సుందరీకరణ పూర్తిచేసుకున్న సమాధుల దృశ్యాలు , టూంబ్స్ సెల్లార్‌లో రాజ సమాధి
సాక్షి, హైదరాబాద్: మిరుమిట్లు గొలిపేలా కుతుబ్‌షాహీల సమాధులకు మరమ్మతులు సాగుతున్నాయి. ఐదొందల ఏళ్ల తర్వాత జిగేల్‌మనేలా మెరవనున్నాయి. గోల్కొండ సమీపంలోని వంద ఎకరాల పచ్చని బయళ్ల మధ్య పాలవర్ణంతో మహానగరానికే ఓ కొత్త ఐకానిక్‌గా మిగలనున్నాయి. గోల్కొండ రాజ్యం నాటి చరిత్ర, సంస్కృతి, గొప్పదనానికి ఈ సమాధులు ఓ ఆనవాళ్లు. సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో ఆగాఖాన్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా సాగుతున్న పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి.
ఇప్పటికే ఇబ్రహీం కులీ సమాధి, మృతి చెందిన తరువాత రాజుల భౌతికకాయాలకు స్నానాలు చేయించే గదితోపాటు కొందరు రాజుల కుటుంబ సభ్యుల సమాధులకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇండో పర్షియన్, ఇరానియన్ శైలిలో నిర్మితమైన ఈ సమాధులను సాలార్‌జంగ్–3 హయాంలో వందేళ్ల క్రితం మరమ్మతులు చేశారు. ప్రస్తుతం ఎలాంటి రసాయనాల వాడకుండా 500 ఏళ్ల క్రితం వాడిన ముడి పదార్థాలతోనే వన్నెలద్దుతున్నారు. బెంగాలీ వృత్తి నిపుణులు అంగుళమంగుళమూ ప్రత్యేకత ఉండేలా శ్రద్ధ తీసుకుంటున్నారు.
వరల్డ్ హెరిటేజ్ సైట్‌కు మళ్లీ...
వీలైనంత త్వరగా ఈ మరమ్మతులు పూర్తి చేసి యునెస్కో ప్రకటించే వరల్డ్ హెరిటేజ్ సైట్ కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపే దిశగా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా మానవ నిర్మితమై, చూసే వారికి అత్యద్భుతమనిపించే సైట్లనే వరల్డ్ హెరిటేజ్ సైట్‌లుగా యునెస్కో ప్రకటిస్తుంది.
గతంలో చార్మినార్, గోల్కొండ కోటలకు ఈ గుర్తింపునిచ్చే ప్రతిపాదనలు పంపినా వాటికి తుది జాబితాలో చోటు దక్కలేదు. తాజాగా కుతుబ్‌షాహీల సమాధులకు ఔరా అనే స్థాయిలో జరుగుతున్న మరమ్మతుల అనంతరం తప్పకుండా అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని చరిత్రకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమాధుల నవీకరణ పనులను ఎప్పటికప్పుడు యూఎస్, యూకే ప్రతినిధులు సైతం సందర్శిస్తూ సలహాలు, సూచనలు ఇస్తుండటం విశేషం.
వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా రావాలంటే...
యునెస్కో ప్రత్యేక బృందం వరల్డ్ హెరిటేజ్ సైట్‌కు అధికారిక హోదానిస్తుంది. హోదా దక్కాలంటే నిర్దేశించిన పది పాయింట్లలో మెజారిటీ అంశాలపై ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఆ కట్టడాలు మానవ నిర్మితమై ఉండాలి, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన మానవీయ విలువలు వ్యక్తమవుతూ, ప్రపంచంలోనే ప్రకృతిలో కలిసిపోయేంత అత్యంత అద్భుతమైన నిర్మాణ సొగసును సొంతం చేసుకుని ఉండాలన్న నిబంధనలున్నాయి. ఐతే, ఈ నిబంధనలకు లోబడే కుతుబ్ షాహీ సమాధులను సిద్ధం చేస్తుండటంతో ఈసారి తప్పక వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా వస్తుందన్న విశ్వాసాన్ని ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమాధుల చరిత్ర ఇదీ
1518 –1687 మధ్య కాలంలో గోల్కొండను పాలించిన రాజుల సమాధులే ఇవీ. ఈ నిర్మాణాలు దేనికదే ప్రత్యేకం. గుండ్రని గోపురం, అష్టకోణ నిర్మాణంలోని సమాధిశాలలున్నాయి. సుల్తాన్ కులీ, జంషెడ్ కులీ, సుబాన్ కులీ, ఇబ్రహీం కులీ, మహ్మద్ కులీ, సుల్తాన్ అహ్మద్, అబ్దుల్లా కుతుబ్‌షా, అబుల్ హసన్ తానీషాలు గోల్కొండ రాజ్యాన్ని పాలించారు. వారు తమకు తామే సమాధి శాలలు నిర్మించుకోవటం విశేషం.
ఇప్పటికే దేశంలో..
దేశంలో ఇప్పటికే 37 నిర్మాణాలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు వచ్చింది. ఇందులో తాజ్‌మహల్, ఎర్రకోట, కుతుబ్ మినార్, అజంతా, ఎల్లోరా, హంపీ, ఖజరహో, హుమాయున్ సమాధి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హెరిటేజ్ సైట్‌లు అధికంగా ఇటలీలో 54, చైనాలో 53, స్పెయిన్‌లో 47, జర్మనీలో 44 కట్టడాలకు యునెస్కో గుర్తింపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment