ఈ నాలాను చూస్తే ఇందులో ఎవరూ జారిపడకుండా తగిన రక్షణ చర్యలు ఉన్నట్లు కనిపిస్తోందా ?
హైదరాబాద్: వర్షాకాలంలోనూ ఎలాంటి ప్రమాదాలు జరగవని అనిపిస్తోందా?... ఇక్కడ నివసిస్తున్న ప్రజలతోపాటు జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగానికీ, రాజకీయ నేతలకు మాత్రం అలా కనిపిస్తున్నట్లు.. అనిపిస్తున్నట్లే ఉంది. అందుకే ఎంతోకాలంగా పరిస్థితి ఇలాగే ఉన్నా ఎవరూ శ్రద్ధ చూపలేదు. నాలాను ఆనుకునే జీవిస్తున్న వారు రక్షణ కోసం కనీసం కంచె వంటివి ఏర్పాటు చేసుకోలేదు. నాలా సేఫ్టీ ఆడిట్‌లో భాగంగా నాలా ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తామన్న జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సైతం ఆ పనిచేయలేదు.
భారీ వర్షాలొచ్చినా ఎక్కడా కూడా ప్రజలు నాలాల్లో పడిపోయే పరిస్థితులుండరాదని, చెత్త, ఇతరత్రా వ్యర్థాలు వేయకుండా ఏర్పాట్లుండాలని, ఓపెన్ నాలాలకు ఫెన్సింగ్ ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ.. ఎందుకనోగానీ ఎవరూ పట్టించుకోలేదు. ప్రజలకు కూడా తగిన అవగాహన కల్పిస్తామన్న ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే కవాడిగూడ దామోదర సంజీవయ్య బస్తీకి చెందిన లక్ష్మి అనే మహిళ ఈ నాలాలో పడటం వల్లే మరణించింది.
శిథిల భవనాల్లో ఉంటున్న వారిని సైతం వాటినుంచి ఖాళీ చేయిస్తున్న జీహెచ్‌ఎంసీ ఇంత ప్రమాదకర పరిస్థితులున్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు విస్మరించింది. అందుకు కారణం రాజకీయ నేతలే కారణమన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. నాలా రక్షణ చర్యలు చేపట్టాలంటే విస్తరణ పనులు చేయాలి. అందుకు ఆస్తులు సేకరించాలి. ఇళ్లనుంచి ప్రజలను ఖాళీ చేయించాలి. అందుకు ససేమిరా అంటున్న ప్రజల్ని ఖాళీ చేయిస్తే తమ ఓటుబ్యాంకుకు గండి పడితుందన్న ఆలోచనతో తగిన చర్యలు తీసుకోలేదన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ప్రజల ప్రాణాలు నాలాల్లో కలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment