
దరిచేరని కృష్ణమ్మ
అలంకారప్రాయంగా పెలైట్ ప్రాజెక్టులు
నిర్వహణ లోపంతో రూ.కోట్ల ప్రాజెక్టులు నిరుపయోగం
మూడు నెలలుగా మరమ్మతుల ఊసెత్తని అధికారులు
తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న దాచేపల్లి మండల ప్రజలు
దాచేపల్లి : ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన పెలైట్ ప్రాజెక్టులు అలంకార ప్రాయంగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడం.. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అవి కాస్తా మూలనపడ్డాయి. వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాథుడు లేరు. దీంతో వేసవికి ముందే గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అప్పటి గురజాల ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి దాచేపల్లి మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేశారు. కృష్ణా జలాలను గ్రామాలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. నిర్వహణ లోపం కారణంగా ప్రస్తుతం తాగునీటి ప్రాజెక్టులు నిరుపయోగంగా మారాయి.
మండలంలోని శ్రీనగర్ గ్రామంలో రూ.1.50 కోట్లు, దాచేపల్లిలో రూ.4 కోట్లు, తంగెడలో రూ.75 లక్షలతో తాగునీటి పెలైట్ ప్రాజెక్ట్‌లను నిర్మించారు. వీటిని 2006లో ప్రారంభించారు. శ్రీనగర్‌లో నిర్మించిన ప్రాజెక్ట్ నుంచి శ్రీనగర్, రామాపురం, గామాలపాడు, శ్రీనివాసపురం గ్రామాలకు, జేపీ సిమెంట్స్‌ఫ్యాక్టరీ కాలనీకి నీరు సరఫరా చేయాలని, అదేవిధంగా దాచేపల్లి ప్రాజెక్ట్ నుంచి దాచేపల్లి, నడికుడి, యిరికేపల్లి గ్రామాలకు, తంగెడలో నిర్మించిన ప్రాజెక్ట్ నుంచి అదే గ్రామానికి కృష్ణా జలాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టారు. పొందుగల గ్రామ సమీపంలోని కృష్ణానది నుంచి మోటర్ల ద్వారా నీళ్లు తోడి పైపుల ద్వారా శ్రీనగర్, దాచేపల్లి ప్రాజెక్ట్‌లకు పంపింగ్ చేస్తారు. అక్కడ ఫిల్టర్ చేసిన నీటిని గ్రామాలకు సరఫరా చే స్తారు. మరమ్మతులకు గురైన మోటార్లను పట్టించుకోకపోవడంతో తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు.
మరమ్మతులు పట్టని అధికారులు..
శ్రీనగర్, దాచేపల్లి గ్రామాల్లోని పెలైక్ట్ ప్రాజెక్ట్‌లు పనిచేయటం లేదు. పొందుగల సమీపంలోని నదిలో నీటిని తోడేందుకు ఏర్పాటు చేసిన ఐదు మోటర్లు మూడు నెలల క్రితం మరమ్మతులకు గురయ్యాయి. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు మరమ్మతులు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. భూ గర్భజలాలు అడుగంటి పోవటంతో గ్రామాల్లోని బోర్ల నుంచి తాగునీరు రాకపోవటంతో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. తంగెడ గ్రామంలో నిర్మించిన పెలైక్ట్ ప్రాజెక్ట్ నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. ఈ ప్రాజెక్ట్ నుంచి మూడు రోజులకోసారి కృష్ణా జలాలను అందిస్తున్నారు. గ్రామంలోని కాలనీలకు పైపులైన్లు నిర్మించకపోవటం వల్ల నీరు సరఫరా కావడం లేదు.