రహదారుల మరమ్మతులకు రూ. 10 కోట్లు
రహదారుల మరమ్మతులకు రూ. 10 కోట్లు
Published Mon, Sep 26 2016 9:04 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
* పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు
గుంటూరు వెస్ట్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో 118 పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పనులకు నష్టం వాటిల్లిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలోని పీఆర్ ఇంజినీరింగ్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాలకు పంచాయతీ రోడ్లకు తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. దెబ్బతిన్న పీఆర్ రోడ్లకు తాత్కాలిక ప్రాతిపదికన రూ.10 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నట్టు చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన రోడ్ల నిర్మాణానికి రూ.96 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఆర్‌డబ్లు్యఎస్ శాఖకు సంబంధించి రూ.1.20 కోట్ల విలువైన సీపీడబ్లు్య స్కీమ్‌లకు నష్టం వాటిల్లిందని, వీటికి త్వరలోనే మరమ్మతులు చేపడతామని చెప్పారు.
పారిశుద్ధ్యం మెరుగుకు...
గ్రామాలలో పారిశుద్ధ్యం క్షీణించి, వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దీనిపై క్షేత్రస్థాయిలో సర్పంచ్‌లు బాధ్యత తీసుకుని పారిశుద్ధ్యం మెరుగుకు కృషి చేయాలని కోరారు. నీటిపైపులు ఎక్కడైనా లీకేజీలు అయినా, ఇతర నీటి సమస్యలు తలెత్తితే 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించి తగిన మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా 2400 పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఖాళీగా ఉండగా, 1000 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి అనుమతించారని మంత్రి తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ జారీచేసి పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సెక్రటరీ పోస్టుల భర్తీలో అనేక లోపాలు జరిగాయని, వాటిని నివారించేందుకు డిగ్రీ అర్హతగా నిర్ధారించి వాటిని భర్తీ చేయనున్నట్టు మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు.
పీఆర్ విభాగం అధికారులతో సమీక్ష..
పీఆర్ ఎస్‌ఈ జి.జయరాజ్, ఆర్‌డబ్లు్యఎస్ ఎస్‌ఈ పి.భానువీరప్రసాద్, జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, పీఆర్, ఆర్‌డబ్లు్యఎస్ ఇంజినీర్లతో మంత్రి అయ్యన్నపాత్రుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల నష్టపోయిన రోడ్లు, ఇతర పనులపై సమీక్షించారు.
Advertisement