సూళ్లూరుపేట : ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదు అయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం వేకువజామున (బుధవారం అర్ధరాత్రి) 2.29 గంటలకు ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి 3,477 కిలోల బరువు కలిగిన జీశాట్–17 ఉపగ్రహాన్ని ఏరియన్–5 ఈసీఏ, వీఏ 238 రాకెట్ ద్వారా ప్రయోగించింది. 3,477 కిలోలు బరువు కలిగిన జీశాట్–17 ఉపగ్రహాన్ని బెంగళూరులోని ఉపగ్రహాల తయారీ కేంద్రం ఐసాక్‌లో తయారు చేసి ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ క్లీన్ రూమ్‌లో ఉపగ్రహానికి అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం రాకెట్ శిఖర భాగాన అమర్చి సిద్ధం చేశారు.
ఈ ప్రయోగాన్ని భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జామున 2.29 గంటలకు ప్రయోగించి సుమారు 22 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేశారు. ఏరియన్ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని అపోజీ (భూమికి దూరంగా) 35,975 కిలో మీటర్లు, పెరిజీ (భూమికి దగ్గరగా) 175 నుంచి 181 కిలో మీటర్లు ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (భూ బదిలీ కక్ష్య)లోకి ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణా కేంద్రం వారు స్వాధీనం చేసుకుని ఉపగ్రహంలో నింపిన 1997 కిలోల ద్రవ ఇంధనాన్ని మండించి మూడు, నాలుగు దశల్లో భూమికి 36 వేల కిలో మీటర్లు ఎత్తులోని జియో సింక్రనస్ ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు.
ట్రాన్స్‌ఫాండర్లు సంఖ్యను పెంచుకోవడానికే సమాచార ఉపగ్రహాలు
భారతదేశానికి సుమారు 550 ట్రాన్స్‌ఫాండర్లు అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 250 ట్రాన్స్‌ఫాండర్లు మాత్రమే అందుబాటలో ఉన్నాయి. వీటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇటీవల సమాచార ఉపగ్రహాలను అత్యధికంగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో జీఎస్‌ఎల్‌వీ రాకెట్లు దారా మూడు సమాచారం ఉపగ్రహాలను ఇటీవల పంపారు. ఇటీవల జీశాట్–9, జీశాట్–19 రోదసీలోకి పంపగా నేడు జీశాట్–17 ఉపగ్రహాన్ని పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సమాచార ఉపగ్రహాలను పంపే సామర్థ్యాన్ని ఇప్పుడిప్పుడే ఇస్రో సముపార్జిస్తోంది.
జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడిప్పుడే పరిణితి సాధిస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో వరుసగా నాలుగు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు విజయం సాధించడంతో దీనిపై గురి కుదిరింది. అయితే నేడు సమాచారం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానికి దేశవాళికి అందించేందుకు సమాచార ఉపగ్రహాలను ఎక్కువగా ప్రయోగించడంలో భాగంగా జీశాట్–17 ఉపగ్రహంలో 42 ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి పంపుతున్నారు. ఈ ఉపగ్రహంలో 24 సీ–బాండ్ ట్రాన్స్‌ఫాండర్లు, 2 లోయర్ సీ–బాడ్, 12 అప్పర్ సీ–బాండ్, 2 సీఎక్స్, 2 ఎస్‌ఎక్స్ ట్రాన్స్‌ఫాండర్లును అమర్చి పంపుతున్నారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది.
ఇస్రో ఖాతాలో మరో విజయం
Published Thu, Jun 29 2017 9:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
Advertisement
Advertisement