శ్రీహరికోట : మానవ సహిత యాత్ర కోసం భారత్ గగన్‌యాన్ మిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మిషన్ కోసం రష్యాలో ఒక సంవత్సరం పాటు భారత వ్యోమగాములు శిక్షణను కూడా పూర్తి చేశారు. గగన్ యాన్ మిషన్ కోసం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేయాలని ఇస్రో భావిస్తోంది. గగన్‌యాన్ మిషన్‌తో డేటా వినిమయం జరపడం కోసం ప్రత్యేకంగా డాటా రిలే సాటిలైట్‌ను ప్రయోగించనుంది. గగన్‌యాన్ మిషన్‌కు ముందుగా ఈ శాటిలైట్‌ను ఇస్రో ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యోమగాములను లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)కు పంపడానికి ఉపయోగపడుతుంది. మొదటి దశలో భాగంగా ఈ మానవరహిత మిషన్ డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నారు.
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా వ్యోమగాములు వెళ్లే అంతరిక్ష నౌకకు డేటారిలే ఉపగ్రహంగా పనిచేస్తోందని, అందుకోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లకు ఆమోదం తెలిపిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. నిర్ణీత కక్షలో తిరిగే శాటిలైట్‌కు, భూమి మీద ఉండే గ్రౌండ్ స్టేషనుకు సరైన సంబంధం లేకుంటే శాటిలైట్ అందించే డేటా భూమి పైకి చేరదు. దీన్ని నిరోధించడానికి డేటా రిలే శాటిలైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కాగా, నాసా మానవ సహిత అంతరిక్ష నౌకల కోసం, అత్యంత బలమైన డేటా రిలే ఉపగ్రహాన్ని కలిగి ఉంది. భూమిపై ఎలాంటి ప్రత్యేకమైన గ్రౌండ్ స్టేషన్ అవసరం లేకుండానే నిర్ణీత కక్షలో తిరిగే అన్ని ఉపగ్రహాలను ఈ డేటారిలే శాటిలైట్ పర్యవేక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మారిషస్, బ్రూనై, ఇండోనేషియా, బియాక్‌లో ఉండే గ్రౌండ్ స్టేషన్లను ఇస్రో ఉపయోగిస్తుంది. గగన్‌యాన్ మిషన్ కోసం కోకో దీవుల్లో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు గత నెల ఇస్రో చైర్‌పర్సన్ కే శివన్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సీఎన్ఈఎస్‌తో గగన్‌యాన్ సహకారం కోసం ఒక ఒప్పందంపై ఇస్రో సంతకం చేసింది.
చదవండి: షార్‌లో పాక్షిక లాక్‌డౌన్
Comments
Please login to add a commentAdd a comment