
24 గంటలు మూసివేత
మాధవనగర్ రైల్వే గేటుకు మరమ్మతులు
డిచ్‌పల్లి (నిజామాబాద్ రూరల్): నిజామాబాద్, డిచ్‌పల్లి ప్రధాన రహదారిపై ఉన్న మాధవనగర్ రైల్వే గేటును మరమ్మతుల నిమిత్తం 24 గంటల పాటు మూసివేయనున్నారు. ఈ నెల 20న ఉదయం 8 గంటల నుంచి 21న ఉదయం 8 గంటల వరకు గేటును పూర్తిగా మూసి ఉంచనున్నట్లు రైల్వే ఏడీ రాము మంగళవారం తెలిపారు.
వాహనదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి రైల్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. నిజామాబాద్ నుంచి డిచ్‌పల్లి వైపు వెళ్లే ప్రయాణికులు బోర్గాం, మోపాల్, కులాస్‌పూర్, ముల్లంగి గ్రామాల మీదుగా లేదా బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. డిచ్‌పల్లి వైపు నుంచి నిజామాబాద్ వెళ్లే వారు ఇదే రూట్లలో వెళ్లాలన్నారు.