రైలు ఢీకొని విద్యార్థి దుర్మరణం
పుత్తూరు : రైలు ఢీకొన్న ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి పుత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకొంది. రైల్వే ఎస్‌ఐ రవి కథనం మేరకు.. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం అంజూరు గ్రామానికి చెందిన ఎం.బాలాజీ (20) పుత్తూరు బీసీ హాస్టల్‌లో ఉంటూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రైల్వే స్టేషన్ సమీపంలోనే హాస్టల్ ఉండడంతో గురువారం రాత్రి 8 గంటల సమయంలో పట్టాలు దాటుతుండగా రేణిగుంట నుంచి చైన్నె వెళుతున్న కొల్లాం ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లోకో పైలట్ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్‌ను ఢీకొన్న బైక్
– ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
తవణంపల్లె : మండలంలోని తిరుపతి– బెంగుళూరు హైవేలో తెల్లగుండ్లపల్లె సమీపంలో డాబా వద్ద అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు గాయపడినట్లు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిరణ్‌కుమార్ (11) చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. ఎస్‌ఐ కథనం మేరకు తిరుపతికి చెందిన వినయ్, కిరణ్‌కుమార్, నిరూప ముగ్గురూ ద్విచక్ర వాహనంలో వస్తుండగా వినయ్ వేగంగా ద్విచక్ర వాహనం నడిపి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కిరణ్‌కుమార్ తలకు తీవ్రమైన గాయం కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బైక్ నడుపుతున్న వినయ్, కిరణ్‌కుమార్ తల్లి నిరూప కూడా గాయపడ్డారు. మృతుడు కిరణ్‌కుమార్ తల్లి నిరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మద్యం స్వాధీనం
బంగారుపాళెం : మండలంలోని తుంబకుప్పంలో శుక్రవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మునిరత్నంరెడ్డి తన ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి 30 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment