బీటలు పడిన ఎక్కెల పెద్ద చెరువు మత్తడి ఆఫ్రాన్
‘మిషన్’ మొదటి దశలో నిర్మాణం
నాసిరకం పనులే కారణమంటున్న రైతులు
ఏటూరునాగారం : మండలంలోని ఎక్కె ల పెద్ద చెరువుకు కొత్తగా నిర్మించిన మ త్తడి ఆప్రాన్ పగుళ్లు బారింది. మిషన్ కాకతీయ మొదటి విడతలో ఈ చెరువు మరమ్మతులకు రూ. 22 లక్షలు మంజూ రయ్యాయి. ఈ నిధులతో పూడికతీత ప నులు, చెరువుకట్ట పటిష్టం, మత్తడి నిర్మాణాలు, తూముల మరమ్మతులు చేపట్టారు. ఇందులో మత్తడి ముందు నిర్మించిన అఫ్రాన్ పనులు పూర్తి కాక ముందే పగుళ్లు బారడం విశేషం. పను లు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేయడం వల్లనే ఆఫ్రాన్ పగుళ్లు బారిందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఆఫ్రాన్ నిర్మించిన అనంతరం 21రోజుల పాటు నీటితో క్యూరింగ్ చేయాల్సి ఉంది.
కానీ రెండు మూడు రో జుల క్యూరింగ్ చేయడంతో సిమెంట్‌తో నిర్మించిన ఆఫ్రాన్‌కు పగుళ్లు రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పనుల్లో చిన్ననీటి పారుదలశాఖ ఇంజనీరింగ్ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి పనులను పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నాసిరకం పనులు చేశారని ఎక్కెల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగుళ్లు బారిన ఆఫ్రాన్‌ను తొలగించి మళ్లీ నిర్మించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై చిన్ననీటి పారుదలశాఖ డీఈఈ వెంకటేశ్వర్లను వివరణ కోరగా పగుళ్లు బారిన నిర్మాణం స్థానంలో కొత్తది నిర్మించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి. ఇటీవల నిర్మించిన మత్తడి వద్ద పగుళ్లు రావడంతో నాలుగు కాలాల పాటు ఉండాల్సిన మత్తడి నాలుగు రోజులకే పోయే విధంగా ఉంది. కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. - చంద రాజు, ఆయకట్టు రైతు ఎక్కెల