ఫినిష్..! | Fish landing center is superfluous | Sakshi
Sakshi News home page

ఫినిష్..!

Published Wed, Jan 13 2016 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

Fish landing center is superfluous

ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న        ఫిష్ ల్యాండింగ్ సెంటర్
బోట్లు నిలిపేందుకు జెట్టీ లేక     మత్స్యకారుల అవస్థలు
అక్కరకు రాని అభివృద్ధి ఫలాలు
రూ.80 లక్షల ప్రజాధనం వృథా
అధికారులకు ముందుచూపు లేని ఫలితం

 
మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృథా అయ్యేలా చేసింది. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాల ఫలితం ఏడేళ్ల కిందట నిర్మించిన భవనాన్ని నిరుపయోగంగా మార్చింది. మత్స్యకారుల సౌకర్యం కోసమంటూ ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన అధికారులు, ఇప్పుడు అక్కడ బోట్లు నిలిపేందుకు అనువుగా లేదని, మరో చోట నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చావుకబురు చల్లగా చెబుతున్నారు.
 
రేపల్లె: సముద్ర తీర ప్రాంతమైన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల నుంచి మత్స్యకారులు మరబోట్లలో చేపల వేటకు వెళ్తుంటారు. ఈ ప్రాంతం నుంచి సుమారు 300 బోట్లు నిత్యం సముద్రంలోకి వెళ్తుంటాయి.
 వీరంతా వేటాడి ఒడ్డుకు చేర్చిన మత్స్య సంపదను అమ్ముకునే వరకు నిల్వ ఉంచడానికి.. ఉప్పు నిల్వలు, వలల మరమ్మతులు వంటి కార్యకాలాపాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తీరంలో ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులు నిర్ణయించారు. దీనికి సమీపంలో ఉన్న రేవులో బోట్లు నిలిపేందుకు వీలుగా జెట్టీ నిర్మించాలని భావించారు. అనుకున్నదే తడవుగా నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని గొంది సముద్రంలో రూ.80 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించారు. చుట్టూ ప్రహరీ, ఇనుప గేట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రాకపోకలకు అనువుగా సీసీ రోడ్డు నిర్మించారు. ఈ తతంగమంతా జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు కావస్తోంది. నేటికీ ఆ భవనం ప్రారంభానికి నోచుకోలేదు. బోట్లు నిలిపేందుకు జెట్టీ నిర్మించలేదు. ఏళ్ల తరబడి వినియోగంలో లేకపోవడంతో రాళ్లు లేచి రోడ్డు అధ్వానంగా తయారైంది. గేట్లు తుప్పు పట్టి విరిగిపోయాయి. కాంపౌండ్ లోపల పిచ్చిమొక్కలు మొలిచి అధ్వాన స్థితికి చేరింది. మత్స్యకారుల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం అక్కరకు రాకుండాపోయింది.

 జెట్టీ ఏర్పాటుకు వినతి..
 కొత్తపాలెం పంచాయితీ పరిధిలోని బోట్లు ఆగేందుకు అక్కడ అనువుగా జెట్టీ లేకపోవడంతో మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో నిలుపుకుని తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ఫిష్‌లాండింగ్ భవనానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని, దానికి అనువుగా రేవులో జెట్టీ ఏర్పాటు చేయాలని మత్స్యకారులు విన్నవిస్తున్నారు.
 
మరోచోట భవనం ఏర్పాటు చేస్తాం..
 గొంది సముద్రంలో బోట్లు ఎక్కువగా నిలుపుకునేందుకు అనువుగా లేకపోవటం వల్ల అక్కడ జె ట్టీ నిర్మాణం చేపట్టలేదు. నక్షత్రనగర్‌లోని రేవు వద్ద బోట్లు ఎక్కువగా నిలుపుకునేందుకు అనువుగా ఉంది. దీంతో అక్కడే జెట్టీ ఏర్పాటు చేసి దానికి అనువుగా ఫిష్‌ల్యాండింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
 - ఎ.రాఘవరెడ్డి,
 మత్యశాఖ అభివృద్ధి అధికారి, నిజాంపట్నం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement