సాక్షి, హైదరాబాద్: రామప్ప రుద్రేశ్వర దేవాలయానికి ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ హోదా దక్కిన నేపథ్యంలో, తదుపరి కుతుబ్ షాహీ టూంబ్స్ రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. హైదరాబాద్ నగర నిర్మాతలైన కుతుబ్ షాహీ వంశస్తుల సమాధుల ప్రాంగణాన్ని గతంలోనే యునెస్కోకు ప్రతిపాదించినప్పటికీ తిరస్కరణకు గురైంది. వాస్తవానికి అప్పట్లో చార్మినార్, గోల్కొండలతో కలిపి దాన్ని ప్రతిపాదించారు. అద్భుత కట్టడాలే అయినప్పటికీ చార్మినార్, గోల్కొండల చుట్టూ పలు ఆక్రమణలు ఉండటంతో యునెస్కో ఆ ప్రతిపాదనను బుట్ట దాఖలు చేసింది. దీంతో సమాధుల ప్రాంగణం ఒక్కదాన్నే ప్రతిపాదించాలన్న ఆలోచన తాజాగా తెరపైకి వస్తోంది. కాగా తదుపరి దశలో పాండవుల గుట్ట, అలంపూర్ నవబ్రహ్మ దేవాలయ సమూహాలకు కూడా యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించే అర్హత ఉందని పురావస్తు నిపుణులు చెబుతున్నారు.
కుతుబ్ షాహీ టూంబ్స్‌కు అవకాశం ఉంది
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావటంలో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కీలక భూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. యునెస్కోకు ప్రతిపాదన (డోజియర్) రూపొందించటం మొదలు, చివరకు ఫైనల్ ఓటింగ్ రోజున వర్చువల్ సమావేశంలో పాల్గొనటంతో పాటు ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగంతో ఈ ట్రస్టు కలిసి పనిచేసింది. ఇప్పుడు తదుపరి ప్రతిపాదన విషయంలో కూడా ఇదే ట్రస్టు కీలకంగా వ్యవహరించనుంది.
ఈసారి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణాన్ని ప్రతిపాదించాలనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ‘రామప్ప’లాంటి ప్రతిపాదన మరోసారి చేసేందుకు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్న ప్రాంతం కుతుబ్‌షాహీ టూంబ్స్ ప్రాంగణమే అని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ సలహాదారు పాపారావు ‘సాక్షి’తో చెప్పారు. గతంలో అడ్డుగా నిలిచిన పరిస్థితులను చక్కదిద్దగలిగితే కుతుబ్ షాహీ టూంబ్స్‌కు కూడా ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
రాజవంశీయుల సమాధులన్నీ ఒకేచోట..
ఓ రాజవంశానికి చెందిన వారి సమాధులన్నీ ఒకేచోట ఉండటం, వాటి నిర్మాణం ప్రత్యేకంగా రూపొందటం ప్రపంచంలో మరెక్కడా లేదు. కుతుబ్ షాహీ రాజులు, వారి భార్యలు, పిల్లలు, వారి ముఖ్య అనుచరుల సమాధులు .. వెరసి 30 సమాధులు ఒకేచోట ఉన్నాయి. గోల్కొండ కోటకు కేవలం కిలోమీటరు దూరంలో ఇబ్రహీంబాగ్‌గా పేర్కొనే చోట వీటిని నిర్మించారు. పర్షియన్–ఇండియన్ నిర్మాణ శైలితో అద్భుతంగా నిర్మించారు. ç1543–1672 మధ్య ఇవి రూపొందాయి. వారి పాలన అంతరించాక వాటి నిర్వహణ సరిగా లేక కొంత దెబ్బతిన్నా.. 19వ శతాబ్దంలో సాలార్‌జంగ్–3 వాటిని మళ్లీ మరమ్మతు చేసి పునరుద్ధరించారు. ఢిల్లీలోని హుమయూన్ సమాధిని యునెస్కో గుర్తించిన నేపథ్యంలో.. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణం మరింత సులభంగా యునెస్కో గుర్తింపును పొందుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యునెస్కో నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధిలో ఆక్రమణలు లేకుండా చూడాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరో ప్రపంచ వారసత్వ హోదా కోసం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది.
మరో నాలుగేళ్ల తర్వాతనే..
తాజా ప్రతిపాదనను యునెస్కో ముందుంచేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరైన పోటీ లేనిపక్షంలో మళ్లీ తెలంగాణకు అవకాశం రావచ్చునని అంటున్నారు. ఈలోపు నిర్ధారించుకున్న కట్టడ పరిసరాలను యునెస్కో నిబంధనల మేరకు తీర్చిదిద్దితే, కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా మరో గొప్ప అవకాశాన్ని ఒడిసిపట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరో గొప్ప నిర్మాణం అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాల సమూహం..
కర్ణాటకలోని పట్టడకల్ దేవాలయాలు యునెస్కో గుర్తింపు పొందాయి. వాటిని నిర్మించిన బాదామీ చాళుక్యులే అలంపూర్‌లో ఏడో శతాబ్దంలో బ్రహ్మేశ్వరాలయాల సమూహాన్ని అద్భుత శిల్ప, వాస్తు నైపుణ్యంతో నిర్మించారు. నవ బ్రహ్మలుగా తొమ్మిది శివరూపాలతో ఉన్న ఈ ఆలయాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తుంగభద్ర ఒడ్డున ఉన్న ఈ ఆలయాలను ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. వాటిల్లో 32 రకాల కిటికీలు, పైకప్పు శిల్పాలు రేఖా నాగర ప్రాసాదం శైలిలో నిర్మాణాలు జరిగాయి. దాదాపు 50 ఎకరాల వైశాల్యంలో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణానికి కూడా వారసత్వ హోదా పొందే అర్హత ఉందని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ విశ్రాంత స్తపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
పాండవుల గుట్ట కూడా సిద్ధం..
దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం మానవుడి చిత్రలేఖనం ఎలా ఉండేది..? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే పూర్వపు వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట గుహలను పరికిస్తే తెలుస్తుంది. దాదాపు వేయి చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బింబేడ్కాలో దాదాపు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టల్లో వేల సంఖ్యలో ఇలాంటి చిత్రాలున్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా ఆదిమానవులు వేసిన అన్ని చిత్రాలు ఒకేచోట బయటపడ్డ దాఖలాలు లేవు. దీంతో దాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాతో సత్కరించింది. ఆ తర్వాత అన్ని చిత్రాలున్న ప్రాంతంగా ఇప్పటివరకు పాండవుల గుట్టనే రికార్డుల్లో ఉంది. ఇది కూడా యునెస్కో గుర్తింపును పొందగల అర్హతలున్న ప్రాంతమేనని పురావస్తు పరిశోధకులు రంగాచార్యులు, శ్రీరామోజు హరగోపాల్‌లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment