జీఐ శాట్–1ను తీసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ మార్క్–2 రాకెట్ నమూనా ఇది
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతనంగా రూపొందించిన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐ శాట్–1)ను మార్చి 5వ తేదీన ప్రయోగించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా మార్చి 10న రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒకే నెలలో రెండు ప్రయోగాలు చేయనుండటంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు.
ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం
2,100 కిలోల బరువైన జీఐ శాట్–1 ఇస్రో చరిత్రలో నూతన ఉపగ్రహం. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–10 (జీఎస్‌ఎల్‌వీ మార్క్–2) రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ నుంచి జీఐ శాట్–1 ఉపగ్రహం గత ఏడాది డిసెంబర్ 23న షార్‌కు చేరుకుంది. దీనిని ఈ ఏడాది జనవరి 15న ప్రయోగించాలని తొలుత భావించారు. సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు. రాకెట్‌కు శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి హీట్‌షీల్డ్ క్లోజ్ చేసే క్రమంలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపంతో ఈనెల 25కు వాయిదా వేసుకున్నారు. సాంకేతికపరమైన లోపాన్ని సవరించే క్రమంలో కాస్త ఆలస్యం కావడంతో మార్చి 5న దీనిని ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జీఐ శాట్ ప్రత్యేకతలివీ..
నూతన ఉపగ్రహం జీఐ శాట్–1ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూ స్థిర కక్ష్య)లోకి ప్రవేశపెడతారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు) భూమికి 506 నుంచి 830 కిలోమీటర్లు ఎత్తులో వున్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూ స్థిర కక్ష్య)లోకి పంపేవారు. ఈసారి జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్ట మొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపించి పనిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం విశేషం.
ఈ తరహా ఉపగ్రహాల్లో జీఐ శాట్–1 ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ప్రయోగం తరువాత జూలైలో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–12 రాకెట్ ద్వారా జీఐ శాట్–2 ఉపగ్రహాన్ని కూడా పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దేశ భద్రత, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. అదేవిధంగా మార్చి 10న పీస్‌ఎల్‌వీ సీ–49 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)ను ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment