టీటీడీ బోర్డు సభ్యుడిని తొలగించాలి
– మాజీ మంత్రి ఆర్కేరోజా
నగరి : టీటీడీ ఉద్యోగిపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడిని తొలగించాలని మాజీ మంత్రి ఆర్కేరోజా ఎక్స్‌లో డిమాండ్ చేశారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానమని, అలాంటి గొప్ప వ్యవస్థలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉద్యోగులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో వున్న ఉద్యోగిపై బోర్డు సభ్యుడు అనుచితంగా ప్రవర్తించడం తగదన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదని, కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎదుటే చైర్మన్, ఈఓ నిందించుకున్నారంటే పాలన ఎంత బాగుందో అర్దమవుతోందన్నారు. జగనన్న పాలనలో ఇలాంటి ఘటనలు ఏ రోజూ జరగలేదన్నారు. పాలకుడు అంటే భయం ఉంటే పరిస్థితులు సవ్యంగా ఉంటాయన్నారు. వెంటనే బాధ్యతా రహితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడిని ప్రభుత్వం తొలగించాలన్నారు. ఆత్మ గౌరవం కోసం ఆందోళన చేస్తున్న టీటీడీ ఉద్యోగులకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నానన్నారు.
మామిడిలో
తెగుళ్ల నివారణకు చర్యలు
బంగారుపాళెం : మామిడిలో సస్యరక్షణ చర్యలు పాటించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని గోవర్ధనగిరి, తగ్గువారిపల్లె గ్రామాల్లో రైతుల మామిడి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మామిడి తోటల్లో పూత దశలో కనిపించే పురుగు, తెగుళ్ల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పూత దశలో గొంగళి పురుగు నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా రోగర్ 2 మి.లీ, వేపనూనె 2 ఎంఎల్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. లేదా జంప్ 0.4 గ్రాములును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. మామిడిలో కవర్ల ఏర్పాటు చేసుకోవడం ద్వారా నాణ్యమైన పంటను పొందేందుకు అవకాశం ఉందన్నారు. మామిడి కవర్లను ఉద్యానశాఖ ద్వారా 50 శాతం రాయితీతో రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. రాయితీ మామిడి కవర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి సాగరిక, సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా ఆవులపబ్బం
చౌడేపల్లె : మండలంలోని పరికిదొన గ్రామంతో పాటు మరో పదకొండు గ్రామాల్లో రెండు రోజులుగా నిర్వహించిన ఆవులపబ్బం పండుగ శుక్రవారంతో ముగిసింది. గడ్డంవారిపల్లె, పరికిదొన, ఆమినిగుంట పంచాయతీల్లోని పన్నెండు గ్రామాలకు చెందిన మహిళలు ఊరేగింపుగా కాటమరాజుల ఆలయం వద్దకు చేరుకొన్నారు. అనంతరం భక్తి శ్రద్ధలతో కాటమరాజు స్వామికి , నడివీధి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండేలా కరుణించాలని శాంతి పూజలు చేశారు.
అత్త చెయ్యి నరికిన అల్లుడు
గంగవరం: తన భార్యపై కత్తితో దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తి... అడ్డువచ్చిన అత్త చెయ్యి నరికేశాడు. ఈ ఘటన గంగవరం మండలంలోని గండ్రాజుపల్లి పంచాయతీ పెద్ద ఉగిణి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పెద్ద ఉగిణి గ్రామానికి చెందిన యూనిస్, సాల్మాకు రెండేళ్ల కిందట వివాహమైంది. యూనిస్ మద్యానికి బానిసగా మారి తనను వేధిస్తున్నాడని సల్మా వారం కిందట పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి రోజూ యూనిస్ మద్యం తాగి అత్తవారింటికి వెళ్లి గొడవ చేస్తున్నాడు. గురువారం రాత్రి కూడా మద్యం తాగిన యూనిస్ అందరూ నిద్రిస్తున్న వేళ కత్తి తీసుకుని అత్తవారింటికి వెళ్లి భార్య సల్మాపై దాడికి ప్రయత్నించాడు. ఆమె భయంతో ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆ సమయంలో అడ్డువచ్చిన అత్త షమీలపై యూనిస్ కత్తితో దాడి చేయగా, ఆమె చెయ్యి తెగి పడింది. సల్మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గంగవరం పోలీసులు శుక్రవారం యూనిస్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన షమీలను చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా, మెరుగైన చికిత్స కోసం తిరుపతికి రెఫర్ చేశారు.
టీటీడీ బోర్డు సభ్యుడిని తొలగించాలి
Comments
Please login to add a commentAdd a comment