ఏలియన్స్, స్పీసిస్ తదితర సినిమాలు చూస్తే గ్రహాంతరవాసులు మనపై దాడికి వస్తారని భావించే ప్రజలున్నారంటే నమ్ముతారా? మనదగ్గర ఉండకపోవచ్చు కానీ, పాశ్చాత్య దేశాల్లో ఈ నమ్మకాన్ని ఒక మతంలాగా పాటించేవారు కోకొల్లలు. నిజంగా మనం కాకుండా విశ్వంలో జీవం ఉందనేది నిరూపణ కాని ఊహ మాత్రమే! మనిషి ఎంత విజ్ఞానం సాధించానని భావించినా అతని మనసులో ఒక వెలితి తీరట్లేదు. ఈ విశాల విశ్వంలో తాను ఒంటరినా? కనీసం సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై జీవం ఉందా? ఉంటే మన కన్నా ఎక్కువ తెలివైనవా? లేక అల్పజీవులా?.. ఈ ప్రశ్నలకు సంపూర్ణ సమాధానాలు ఇంకా దొరకలేదు.
దీంతో తనకు చేతనైన రీతిలో గ్రహాంతర జీవుల కోసం ‘విశ్వ’ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రుడితో మొదలెట్టి ఇతర గ్రహాలకు శాటిలైట్లు పంపి శోధిస్తున్నాడు. ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన సమాధానాలు దొరక్కపోయినా, కొన్ని గ్రహాల్లో మాత్రం గతంలో జీవం ఉండేదనేందుకు స్వల్ప ఆధారాలు లభించాయి. అయితే ఈ ఆధారాలతో సమస్య తీరకపోగా కొత్తగా మరో ప్రశ్న మొదలైంది. ఒకవేళ ఇతర గ్రహాలపై జీవం ఉండేదనుకుంటే, ఇప్పుడేమైందనేది కొత్త ప్రశ్న!
మంగళుడిపై మనుగడ
తాజాగా కుజగ్రహంపై కనిపిస్తున్న నల్లటి చారికలు ఆ గ్రహంపై జీవం ఉందనేందుకు నిదర్శనమని తాజాగా సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపితే సదరు జీవజాలం ఎలా మాయమైందన్న విషయం తెలియవచ్చని, తద్వారా భూమిపై ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడవచ్చని వీరి ఆలోచన. మార్స్(కుజుడు) పై కనిపించే నల్లటి చారికలు ద్రవరూప పదార్ధాలు ప్రవహిస్తే ఏర్పడే కయ్యల్లాగా ఉన్నాయి. ఇవి ఈ గ్రహంపై ఉండే కరిగే మంచుకు, కుజుడి ఉపరితలంపై ఉండే ఉప్పురాతి శిలలకు మధ్య జరిగే రసాయన చర్య వల్ల ఏర్పడ్డాయని సైంటిస్టుల ఆలోచన.
కుజుడిపై దాదాపు మైనస్ 60 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. అందువల్ల మంచు ఏర్పడేందుకు ఛాన్సులు ఎక్కువ. మరి మంచు ఉంటే జీవముండాలి కదా అని ప్రశ్నిస్తే ప్రస్తుతం ఆ మంచు జీవం మనుగడ సాధించలేనంత ఉప్పుతో కలిసి ఉన్నందున జీవం లేదని, కానీ 200– 300 కోట్ల సంవత్సరాల క్రితం మాత్రం మార్స్‌పై జీవం ఉండే ఉండొచ్చని కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నారు. అయితే అది ఎందుకు అంతర్ధానమైందో ఇంకా తెలియరాలేదని, మరిన్ని పరిశోధనలతో కానీ ఈ విషయం నిర్ధారించలేమని సైంటిస్టులు చెప్పారు. కాబటి.. మన పొరుగు గ్రహం నుంచి మనపైకి దాడికి వచ్చే ఏలియన్స్ అయితే ఇంకా ఏమీ లేవని భరోసాతో ఉండొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment