
నౌకాశ్రయాలలో విడి భాగాలను నిర్మించి వాటన్నిటినీ పాత భవనం దగ్గరకు రవాణాచేసి అతికించడంతో కొత్ పార్లమెంటు భవనం రెడీ అయిపోతుంది!
బ్రిటిష్ పార్లమెంట్ భవనానికి మరమ్మతులు వచ్చాయిట! చాలా పాత భవనం కదా... వచ్చే ఉంటాయి.. అయితే ఏంటి అంటున్నారా? ఈ మరమ్మతులు చేయాలంటే భవనాన్ని ఖాళీ చేయాలి కదా? ఇవి కాస్తా పూర్తయ్యేందుకు ఆరేళ్లకుపైగా సమయం పడుతుందట. మరి అప్పటివరకూ సమావేశాలు ఎక్కడ నడపాలి? అన్నది సందేహం. సరే... ఏదో ఒక భవనంలోకి మారిపోదామంటే బోలెడు ఖర్చు. పైగా అన్ని విభాగాలు ఒకే దగ్గర ఉండేందుకు తగ్గ భవనం కూడా అందుబాటులో ఉండాలి.
ఈ సమస్యకు జెన్‌స్లర్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ చూపుతున్న పరిష్కారమే... ఈ ఫొటోలు. ప్రస్తుతం పార్లమెంటు భవనమున్న ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్‌కు ఆనుకుని కేవలం పది మీటర్ల దూరంలో మాత్రమే ఉండే థేమ్స్ నదిపై ఓ తాత్కాలిక భవనాన్ని కట్టేస్తే సరిపోతుందని అంటోంది ఈ సంస్థ.
‘ప్రాజెక్ట్ పొసైడన్’ పేరుతో జెన్‌స్లర్ ప్రతిపాదిస్తున్న ఈ తేలియాడే పార్లమెంటు భవనం దాదాపు 8600 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంటుంది. దాదాపు 250 మీటర్ల పొడవు ఉండే ఈ తాత్కాలిక భవనాన్ని ఉక్కు, కలపల సాయంతో కడతారు. వెస్ట్‌మినిస్టర్ హాల్ (బ్రిటన్ పార్లమెంటు ఉన్న భవనం) పైకప్పు ఆకారాన్ని పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేసింది జెన్‌స్లర్. అంతేకాదు... ఈ తేలియాడే తాత్కాలిక పార్లమెంటు భవనాన్ని బ్రిటన్‌లోని వేర్వేరు నౌకాశ్రయాల్లో ముక్కలు ముక్కలుగా నిర్మించి అన్నింటినీ థేమ్స్ నది ద్వారా తీసుకొచ్చి జోడిస్తారు.
పార్లమెంటు భవనం మరమ్మతులు పూర్తయిన తరువాత దీన్ని ఇంకోచోటికి తరలించి మ్యూజియమ్‌గానో... ఇంకో ఇతర అవసరం కోసమో వాడుకోవచ్చునని అంటోంది జెన్‌స్లర్. తమ డిజైన్‌ను స్వీకరించాలని నిర్ణయిస్తే అది బ్రిటన్ ప్రభుత్వానికి దాదాపు 180 కోట్ల పౌండ్ల డబ్బు ఆదా చేస్తుందని, ఈ అంచనా కూడా బ్రిటిష్ పార్లమెంట్ కమిటీ చేసిందేనని అంటోంది ఈ కంపెనీ. అన్నింటికీ మించి... థేమ్స్ నదిపై ఈ సరికొత్త పార్లమెంటు భవనం మరో టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారినా ఆశ్చర్యం లేదు.
పాత భవనం మరమ్మతులు అయ్యేవరకు, ఆ పక్కనే పార్లమెంటు సమావేశాలకోసం థేమ్స్ నదిపై నిర్మాణం కాబోతున్న కొత్త భవనం నమూనా.