ఆనందరావు ఒక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ చూస్తూనే గుండె ఆగి గుటుక్కుమన్నాడు.అరగంటలోపే పైలోకానికి చేరుకున్నాడు.ఆనందరావుకు అయోమయంగా ఉంది.ఎందుకంటే అక్కడ ఎన్నో నరకాలు ఉన్నాయి.‘‘అయ్యా! ఇన్ని నరకాలు ఉన్నాయేమిటి?’’ అడిగాడు ఆనందరావు.‘‘రకరకాల దేశాలు ఉన్నట్లే... ఇక్కడ దేశానికొక నరకం ఉంటుంది. అదిగో అక్కడ కనిపిస్తున్నది అమెరికా నరకం... అటు వైపు కనిపిస్తున్నది చైనా నరకం... ఇటు వైపు ఉన్నది ఇండియా నరకం... దాని పక్కన ఉన్నది పాకిస్తాన్ నరకం...’’ చెప్పుకుంటూ పోతున్నాడు యమభటుడు.‘‘ప్లీజ్ ఒకసారి అమెరికా నరకం చూపించరా!’’ అడిగాడు ఆనందరావు.‘‘ఇక్కడ కూడా అమెరికా మీద మోజు పోలేదు’’ అని విసుక్కున్నాడు యమభటుడు.‘‘ఒకే ఒక్కసారి ప్లీజ్’’ బతిమిలాడుకున్నాడు ఆనందరావు.‘‘సరే పదా’’ అంటూ ఆనందరావును అమెరికా నరకానికి తీసుకెళ్లాడు యమభటుడు.నరకంలో సెంట్రల్ ఏసీ... హాయిగా ఉంది.ఒక గోడపై నరకానికి లేటెస్ట్‌గా వచ్చిన సెలబ్రిటీల ఫోటోలు కనిపిస్తున్నాయి.మరోగోడపై నీతి వాక్యాలు కనిపిస్తున్నాయి...‘నరకం నరకం అని భయపడతాంగానీ... నాలుగురోజులు ఉంటే అదే స్వర్గం అయిపోతుంది’‘బాధే సౌఖ్యమనే భావన రానీయండి... నరకలోక సౌఖ్యాలను ఆస్వాదించండి’‘‘నార్త్ కొరియా నరకాన్ని చూస్తావా?’’ అడిగాడు యమభటుడు.‘‘తప్పకుండా’’ అన్నాడు ఆనందరావు.నార్త్ కొరియా నరకంలో...ఎవరూ కనిపించడం లేదు.ఒక వ్యక్తి మాత్రం ఏదో నవల చదువుతూ కూర్చొని ఉన్నాడు.‘‘నార్త్ కొరియా నరకంలో మీరు తప్ప ఎవరూ లేరు ఏమిటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఆనందరావు.‘‘నేను నరకానికి వచ్చిన వాడిని కాదు. ఈ నరకానికి సీఈవోను’’ అన్నాడు ఆ వ్యక్తి గంభీరంగా.‘‘మరి మీరు తప్ప ఎవరూ కనిపించడం లేదేమిటి?’’ ఆసక్తిగా అడిగాడు ఆనందరావు.‘‘పేరుకు ఇది నరకమే కాని, మా ప్రధాన నరకం ‘ఉత్తర కొరియా’ అనే పేరుతో భూలోకంలోనే ఉంది. అక్కడ అంత పెద్ద నరకాన్ని విడిచి ఇక్కడికి రావాల్సిన పనేముంది? అందరితో పాటు మా నరకం కూడాఉండాలనే ఉద్దేశంతో పెట్టామే తప్ప...అసలు మా నరకం భూలోకంలోనే ఉంది. హ్యాట్సాప్ టూ...ప్రెసిడెంట్ కిమ్ జోంగ్–ఉన్’’ అని వివరించాడు నార్త్ కొరియా నరక సీఈవో.
‘‘ఇక్కడ ఉన్న నరకాల్లో ఏ నరకానికి వెళ్లాలనుకుంటున్నావు?’’ అడిగాడు యమభటుడు.‘‘అరే, ఈ ఛాయిస్ కూడా ఉందన్నమాట’’ ఆశ్చర్యపోయాడు ఆనందరావు.‘‘కాస్త ఖర్చువుతుందంతే’’ అని సిగ్గుతో మెలికలు తిరిగాడు యమభటుడు.‘‘ఏ దేశ నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో చెప్పు... తక్కువ శిక్షలు ఉన్న దేశాన్ని ఎంచుకుంటాను. డబ్బు ఎంతైనా సరే’’ అన్నాడు ఆనందరావు.‘‘అలాగే’’ అంటూ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు యమభటుడు...‘‘ముందు అమెరికా నరకం తీసుకుందాం... మార్నింగ్ లేవగానే ఎలక్ట్రికల్ బ్రష్ చేతికి ఇస్తారు. దాంతో పండ్లు తోముకోవాలి.పండ్లను ఎవరో తాళ్లతో కట్టి లాగేస్తున్నంత బాధ ఉంటుంది!ఆ తరువాత ఎలక్ట్రికల్ చైర్‌పై కూర్చో పెట్టి ‘షాక్ బాత్’ చేయిస్తారు. ఆ షాక్ తట్టుకోలేక పెడబొబ్బలు పెట్టాల్సిందే!ఆ తరువాత ఎలక్ట్రికల్ పియానో ముందు కూర్చోపెడతారు. ఈ పియానో ప్రత్యేకత ఏమింటే... దీనిలో ప్రతి కీ షాక్ కొడుతుంది... అలా షాక్ కొట్టించుకుంటూనే వాయించాల్సి ఉంటుంది. ఆ బాధ వర్ణనాతీతం! ఆ తరువాత చెవిలో రెండు కరెంట్ తీగలు దూరుస్తారు. చెవుల్లో వేడి లావా వ్రహిస్తున్ననట్లు...యమ బాధ...ఆ తరువాత ‘ఎలక్ట్రికల్ ర్యాంప్ వాక్’ ఉంటుంది.అరగంట పాటు కరెంటు తీగల మీద వాక్ చేయాల్సి ఉంటుంది. అమ్మో ఆ బాధ వర్ణనాతీతం! ఇక లాస్ట్...ఎలక్ట్రికల్ బెడ్‌లో పడుకో పెడతారు...నిద్ర సంగతి సరే... ఆ షాక్‌లు భరించడం ఎవరివల్లా కాదు...’’ చెప్పుకుంటూ పోతున్నాడు యమభటుడు.‘‘మరి చైనా సంగతి?’’ అడిగాడు ఆనందరావు.‘‘పొద్దునే లేవగానే...ఎలక్రికల్ బ్రష్ చేతిలో పెడతారు. ఆ తరువాత...ఎలక్ట్రికల్ చైర్‌పై షాక్ బాత్ చేయిస్తారు.ఆ తరువాత... ఎలక్ట్రికల్ పియానో ముందు కూర్చోపెట్టి రాగాలు వాయింపజేస్తారు.ఆ తరువాత... కరెంటు తీగలు చెవుల్లో దూరుస్తారు.ఆ తరువాత... ఎలక్ట్రికల్ ర్యాంప్ వాక్ చేయిస్తారు.ఆ తరువాత... ఎలక్ట్రికల్ బెడ్ మీద పడుకోబెడతారు...’’ చెప్పాడు యమభటుడు.‘‘అమెరికాకు, చైనాకు పెద్ద తేడా లేదే...మరి బ్రిటన్ సంగతి?’’ అడిగాడు ఆనందరావు.‘‘సేమ్ టు సేమ్ శిక్షలు! అన్ని దేశాల నరకాల శిక్షలూ ఒకేలాగుంటాయి’’ చెప్పాడు యమభటుడు.‘‘ఏమయ్యా... ప్రతి దేశ నరకంలోనూ ఒకేరకమైన శిక్షలు అమల్లో ఉన్నాయి. దీంట్లో ఎంచుకోవడానికి ఏముంది నా బొంద!’’ అని బాధ పడిపోయాడు ఆనందరావు.ఇంతలో ఆనందరావు బుర్ర ‘ఐడియా గురూ!’ అని ఠంగుమని మోగింది.‘‘నీ ల్యాప్‌టాప్ ఒక అయిదు నిమిషాలు ఇస్తావా?’’ అని యమభటుడి దగ్గరి నుంచి ల్యాప్‌టాప్ తీసుకున్నాడు ఆనందరావు.‘‘యమా! ఎంత ఖర్చయినా ఫరవాలేదు...నేను పాకిస్తాన్ నరకంలో ఉండాలనుకుంటున్నాను’’ అన్నాడు ఉత్సాహంగా ఆనందరావు.‘‘విక్రమార్కా! ఇప్పుడు చెప్పు...ఆనందరావు పాకిస్తాన్ నరకాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు? ఈ ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పలేకపోయావో నీ తల వెయ్యి వక్కలవుతుంది’’ అని బెదిరించాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు.‘‘జవాబు చాలా సింపుల్ భేతాళా! ప్రతి దేశ నరకంలోనూ శిక్షలన్నీ... కరెంట్‌తోనే ముడిపడి ఉన్నాయి.దీంతో ఆనందరావుకి ఒక ఐడియా వచ్చింది. ప్రపంచంలో కరెంట్‌కోత ఎక్కువగా ఉన్న దేశం ఏమిటి? అని నెట్‌లో కొడితే...పాకిస్తాన్ పేరు వచ్చింది. ఎన్ని ఎలక్ట్రికల్ శిక్షలు ఉంటే మాత్రం ఏమిటి? కరెంటే లేనప్పుడు!!’’
– యాకుబ్ పాషా
కరెంట్ తీగ
Published Sun, May 19 2019 12:19 AM | Last Updated on Sun, May 19 2019 12:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment