తిరుపతి కల్చరల్ : శ్రీహరి కోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ప్రయోగిస్తున్న ఆదిత్య ఎల్1 మిషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని సందర్శించేందుకు సైన్స్‌సెంటర్‌లో లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఈ మేరకు రీజనల్ సైన్స్‌సెంటర్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ మాట్లాడుతూ శనివారం ఉదయం 11 గంటలకు నుంచి లైవ్ స్క్రీనింగ్ ఉంటుందని, మధ్యాహ్నం 12 గంటలకు ఆదిత్య ఎల్1 మిషన్‌పై ప్యానెల్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు, అన్ని పాఠశాలల విద్యార్థుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు సైన్స్ సెంటర్ విద్యా విభాగం 0877–2286202, 7989694681 నంబర్లను సంప్రదించాలని కోరారు.
సూళ్లూరుపేట: సౌరగోళంలో గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ ప్రయోగించనుంది. 1480.7 కిలోల ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా శనివారం ఉదయం 11.50 గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యుడిపై దాగి వున్న రహస్యాలను ఛేదించనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతో పాటు కాంతిమండలం (ఫోటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సూర్యుడిపై అధ్యయనానికి ఇస్రో మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగం చేపట్టింది.
పరిశోధనలకు ‘పేలోడ్స్’
ఆదిత్య ఎల్1 ఉపగ్రహంలో ఏడు పేలోడ్స్ అమర్చి పంపుతున్నారు. 1,231 కేజీలు ద్రవ ఇంధనంతో ఉపగ్రహం నింపబడింది. మిగిలిన 249 కేజీలు పేలోడ్స్ బరువు వుంటుంది. ఉపగ్రహాన్ని సూర్యుడి వైపు తీసుకెళ్లేందుకు ద్రవ ఇంధనం అవసరం . మొదట ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత భూమికి 15 లక్షలు కిలోమీటర్లు దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేయడానికి 175 రోజులు పడుతుంది. ఆదిత్య ఎల్–1 ఉపగ్రహంలో సూర్యుడిపై అధ్యయనం చేయడానికి యాస్‌పెక్స్, సూట్, వెల్సీ, హెలియోస్, పాపా, సోలెక్స్, మాగ్ అనే ఏడు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చారు.
► 170 కేజీల బరువు గల విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ ( వెల్సీ) అనే పేలోడ్ ద్వారా సౌర వాతావరణం ఎందుకు వేడిగా వుంటుంది. సూర్యుడిలో మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూమి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది.
► సౌర అతినీలలోహిత ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) అనే పేలోడ్ 35 కేజీల బరువు వుంటుంది. 200–400 ఎన్‌ఎం తరంగధైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుడిని గమనిస్తుంది. ఇందులో 11 ఫిల్టర్లను ఉపయోగించడం ద్వారా సౌర వాతావరణంలో వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను అందిస్తుంది.
► ఇది సూర్యుడ్ని నిరంతరం గమనిస్తూనే వుంటుంది. ఇస్రో ఇతర సంస్థల సహకారంతో పుణేలోని ఇంటర్–యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఏఎన్ రామ్ ప్రకాష్, దుర్గేష్ త్రిపాఠి నేతృత్వంలో ఈ పేలోడ్‌ను అభివృద్ది చేశారు.
► ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పర్‌మెంట్ (యాస్‌పెక్స్) అనే పేలోడ్ ద్వారా సౌర గాలి వైవిద్యం, లక్షణాలను తెలియజేయడమే కాకుండా దాని వర్ణ పటం లక్షణాలను అధ్యయనం చేస్తుంది.
► ఆదిత్య ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ (పాపా) సౌరగాలి కూర్పు దాని శక్తి పంపిణీని అర్థం చేసుకోవడానికి పరిశోధన చేస్తుంది.
► సోలార్ ఎనర్జీ ఎక్స్–రే స్పెక్ట్రోమీటరు (సోలెక్స్) సోలార్ కరోనా సమస్యాత్మకమైన కరోనల్ హీటింగ్ మెకానిజాన్ని అధ్యయనం చేయడానికి, ఎక్స్–రే మంటలను పర్యవేక్షించడానికి పరిశోధనలు చేస్తుంది.
► హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్–రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్) సౌర కరోనాలో డైనమిక్ ఈవెంట్‌లను గమనించడానికి, విస్పోటనం..సంఘటనల సమయంలో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది.
► మ్యాగ్ అనే ఈ పేలోడ్‌ను మాగ్నోమీటర్ అని కూడా అంటారు. ఆదిత్య ఎల్1 ఉపగ్రహానికి ఆన్‌బోర్డు ఉపకరణంగా అమర్చి పంపుతున్నారు. ఇది ఉపగ్రహానికి సంబంధించి సమాచారాన్ని అందించేందుకు వినియోగిస్తారు.
ఆదిత్యుడిపై అధ్యయనం
భారత అంతరిక్ష పరశోధన సంస్థ సత్తా చాటుతోంది. దేశ ప్రతిష్ట ఇనుమడించేలా నూతన ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవలే చంద్రయాన్–3 ద్వారా జాబిలిపై కాలుమోపింది. ప్రస్తుతం ఆదిత్య–ఎల్1తో సూర్యుడి రహస్యాల ఛేదనకు సన్నద్ధమైంది. సౌరగోళంలో వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ ద్వారా ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment