గట్టెక్కనున్న ‘వారధి’ | Met Co. Team of officials comes from Kolkata | Sakshi
Sakshi News home page

గట్టెక్కనున్న ‘వారధి’

Published Sat, Dec 20 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

గట్టెక్కనున్న ‘వారధి’

గట్టెక్కనున్న ‘వారధి’

⇒రోడ్డు కం రైలు వంతెనకు విరగడ కానున్న దశాబ్దాల దుస్థితి
⇒ పుష్కరాల నేపథ్యంలో శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు
⇒కోల్‌కతా నుంచి వచ్చిన మెట్ కో అధికారుల బృందం
⇒వారి నివేదిక ఆధారంగా రూపొందనున్న అంచనాలు

సాక్షి, రాజమండ్రి : అరుదైన వారధిని దశాబ్దాలుగా పీడిస్తున్న గడ్డు సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. రాజమండ్రి-కొవ్వూరుల మధ్య గోదారమ్మకు చూడముచ్చటైన వడ్డాణంలా కనిపించే రోడ్డు కం రైలు వంతెన దుస్థితిని రాబోయే పుష్కరాలు గట్టెక్కించనున్నాయి. వాహనాలు ఏవైనా నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణాన్ని ప్రయాసభరితంగా, చేదు అనుభవంగా మారుస్తున్న ఈ వంతెనకు ఆ పాడు కాలం విరగడ కానుంది. రోడ్డు కం రైలు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయించడానికి ఆర్‌అండ్‌బీ శాఖ మార్గాన్వేషణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే రైల్వే, ఆర్‌అండ్‌బీ శాఖల అభ్యర్థన మేరకు కోల్‌కతా నుంచి మెట్ కో అనే కంపెనీ ఉన్నతాధికారుల బృంద ం శుక్రవారం రాజమండ్రి వచ్చింది. వంతెన పరిస్థితిని ఈ బృందం రెండు రోజులు పరిశీలించి, నివేదికను ఆర్‌అండ్‌బీ శాఖకు అందచేస్తుంది. అనంతరం ఆ శాఖ అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు.

నేటివరకూ తాత్కాలిక మరమ్మతులే..
రోడ్డు కం రైలు వంతెనకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలంటే ప్రత్యేకంగా స్టీల్ గడ్డర్లు ఏర్పాటు చేసి, రోడ్డు భాగాన్ని పటిష్ట పరిచే చర్యలు చేపట్టాలి. కానీ అదనంగా గడ్డర్లు వేసేందుకు గతంలో రైల్వే శాఖ విముఖత వ్యక్తం చేసింది. 2005లోనే గడ్డర్లు వేసి మరమ్మతులు చేసేందుకు రూ.2.97 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేశారు. కొత్తగా గడ్డర్లు వేసేందుకు రైల్వే శాఖకు రూ.75 లక్షలు డిపాజిట్ చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధం అయ్యారు. కానీ రైల్వే శాఖ ఇందుకు నిరాకరించింది. దీంతో అప్పట్లో రూ.1.83 కోట్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కానీ అవి ఫలించలేదు. వంతెన 1974లో ప్రారంభం అయిన త ర్వాత 1995లో తొలిసారి మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తాత్కాలిక మరమ్మతులకే రూ.2.78 కోట్ల వరకూ ఆర్‌అండ్‌బీ అధికారులు వెచ్చించారని ఆ శాఖ ఎస్‌ఈ సీఎస్‌ఎన్ మూర్తి వెల్లడించారు. కాగా గత ఐదేళ్లుగా వంతెన పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోడ్డు భాగం పూర్తిగా పాడైపోయింది. దీంతో వంతెనపై ప్రయాణం నరక ప్రాయంగా తయారైంది.

జాయింట్ల నడుమ ఎత్తుపల్లాలతో సమస్య
వంతెనపై 35 క్రొకడైల్ జాయింట్లు ఉన్నాయి. వీటి మధ్యలో 400 సెకండరీ జాయింట్లు ఉన్నాయి. ఈ జాయింట్ల మధ్య ఎత్తుపల్లాలు ఏర్పడి వంతెనపై కుదుపులు పెరిగిపోతున్నాయి. కుదుపులకు లారీల భారం తోడై కాంక్రీటు భాగం రంధ్రాలు పడడం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతికే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. కోల్‌కతాకు చెందిన మెట్ కో వంతెనలకు గడ్డర్లు పంపిణీ చేయడంలో అనుభవమున్న కంపెనీగా అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఈ కంపెనీతో పరిశీలన చేయించాలని సిఫారసు చేసిన నేపథ్యంలో ముందుగా ఆ సంస్థ ఎరెక్షన్ ఇంజనీర్ రంజిత్ రాయ్, స్ట్రక్చర్ డిజైన్ ఇంజనీర్ నీల్‌కమల్ సర్కార్ వంతెనను పరిశీలిస్తున్నారు. అదనంగా గడ్డర్లు ఎలా అమర్చాలి, అవి ఎటువంటి డిజైన్‌తో ఉండాలి, వాటిని వంతెన కింద రోడ్డు కాంక్రీటు భాగంలో ఎలా అమర్చాలి అనే విషయాలను వీరు పరిశీలిస్తున్నారు. అలాగే కొత్తగా గడ్డర్లు లేకుండా కూడా శాశ్వత మరమ్మతులు చేయవచ్చా అనే అంశంపై కూడా వీరు దృష్టి సారిస్తారు.
 
మూడు మాసాలు పడుతుంది..
మెట్ కో బృందం శుక్ర, శనివారాలు వంతెన పరిస్థితిని పరిశీలించి ఆర్‌అండ్‌బీ అధికారులకు నివేదిక ఇస్తుంది. గడ్డర్ల పరిమాణం, వాటి ధరలను అధికారులకు నివేదిస్తుంది. దీని ఆధారంగా అంచనాలు వేస్తారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే పనులు చేపట్టిన మూడు నెలల్లో వంతెనపై గడ్డర్ల అమరిక పూర్తి కావచ్చని ఎస్‌ఈ మూర్తి పేర్కొన్నారు. రైల్వే శాఖ రోజుకు నాలుగు గంటలు మాత్రమే రైళ్లను గరిష్టంగా నిలుపు చేసేందుకు సమ్మతించిందని, దీంతో ఆ సమయాలతో తాము సమన్వయం చేసుకుని పనులు చేయాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement