సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చెరువులు, కుంటలను ‘మిషన్ కాకతీయ’ పేరుతో మరమ్మతులు చేయాలనే ప్రభుత్వ సంకల్పం అంత త్వరగా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. పనుల గుర్తింపు, అంచనా, టెండర్లు, పునరుద్ధరణ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఈ కార్యక్రమం పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష జరిపిన విష యం తెలిసిందే. డిసెంబర్ రెండవ వారంనాటికి ప్రతిపాదనలు సమర్పించి, నెలాఖరులో టెండర్లు పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ఆచరణలో మాత్రం అది సాధ్యం కావడం లేదు.
అధికారులు, సిబ్బంది కొరత తదితర కారణాలు ఉన్నప్పటికీ, మొత్తం 3,251 చెరువులు, కుంటలలో మొదటి విడతగా 615 చెరువులను పరిగణనలోకి తీసుకున్నారు. వీటి అంచనాలు తయారు చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఇప్పటి వరకు 460 చెరువులనే సర్వే చేసిన అధికారులు, బుధవారంనాటికి 257 చెరువుల పునరుద్ధరణకు సంబంధించి రూ.131.19 కోట్ల అంచనా తో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇంకా 315 చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లు ఎప్పుడు పూర్తవుతాయి? ఈ నెలాఖరులో సాధ్యమేనా? ఆ తర్వాత మూడు నెలలలో పూర్తి కాకపోతే పరిస్థితి ఏమిటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కార్యాచరణ ప్రణాళిక ఇదీ
జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో మొత్తం 3,251 చెరువులు, కుంటలు ఉండగా, మొదటి విడతగా 615 చెరువులు,కుంటల మరమ్మతులు,పునరుద్ధరణ పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొం దించారు. నిజామాబాద్, బోధన్, కామారెడ్డి డివిజన్ల లో సర్వే చేసి అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కలిగేలా అంచనాలు వేశారు. అయితే, ఇప్పటి వరకు 460 చెరువులు, కుంటలను సర్వే చేసి అంచనాలను ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
మార్గదర్శకాల మేర కు ప్రతి జిల్లాలో 20 శాతం చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులను 2015 మార్చిలోగా పూర్తి చేయా ల్సి ఉంది. క్షేత్రస్థాయిలో వివిధ కారణాలతో అంచనాలు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. రెండు నెలల వ్యవధిలో 257 చెరువులే టెండర్ల స్థాయికి చేరగా, మూడు నెలలలో మిగతా 358 చెరువుల పనుల అంచనాలు సిద్ధం చేసి, టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయడం ఎలా సాధ్యం అవుతుందన్న చర్చ జరుగుతోంది.
కబ్జాలపై ముందుకు సాగని ‘ఉమ్మడి పరిశీలన’
ఓ వైపు చెరువుల, కుంటల పునరుద్ధరణ కోసం అంచనాల తయారీలో జాప్యం జరుగుతోంది. మరోవైపు కబ్జాలకు గురైన శిఖములను స్వాధీనం చేసుకునేం దుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త తని ఖీలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ రెండు శాఖ ల మధ్యన సమన్వయం లేదన్న విషయంలో ‘‘రెవె న్యూ శాఖ తమ పని కాదన్నట్లుగా వ్యవహరిస్తోం ద’’ని స్వయంగా మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
సత్వరమే కబ్జాలకు గురైన చెరువులు, కుంటల శిఖం భూములను స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ సమీపంలోని రామర్తి చెరువుతోపాటు, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పట్టణ శివారులలో చెరువులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి.ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, పిట్లం, భీమ్‌గల్, నిజాంసాగర్ మండలాలలో విపరీతంగా ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయం మంత్రి సమీక్ష సమావేశంలో చర్చకు వచ్చాయి.
ఆక్రమణలను తొలగించకపోతే ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తీసుకున్న ‘మిషన్‌కాకతీయ’కు ప్రతి బం ధకాలు తప్పవన్న చర్చ కూడ జరిగింది. ఇంత జరిగి నా, ప్రజాప్రతినిధుల సహకారం లేక.. ఆక్రమణలపై ‘జాయింట్ ఇన్‌స్పెక్షన్’ సరిగా జరగక అంచనాల తయారీలో విపరీత జాప్యం జరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం వేగం పెంచకపోతే చెరువులు, కుంటల పునరుద్ధరణ పనుల ప్రణాళిక మరింత నత్తనడకకు చేరే ప్రమాదం లేకపోలేదు.
నత్తనడకన ‘మిషన్ కాకతీయ’
Published Thu, Dec 25 2014 2:37 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement