సాక్షి, సిటీబ్యూరో: ఎగుడుదిగుడు మ్యాన్‌హోళ్లను సరిచేసేందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలి నడుం బిగించాయి. ప్రమాదాలకు కారణమవుతున్న వీటిని రహదారులకు సమాంతరంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. సిటీజనులు రోడ్లపై సాఫీగా, సేఫ్‌గా వెళ్లేందుకు చర్యలు తీసుకోనున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులపైనున్న మ్యాన్‌హోళ్లను అంతర్జాతీయ రోడ్ కాంగ్రెస్ ప్రమాణాల మేరకు నిర్మించాలని, ఇందుకు ఒక్కో విభాగం రూ.10 కోట్ల చొప్పున వెచ్చించాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి. మరో 15 రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మ్యాన్‘హెల్స్’...
కోటి జనాభా దాటిన మహానగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. దీని పరిధిలో సుమారు 9వేల కిలోమీటర్ల మార్గంలో రహదారులు ఉన్నాయి. వీటి కింద దాదాపు10వేల కిలోమీటర్ల మార్గంలో మంచినీరు, మురుగు, వరదనీటి పైప్‌లైన్లు, కాల్వలున్నాయి. ఈ రహదారులపై సరాసరి ప్రతి 30మీటర్లకు ఒకటి చొప్పున బల్దియా, జలమండలి విభాగాలకు చెందిన సుమారు 2.85లక్షల మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా రెండు వేల కిలోమీటర్ల మార్గంలో ప్రధాన రహదారులపైనున్న మ్యాన్‌హోళ్లు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. కొన్ని చోట్ల రహదారి స్థాయి కంటే ఎత్తయిన మ్యాన్‌హోళ్లు ఉండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
గతేడాది గ్రేటర్ పరిధిలో ఇలాంటి అపసవ్య, అస్తవ్యస్త మ్యాన్‌హోల్స్ కారణంగా వందకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు ట్రాఫిక్ విభాగం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా సంఘటనల్లో 150 మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. ప్రధాన నగరం, శివార్లు అన్న తేడా లేకుండా ఇదే దుస్థితి నెలకొంది. ప్రధానంగా ఖైరతాబాద్, నాంపల్లి, బంజారాహిల్స్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, మలక్‌పేట్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఎగుడుదిగుడు మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బల్దియా, జలమండలి విభాగాలు సంయుక్తంగా మ్యాన్‌హోళ్లను ఆయా ప్రాంతాల్లోని రహదారులకు సమాంతరంగా తక్షణం పునరుద్ధరించడం, అపసవ్యంగా ఉన్న వాటిని సరిచేయడం, మిస్సింగ్ మ్యాన్‌హోళ్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అత్యంత లోతుగా ఉన్న వాటికి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడం తదితర చర్యలు చేపట్టనున్నాయి.
ఇవీ అనర్థాలు..
♦ ప్రధాన రహదారులపై ఎగుడుదిగుడు మ్యాన్‌హోళ్లతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
♦ అపసవ్య మ్యాన్‌హోళ్లతో ఆయా రహదారులపై ప్రయాణించినప్పుడు కుదుపులకు వాహనదారుల వెన్నెముక దెబ్బతింటోంది.
♦ డ్రైనేజీ ఉప్పొంగినప్పుడు, వరద ప్రవాహం వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లోని రహదారులను ముంచెత్తుతున్నాయి.
♦ తరచూ మ్యాన్‌హోళ్ల మూతలు మిస్సవుతుండడంతో స్థానికులు భయంభయంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది.
సేఫ్ జర్నీ సాకారానికి...
నగరంలోని ప్రధాన రహదారులపై సేఫ్ జర్నీని సాకారం చేసేందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో తక్షణమే మ్యాన్‌హోళ్లను సరిచేయనున్నాం. దాదాపు 2వేల కిలోమీటర్ల మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, సాఫీ ప్రయాణానికి అంతర్జాతీయ రోడ్ కాంగ్రెస్ నిబంధనల మేరకు ఈ పనులు చేపట్టనున్నాం. ఇందుకయ్యే వ్యయాన్ని జీహెచ్‌ఎంసీ, జలమండలి విభాగాలు రూ.10 కోట్ల చొప్పున వ్యయం చేయనున్నాయి. – ఎం.దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ
Comments
Please login to add a commentAdd a comment