మరమ్మతులు చేస్తున్న దృశ్యం...
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ దుర్ఘటన నేపథ్యంలో అన్ని స్టేషన్లలో మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్‌అండ్‌టీలు అప్రమత్తమై ఆయా స్టేషన్లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పనులు చేపడుతున్నాయి. విడిభాగాలు, ప్లాస్టరింగ్ మెటీరియల్ ఊడి పడకుండా మరమ్మతు పనులు చేపట్టినట్లు హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పనులను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానన్నారు. పనుల నాణ్యత, మన్నిక, లోపాలను గుర్తించేందుకు ఎల్‌అండ్‌టీ ఆరు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. పనులు చేపట్టేందుకు అత్యంత ఎత్తునకు వెళ్లే బూమ్ లిఫ్టులు, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశామన్నారు. నాగోల్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలోని అన్ని స్టేషన్ల విడిభాగాలు, ఇతర నిర్మాణాలను సూక్ష్మంగా పరిశీలిస్తున్నామన్నారు. సుదీర్ఘం అనుభవం కలిగిన ఇంజినీర్ల పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయన్నారు. నిర్మాణాల్లోని పగుళ్లు, ఉపరితల ప్లాస్టర్ మెటీరియల్, కాంక్రీట్ చిప్‌లు, విడిభాగాలు ఊడిపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇక్కడే మరమ్మతులు..
ప్రధానంగా బాలానగర్, పరేడ్‌గ్రౌండ్స్, రసూల్‌పురా, హైటెక్‌సిటీ, గాంధీభవన్, ఎల్బీనగర్, న్యూమార్కెట్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ తదితర స్టేషన్లకున్న పగుళ్లను సరిదిద్దుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment