ముసురేసిన సిటీ! | hyderbad people problems faced on heavy rain | Sakshi
Sakshi News home page

ముసురేసిన సిటీ!

Published Wed, Jun 29 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

ముసురేసిన సిటీ!

ముసురేసిన సిటీ!

సిటీబ్యూరో: గత మూడు రోజులుగా ‘ముసురు’తున్న  వర్షంతో నగర ప్రజలు అల్లాడుతున్నారు. ఎడతెగకుండా  విడతలుగా కురుస్తున్న వర్షంతో శిథిల భవనాలు, పురాతన గోడలు, సెల్లార్ల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

 
పైనుంచి వరదనీరు భారీగా వస్తుండటంతో హుస్సేన్‌సాగర్ లోతట్టు ప్రాంతాల బస్తీల ప్రజల్లో భయం పట్టుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ బస్తీలకు ముప్పు తప్పదని  ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలానికి ముం దస్తుగా ముంపు సమస్యల్లేకుండా తగు చర్యలు చేపట్టడంలో జీహెచ్‌ఎంసీ ప్రతియేటా విఫలమవుతోంది. నీటి నిల్వ ప్రాంతాలకు తగిన మరమ్మతులు చేసి, వాననీరు సాఫీగా వెళ్లేలా చేయలేకపోతోంది. దీంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నగర ప్రజలకు ఎప్పటిలాగే వాన కష్టాలు తప్పేలా లేవు.

 
165 బస్తీలకు పొంచి ఉన్న ప్రమాదం..
భారీ వర్షాలొస్తే గ్రేటర్ పరిధిలోని దాదాపు 165 బస్తీలు నీట మునిగే ప్రమాదం ఉంది.  అధికారులకు కూడా ఈ విషయం తెలుసు.  అయినప్పటికీ ముంపు నివారణ చర్యల్లో, ముందస్తుగానే నీరు నిల్వలేకుండా అవసరమైన పనులు చేయడంలో  విఫలమయ్యారు. దీంతో ఈసారీ నగరంలోని పలు బస్తీలకు వరదముంపు పొంచి ఉంది. గతంలో  చెరువులను తలపింపచేసిన అఫ్జల్‌సాగర్, నానల్‌నగర్, బతుకమ్మకుంట, నాగమయ్యకుంట, సబర్మతీనగర్, అమన్‌నగర్, సిద్దిఖీనగర్ తదితర బస్తీలకు ప్రమాదం పొంచి ఉంది.

 
వరదలొస్తే ముంపు బారిన పడనున్న బస్తీలు..

అంబర్‌పేట మండలంలోని పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, నరసింహబస్తీ, సంజయ్‌గాంధీనగర్, శివానందనగర్, వెంకటేశ్వరనగర్, న్యూగంగానగర్, విజ్ఞాన్‌పురి, పద్మానగర్(మలక్‌పేట),న్యూశంకర్‌నగర్, బతుకమ్మకుంట వైభవ్‌నగర్, గంగానగర్, అన్నపూర్ణనగర్, పూల్‌బాగ్ కాలాడేరా, కమలానగర్ మూసానగర్, ఇందిరానగర్ , మూసారాంబాగ్ తదితర బస్తీలు ముంపునకు గురవుతాయి. ఆసిఫ్‌నగర్ మండలంలోని  అఫ్జల్‌సాగర్, లక్ష్మీనగర్, ఇంద్రానగర్, సర్వర్‌నగర్. బహదూర్‌పురా మండలంలోని  బిలాల్‌నగర్, బండ్లగూడ మండలంలో పార్వతీనగర్, శివాజీనగర్, అరుంధతీనగర్, సదత్‌నగర్, మొగల్‌కాలనీ, చార్మినార్ మండలంలోని సిద్దిఖీనగర్, అమన్‌నగర్-బి, జహంగీర్‌నగర్, భవానీనగర్,  అమన్‌నగర్-ఎ, ఇష్రాఫ్‌నగర్, రహ్మత్‌నగర్, మౌలాకాచిల్లా, గంగానగర్, ముర్తుజానగర్, చంద్రానగర్, ఫరత్‌నగర్, సయ్యద్ సాబ్‌కా బాడా, బాగ్ ఎ జహరాన్, గోల్కొండ మండలంలోని  తాఖత్‌బౌలి, ధనకోట, హీరాఖాన్, సజ్జద్ కాలనీ, రాఘవమ్మ కంచ, సదత్‌నగర్, సాలేహ్‌నగర్, లక్ష్మినగర్, అంబేద్కర్‌నగర్‌లకు ముప్పు ఉంది.

 
హిమాయత్‌నగర్ మండలంలోని  అంబేద్కర్‌నగర్, దోమలగూడ ఎంసీహెచ్ క్వార్టర్స్, రత్నానగర్, శాస్త్రినగర్, నెహ్రూనగర్, కృష్ణానగర్. నాంపల్లి మండలంలోని ఉస్మాన్‌గంజ్, ఖల్సావాడి, ఫీల్‌ఖానా, బేగంబజార్, ధూల్‌పేట, లక్ష్మీదాస్‌బాడ, దత్తానగర్, గౌలిగూడ, ఆగాపురా. సైదాబాద్ మండలంలోని శంకేశ్వర్‌బజార్, చంద్రయ్య హట్స్, లక్ష్మయ్య హట్స్. అమీర్‌పేట మండలంలోని వెంక్యాబస్తీ, శ్యామల కుంట. ఖైరతాబాద్ మండలంలోని రాజ్‌నగర్, ఖైరతాబాద్ మండలంలోని ఎంఎస్ మక్తా, మారుతినగర్, బ్రాహ్మణవాడి, దోబిఘాట్(పంజగుట్ట), మారేడ్‌పల్లి మండలంలోని చంద్రబాబునాయుడు నగర్, అంబేద్కర్‌నగర్, లాలాపేట వినోభానగర్, దూద్‌బావి. ముషీరాబాద్ మండలంలోని సబర్మతినగర్, అరుంధతినగర్. సికింద్రాబాద్ మండలంలోని ఇందిరమ్మనగర్, కట్టమైసమ్మ (రసూల్‌పురా), వెంగళ్రావునగర్ బస్తీ, అమ్ముగూడ. షేక్‌పేట మండలంలోని హకీంపేట బస్తీ, ఎండిలైన్స్ (టోలిచౌకి), నదీంకాలనీ, డా.బీఆర్. అంబేద్కర్‌నగర్, ఉదయ్‌నగర్ కాలనీ, బీజేఆర్‌నగర్ (ఫిల్మ్‌నగర్), తిరుమలగిరి మండలంలోని సీతారాంపురం, గణేశ్‌నగర్, శ్రీనివాసనగర్ కాలనీ, సాయిబాబా కాలనీ, తోకట్ట గ్రామం తదితరమైనవి కూడా ప్రమాదం అంచులో ఉన్నాయి.

 
ప్రణాళికలు తప్ప పనుల్లేవు..

వరదముప్పు పొంచి ఉన్న ఈ లోతట్టు బస్తీలు జలమయం కాకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో అవసరమైన  వరదనీటి సంపులు నిర్మించాలని,  పైప్ డ్రెయిన్‌లు వేయాలని, అవసరమైన  ఇతరత్రా పనులు చేయాలని రెండేళ్ల  క్రితమే భావించినప్పటికీ  నేటికీ చేయలేదు.

 
శిథిల భవనాలతో భయం .. భయం..

శిథిల భవనాలకు తగిన మరమ్మతులు చేయడమో, కూల్చివేయడమోచేయాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరిస్తున్నా  వాటి యజమానులు పట్టించుకోవడం లేరు. తాజా సమాచారం మేరకు నగరంలో 1819 శిథిల భవనాలను గుర్తించి వాటిల్లో 1248 భవనాలను కూల్చివేయడమో, మరమ్మతులు చేయడమో జరిగిందని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. మిగతావాటిల్లో  176 భవనాలకు సంబంధించి కోర్టు వివాదాలున్నాయి. 152 భవనాల స్ట్రక్చరల్‌స్టెబిలిటీ పరీక్షించాల్సిందిగా ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అయితే అది ఆ పని పూర్తిచేయలేదు. ఇప్పటి వరకు 32 భవనాలను కూల్చివేసినట్లు టౌన్‌ప్లానింగ్ విభాగం పేర్కొంది. నిర్మాణంలో ఉన్న భవనాల సెల్లార్ల తవ్వకాల్ని వర్షాకాలంలో ఆపివేయాల్సిందిగా అధికారులు ఆదేశించినా అమలవుతున్న దాఖలాల్లేవు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement