- ఇది హాట్‌లైన్ సిబ్బంది ప్రత్యేకత!!
సీలేరు : విద్యుత్ ఉండగా వైర్లను ఎవరైనా ముట్టుకుంటారా? అలా తాకితే బతికి బట్టకడతారా? కానీ వీరు మాత్రం విద్యుత్ సరఫరా అవుతున్న తీగలతోనే గడుపుతారు. అయినా ఆ విద్యుత్ వీరిని ఏమీ చేయదు! వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం!! ఆ కథాకమామిషూ ఏమిటంటే.. జెన్‌కో హాట్‌లైన్ విభాగం సిబ్బంది విజయవాడకు విద్యుత్ సరఫరా అవుతుండగానే మరమ్మతులు చేయడంలో దిట్టలు.
ప్రస్తుతం రాష్ట్రంలో జలవిద్యుత్కేంద్రాల్లో తయారయ్యే విద్యుత్‌ను 220 కేవీ ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే లైన్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో రెండ్రోజులుగా విద్యుత్ లైన్లను బాగు చేస్తున్నారు. కళ్లు మాత్రమే కనిపించేలా ఒంటి నిండా రబ్బరుతో తయారు చేసిన ప్రత్యేక దుస్తులు ధరించారు. చేతులకు గ్లౌజుల్లాంటివి వేసుకున్నారు.
గురువారం సీలేరు జలవిద్యుత్ కేంద్రం నుంచి గాజువాక, కొంబూరు సబ్‌స్టేషన్లకు సరఫరా అయ్యే 220 కేవీ విద్యుత్ లైన్‌ను మరమ్మతులు చేపట్టారు. విజయవాడ హాట్‌లైన్ సిబ్బంది విద్యుత్ సరఫరా అవుతుండగానే మరమ్మతులు చే శారు. విద్యుత్ సరఫరా జరుగుతున్నా అవలీలగా తీగల వెంబడి పాకుతూ, నిలబడుతూ ప్రాణాలకు తెగించి మరమ్మతు పనులు చేస్తుండడాన్ని చూసిన వారు ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.