qutub shahi tombs
-
యునెస్కోను మెప్పించాలి
27 చారిత్రక కట్టడాలనూ.. చారిత్రక గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌తోపాటు రాష్ట్రంలోని 27 పురాతన చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రణాళికలు 4 వారాల్లో రూపొందించాలని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమై పలు సూచలను చేసిందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. సాక్షి, హైదరాబాద్: ‘చారిత్రక వారసత్వసంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి ప్రపంచ పటంలో స్థానం లభించడం తెలంగాణకు గర్వకారణం. దీంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. చారిత్రక శిల్పకళా సంపద కల్గిన రామప్ప ఆలయాన్ని యునెస్కో తాత్కాలిక ప్రాతిపదికన హెరిటేజ్ కేంద్రంగా ఎంపిక చేసింది. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి యునెస్కో అధికారులను మెప్పించాలి. వారి అంచనాల మేరకు డిసెంబర్‌లోగా ఈ క్షేత్రం సంరక్షణకు చర్యలు చేపట్టి పూర్తిస్థాయి హెరిటేజ్ కేంద్రంగా గుర్తింపు సాధించాలి’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రామప్ప ఆలయానికి యునెస్కో తాత్కాలిక గుర్తింపు లభించడంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించి బుధవారం విచారించింది. ఆగస్టు 4న ఏఎస్ఐ, కలెక్టర్ సమావేశమవ్వాలి ‘ఇదొక అద్భుతమైన, బంగారం లాంటి అవకాశం. రామప్ప ఆలయ సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. దీనిని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దాలి. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఉండేందుకు ఇక్కడ విడిది సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), రాష్ట్ర ఆర్కియాలజీ విభాగం, హెరిటేజ్ విభాగం, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలి. ఆగస్టు 4న ఈ నాలుగు విభాగాల అధికారులు సమావేశం కావాలి. నాలుగు వారాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి రామప్ప ఆలయ అభివృద్ధికి బ్లూప్రింట్ రూపొందించాలి. వెంటనే కార్యాచరణ ప్రారంభించాలి. పనుల పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించుకోవాలి. యునెస్కో అంచనాల మేరకు అధికారులు పనిచేయక, గుర్తింపు వెనక్కు పోయే పరిస్థితి వస్తే మాత్రం దేశమంతా నిందిస్తుంది. సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను మేమే పర్యవేక్షిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. -
ఈసారి కుతుబ్ షాహీ టూంబ్స్
సాక్షి, హైదరాబాద్: రామప్ప రుద్రేశ్వర దేవాలయానికి ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ హోదా దక్కిన నేపథ్యంలో, తదుపరి కుతుబ్ షాహీ టూంబ్స్ రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. హైదరాబాద్ నగర నిర్మాతలైన కుతుబ్ షాహీ వంశస్తుల సమాధుల ప్రాంగణాన్ని గతంలోనే యునెస్కోకు ప్రతిపాదించినప్పటికీ తిరస్కరణకు గురైంది. వాస్తవానికి అప్పట్లో చార్మినార్, గోల్కొండలతో కలిపి దాన్ని ప్రతిపాదించారు. అద్భుత కట్టడాలే అయినప్పటికీ చార్మినార్, గోల్కొండల చుట్టూ పలు ఆక్రమణలు ఉండటంతో యునెస్కో ఆ ప్రతిపాదనను బుట్ట దాఖలు చేసింది. దీంతో సమాధుల ప్రాంగణం ఒక్కదాన్నే ప్రతిపాదించాలన్న ఆలోచన తాజాగా తెరపైకి వస్తోంది. కాగా తదుపరి దశలో పాండవుల గుట్ట, అలంపూర్ నవబ్రహ్మ దేవాలయ సమూహాలకు కూడా యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించే అర్హత ఉందని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్కు అవకాశం ఉంది రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావటంలో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కీలక భూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. యునెస్కోకు ప్రతిపాదన (డోజియర్) రూపొందించటం మొదలు, చివరకు ఫైనల్ ఓటింగ్ రోజున వర్చువల్ సమావేశంలో పాల్గొనటంతో పాటు ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగంతో ఈ ట్రస్టు కలిసి పనిచేసింది. ఇప్పుడు తదుపరి ప్రతిపాదన విషయంలో కూడా ఇదే ట్రస్టు కీలకంగా వ్యవహరించనుంది. ఈసారి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణాన్ని ప్రతిపాదించాలనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ‘రామప్ప’లాంటి ప్రతిపాదన మరోసారి చేసేందుకు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్న ప్రాంతం కుతుబ్‌షాహీ టూంబ్స్ ప్రాంగణమే అని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ సలహాదారు పాపారావు ‘సాక్షి’తో చెప్పారు. గతంలో అడ్డుగా నిలిచిన పరిస్థితులను చక్కదిద్దగలిగితే కుతుబ్ షాహీ టూంబ్స్కు కూడా ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాజవంశీయుల సమాధులన్నీ ఒకేచోట.. ఓ రాజవంశానికి చెందిన వారి సమాధులన్నీ ఒకేచోట ఉండటం, వాటి నిర్మాణం ప్రత్యేకంగా రూపొందటం ప్రపంచంలో మరెక్కడా లేదు. కుతుబ్ షాహీ రాజులు, వారి భార్యలు, పిల్లలు, వారి ముఖ్య అనుచరుల సమాధులు .. వెరసి 30 సమాధులు ఒకేచోట ఉన్నాయి. గోల్కొండ కోటకు కేవలం కిలోమీటరు దూరంలో ఇబ్రహీంబాగ్గా పేర్కొనే చోట వీటిని నిర్మించారు. పర్షియన్–ఇండియన్ నిర్మాణ శైలితో అద్భుతంగా నిర్మించారు. ç1543–1672 మధ్య ఇవి రూపొందాయి. వారి పాలన అంతరించాక వాటి నిర్వహణ సరిగా లేక కొంత దెబ్బతిన్నా.. 19వ శతాబ్దంలో సాలార్జంగ్–3 వాటిని మళ్లీ మరమ్మతు చేసి పునరుద్ధరించారు. ఢిల్లీలోని హుమయూన్ సమాధిని యునెస్కో గుర్తించిన నేపథ్యంలో.. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణం మరింత సులభంగా యునెస్కో గుర్తింపును పొందుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యునెస్కో నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధిలో ఆక్రమణలు లేకుండా చూడాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరో ప్రపంచ వారసత్వ హోదా కోసం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. మరో నాలుగేళ్ల తర్వాతనే.. తాజా ప్రతిపాదనను యునెస్కో ముందుంచేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరైన పోటీ లేనిపక్షంలో మళ్లీ తెలంగాణకు అవకాశం రావచ్చునని అంటున్నారు. ఈలోపు నిర్ధారించుకున్న కట్టడ పరిసరాలను యునెస్కో నిబంధనల మేరకు తీర్చిదిద్దితే, కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా మరో గొప్ప అవకాశాన్ని ఒడిసిపట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరో గొప్ప నిర్మాణం అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాల సమూహం.. కర్ణాటకలోని పట్టడకల్ దేవాలయాలు యునెస్కో గుర్తింపు పొందాయి. వాటిని నిర్మించిన బాదామీ చాళుక్యులే అలంపూర్‌లో ఏడో శతాబ్దంలో బ్రహ్మేశ్వరాలయాల సమూహాన్ని అద్భుత శిల్ప, వాస్తు నైపుణ్యంతో నిర్మించారు. నవ బ్రహ్మలుగా తొమ్మిది శివరూపాలతో ఉన్న ఈ ఆలయాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తుంగభద్ర ఒడ్డున ఉన్న ఈ ఆలయాలను ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. వాటిల్లో 32 రకాల కిటికీలు, పైకప్పు శిల్పాలు రేఖా నాగర ప్రాసాదం శైలిలో నిర్మాణాలు జరిగాయి. దాదాపు 50 ఎకరాల వైశాల్యంలో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణానికి కూడా వారసత్వ హోదా పొందే అర్హత ఉందని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ విశ్రాంత స్తపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. పాండవుల గుట్ట కూడా సిద్ధం.. దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం మానవుడి చిత్రలేఖనం ఎలా ఉండేది..? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే పూర్వపు వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట గుహలను పరికిస్తే తెలుస్తుంది. దాదాపు వేయి చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బింబేడ్కాలో దాదాపు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టల్లో వేల సంఖ్యలో ఇలాంటి చిత్రాలున్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా ఆదిమానవులు వేసిన అన్ని చిత్రాలు ఒకేచోట బయటపడ్డ దాఖలాలు లేవు. దీంతో దాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాతో సత్కరించింది. ఆ తర్వాత అన్ని చిత్రాలున్న ప్రాంతంగా ఇప్పటివరకు పాండవుల గుట్టనే రికార్డుల్లో ఉంది. ఇది కూడా యునెస్కో గుర్తింపును పొందగల అర్హతలున్న ప్రాంతమేనని పురావస్తు పరిశోధకులు రంగాచార్యులు, శ్రీరామోజు హరగోపాల్‌లు తెలిపారు. -
కుతుబ్‌షాహీల సమాధులకు కొత్త లుక్
సాక్షి, హైదరాబాద్: మిరుమిట్లు గొలిపేలా కుతుబ్‌షాహీల సమాధులకు మరమ్మతులు సాగుతున్నాయి. ఐదొందల ఏళ్ల తర్వాత జిగేల్మనేలా మెరవనున్నాయి. గోల్కొండ సమీపంలోని వంద ఎకరాల పచ్చని బయళ్ల మధ్య పాలవర్ణంతో మహానగరానికే ఓ కొత్త ఐకానిక్‌గా మిగలనున్నాయి. గోల్కొండ రాజ్యం నాటి చరిత్ర, సంస్కృతి, గొప్పదనానికి ఈ సమాధులు ఓ ఆనవాళ్లు. సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో ఆగాఖాన్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరేళ్లుగా సాగుతున్న పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఇబ్రహీం కులీ సమాధి, మృతి చెందిన తరువాత రాజుల భౌతికకాయాలకు స్నానాలు చేయించే గదితోపాటు కొందరు రాజుల కుటుంబ సభ్యుల సమాధులకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇండో పర్షియన్, ఇరానియన్ శైలిలో నిర్మితమైన ఈ సమాధులను సాలార్జంగ్–3 హయాంలో వందేళ్ల క్రితం మరమ్మతులు చేశారు. ప్రస్తుతం ఎలాంటి రసాయనాల వాడకుండా 500 ఏళ్ల క్రితం వాడిన ముడి పదార్థాలతోనే వన్నెలద్దుతున్నారు. బెంగాలీ వృత్తి నిపుణులు అంగుళమంగుళమూ ప్రత్యేకత ఉండేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. వరల్డ్ హెరిటేజ్ సైట్‌కు మళ్లీ... వీలైనంత త్వరగా ఈ మరమ్మతులు పూర్తి చేసి యునెస్కో ప్రకటించే వరల్డ్ హెరిటేజ్ సైట్ కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపే దిశగా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా మానవ నిర్మితమై, చూసే వారికి అత్యద్భుతమనిపించే సైట్లనే వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా యునెస్కో ప్రకటిస్తుంది. గతంలో చార్మినార్, గోల్కొండ కోటలకు ఈ గుర్తింపునిచ్చే ప్రతిపాదనలు పంపినా వాటికి తుది జాబితాలో చోటు దక్కలేదు. తాజాగా కుతుబ్‌షాహీల సమాధులకు ఔరా అనే స్థాయిలో జరుగుతున్న మరమ్మతుల అనంతరం తప్పకుండా అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని చరిత్రకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమాధుల నవీకరణ పనులను ఎప్పటికప్పుడు యూఎస్, యూకే ప్రతినిధులు సైతం సందర్శిస్తూ సలహాలు, సూచనలు ఇస్తుండటం విశేషం. వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా రావాలంటే... యునెస్కో ప్రత్యేక బృందం వరల్డ్ హెరిటేజ్ సైట్‌కు అధికారిక హోదానిస్తుంది. హోదా దక్కాలంటే నిర్దేశించిన పది పాయింట్లలో మెజారిటీ అంశాలపై ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంది. ముఖ్యంగా ఆ కట్టడాలు మానవ నిర్మితమై ఉండాలి, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన మానవీయ విలువలు వ్యక్తమవుతూ, ప్రపంచంలోనే ప్రకృతిలో కలిసిపోయేంత అత్యంత అద్భుతమైన నిర్మాణ సొగసును సొంతం చేసుకుని ఉండాలన్న నిబంధనలున్నాయి. ఐతే, ఈ నిబంధనలకు లోబడే కుతుబ్ షాహీ సమాధులను సిద్ధం చేస్తుండటంతో ఈసారి తప్పక వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా వస్తుందన్న విశ్వాసాన్ని ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాధుల చరిత్ర ఇదీ 1518 –1687 మధ్య కాలంలో గోల్కొండను పాలించిన రాజుల సమాధులే ఇవీ. ఈ నిర్మాణాలు దేనికదే ప్రత్యేకం. గుండ్రని గోపురం, అష్టకోణ నిర్మాణంలోని సమాధిశాలలున్నాయి. సుల్తాన్ కులీ, జంషెడ్ కులీ, సుబాన్ కులీ, ఇబ్రహీం కులీ, మహ్మద్ కులీ, సుల్తాన్ అహ్మద్, అబ్దుల్లా కుతుబ్‌షా, అబుల్ హసన్ తానీషాలు గోల్కొండ రాజ్యాన్ని పాలించారు. వారు తమకు తామే సమాధి శాలలు నిర్మించుకోవటం విశేషం. ఇప్పటికే దేశంలో.. దేశంలో ఇప్పటికే 37 నిర్మాణాలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు వచ్చింది. ఇందులో తాజ్‌మహల్, ఎర్రకోట, కుతుబ్ మినార్, అజంతా, ఎల్లోరా, హంపీ, ఖజరహో, హుమాయున్ సమాధి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హెరిటేజ్ సైట్లు అధికంగా ఇటలీలో 54, చైనాలో 53, స్పెయిన్‌లో 47, జర్మనీలో 44 కట్టడాలకు యునెస్కో గుర్తింపునిచ్చింది. -
కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సందర్శించిన రౌహానీ
సాక్షి, హైదరాబాద్ : ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ రెండో రోజు నగరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం షేక్‌పేట్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను రౌహనీ సందర్శించారు. కుతుబ్‌షాహీ సమాధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్కామసీదుకు చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. స్వాతంత్ర్యం అనంతరం మక్కామసీదును సందర్శించిన తొలి విదేశీ దేశాధినేత హసన్ రౌహానీయే కావడం విశేషం. రెండురోజుల పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ముస్లిం ప్రముఖులు, రాజకీయనాయకులు, విద్యావేత్తలు, మేధావులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
కుతుబ్‌షాహీ టూంబ్స్కు కొత్త కళ..
న్యూఢిల్లీ: చారిత్రక వారసత్వ సంపద అయిన కుతుబ్‌షాహీ సమాధుల (టూంబ్స్)కు త్వరలోనే పర్యాటక కళ చేకూరనుంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ కట్టడాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ వారసత్వ హోదా పొందిన దాదాపు 25 ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పన, సుందరీకరణ, పార్కులు, టాయిలెట్లు, భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తెలిపారు. తొలుత హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ సమాధులు, కర్ణాటకలోని హంపి, పాత గోవా ప్రాంతంలోని చర్చిలు, రాజస్థాన్‌లోని కుంభాల్‌గఢ్ తదితర కోటలు, గుజరాత్‌లోని రాణీకి వావ్, కశ్మీర్‌లోని లెహ్ ప్యాలెస్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మరిన్ని దేశాలకు ‘వచ్చాకే వీసా’.. విదేశీ పర్యాటకులు మన దేశానికి వచ్చాక విమానాశ్రయాల్లో తాత్కాలిక వీసా తీసుకునే (వీసా ఆన్ అరైవల్) సదుపాయాన్ని 150 దేశాలకు విస్తరిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. ఇంతకు ముందు 43 దేశాలకు సంబంధించి ఈ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఈ చర్యలు ముదావహమని కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ డెరైక్టర్ పీటర్ కెర్కర్, థామస్ కుక్ ఇండియా విభాగం ఎండీ మాధవన్ మీనన్ చెప్పారు. బడ్జెట్లో నిర్ణయాలు పర్యాటకానికి మంచి ఊపునిస్తుందని ‘మేక్ మై ట్రిప్’ వెబ్సైట్ సీఈవో రాజేష్ మాగోవ్ పేర్కొన్నారు.