటూరు-తెనాలి, గుంటూరు- బాపట్ల రోడ్లలను నాలుగు లేన్ల రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపారు.
విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొత్త రాజధాని అని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొంది.
జిల్లాలో రోడ్లను అభివృద్ధి చేసే నిమిత్తం వాటిని పరిశీలించేందుకు ఇటీవలే క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీరు వెంకటరెడ్డి సైతం జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించారు.
రూ. 21 కోట్లతో ప్రతిపాదనలు..
జిల్లాలో రోడ్ల నిర్వహణ కోసం రూ. 21కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే వెంటనే మరమ్మతు లు చేపడతాం.
- రాధాకృష్ణ, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ, గుంటూరు.