రైల్వే ట్రాకు పనులు వేగవంతం
* ఐదు చోట్ల భారీగా కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు
* పనులు పర్యవేక్షిస్తున్న జోన్‌స్థాయి అధికారులు
నగరంపాలెం, రాజుపాలెం: వర్షానికి సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాకు పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. శుక్రవారం వరద నీరు తగ్గటంతో ట్రాకుపై నీరు చేరిన ప్రాంతాల్లో మరమ్మత్తులు నిర్వహించారు. ఐదు చోట్ల మాత్రం ట్రాకు కింద మట్టిపూర్తిగా కొట్టుకుపోయింది. సత్తెనపల్లి– రెడ్డి గూడెం మధ్యలో ఒక చోట 800 అడుగులు, ఒక చోట 1200 అడుగులు భారీగా మట్టి కొట్టుకుపోవటంతోపాటు రైల్వే ట్రాకు సైతం 15 మీటర్లుపైనే పక్కకు జరిగింది. పిడుగురాళ్ల వైపు నుంచి, గుంటూరు వైపు నుంచి ట్రాకు ఉన్నంత వరకు కొండరాళ్లు, కంకర గూడ్స్ బోగిల్లో తరలించి అక్కడి నుంచి మనుషుల ద్వారా గండ్లు పడిన చోట్లకు తరలిస్తున్నారు. మట్టిని సరిచేయటానికి అన్ని ప్రదేశాల్లో కలిపి 20 పొక్లెయిన్లు వినియోగిస్తున్నారు. జోన్ పరిధిలో రెస్కూ్యటీంలు, సుమారు 500 మంది వరకు కూలీలు ట్రాకు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజినీరింగ్ అధికారులతోపాటు డీఆర్‌ఎం విజయశర్మ డివిజను స్థాయి అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రికి రెడ్డిగూడెం– పిడుగురాళ్ల మధ్యలో మూడు ప్రదేశాల్లో ట్రాకు పునరుద్ధరించారు. కోనంకి రైల్వేగేటు వద్ద నిలిచిన ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌ను బెల్లంకొండ స్టేషన్‌కు చేర్చారు. వాతావరణం అనుకూలంగా ఉంటే సోమవారం నాటికి పూర్తిస్థాయిలో ట్రాకు అందుబాటులోకి రానుంది.