కాటేసిన కరెంట్ తీగలు
విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
దేవనకొండ: పొలంలో విద్యుత్ మోటారుకు మరమ్మతులు చేసేందుకు వెళ్లి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం ఐరన్ బండ సెంటర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు రాజు తనకున్న పొలంలో వ్యవసాయ బోరు చెడిపోవడంతో విద్యుత్ మోటార్‌ను పైకి తీసి మరమ్మతులు చేయిస్తున్నాడు. ఇందులో భాగంగా బోరులో పైపులను దింపే పనులు చేస్తున్నారు. విద్యుత్ మోటార్‌ను రెండు ఇంచుల పైపులకు కింది భాగాన అమర్చి బోరులోనికి దింపడం మొదలు పెట్టారు. దాదాపు నాలుగు పైపులను బోరులోనికి దించేశారు. వారు ఇలా చేస్తున్న సమయంలో పైపులకు పైభాగాన విద్యుత్ తీగలు(11 కేవీఏ విద్యుత్ తీగలు) వెళ్లిన విషయాన్ని గమనించలేకపోయారు. దీంతో వారు దించుతున్న ఇనుప పైపులు ఒక్కసారిగా ఈ తీగలను తాకాయి (పైపులు 14 అడుగుల పైభాగంలో ఉన్నాయి). దీంతో పైపులను గట్టిగా పట్టుకున్న వారు ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయారు.
ఈ ఘటనలో మెకానిక్ దస్తగిరి, పొలం యజమాని రైతు రాజు, కూలీ పనికి వచ్చిన వడ్డే సుంకన్న అక్కడిక్కడే మృతిచెందారు. మిగతా కూలీలైన నాగరాజు, షఫీ, రామాంజనేయులు, రామదాసు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు మిన్నంటాయి. పొలం యజమాని రైతు రాజు ఈ మధ్యనే ఉల్లి గడ్డలను అతి తక్కువ ధర (క్వింటం రూ.500)కు అమ్మి తీవ్ర బాధలో ఉన్నాడు. ఎలాగైనా విద్యుత్ మోటార్‌కు మరమ్మతులు చేయించి ఈసారైనా వేరుశనగను పండించి అప్పుల నుంచి గట్టెక్కాలనుకున్నాడు.
అంతలోనే ఆయనను కరెంట్ రూపంలో మృత్యువు కబళించింది. మృతిచెందిన మెకానిక్ దస్తగిరి, రైతు రాజు, కూలీ పనికొచ్చిన వడ్డే సుంకన్నలకు ముగ్గురు చొప్పున సంతానం. విషయం తెలుసుకున్న దేవనకొండ ఎస్‌ఐ మోహన్‌కిషోర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. మృతులను దేవనకొండ విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని అందజేస్తామని వారి కుటుంబ సభ్యులకు తెలపారు. గ్రామంలో ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.