
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు భారత్ చేపట్టిన ప్రయోగం ‘మిషన్ శక్తి’తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. అంతరిక్ష రంగంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు ఇరు దేశాలు కలసి పనిచేయాలని పిలుపునిచ్చింది. మిషన్ శక్తి తరువాత అంతరిక్షంలో 400 శకలాలు మిగిలిపోయాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మంగళవారం పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి రాబర్ట్ పాలడినో బుధవారం మాట్లాడుతూ అంతరిక్షంలో ఉపగ్రహ శకలాలు మిగిలిపోవడం ఆందోళనకరమే అయినా, ఈ సమస్యను పరిష్కరించేలా పరీక్షను నిర్వహించామని భారత్ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. భారత్‌తో అమెరికాకు పటిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రెండు దేశాలు కలసిపనిచేయాలని అభిప్రాయపడ్డారు.